పట్టణ ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఆధిక్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : పురపాలక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధిక్యం చూపింది. రెండు మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో ఒక మునిసిపాలిటీని, ఒక నగరపంచాయతీని కైవసం చేసుకుంది. ఇతరుల మద్దతుతో మరో మునిసిపాలిటీలో పాగా వేసే స్థాయిలో ఉంది. టీఆర్‌ఎస్ ఇతరుల మద్దతుతో రెండు నగర పంచాయతీల్లో చైర్మన్ పదవి దక్కించుకునే స్థితిలో నిలిచింది. జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు... పరకాల, భూపాలపల్లి, నర్సంపేట నగరపంచాయతీలకు ఈ ఏడాది మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ఈ ఓట్ల లెక్కింపు సోమవారం జరిగింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు నాలుగు రోజుల ముందు వెలువడిన ఈ ఫలితాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మునిసిపల్ ఫలితాల మాదిరిగానే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆధిక్యం చూపుతామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మునిసిపల్ ఫలితాలు తాము ఊహించిన విధంగానే ఉన్నాయని... సాధారణ ఎన్నికల్లో తమకే ఆధిక్యం ఉంటుందని టీఆర్‌ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక.. మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దయనీయమైన ఫలితాలు వచ్చాయి. మొత్తం 116 వార్డులకు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం ఆరు వార్డుల్లోనే విజయం సాధించింది. బీజేపీ ఎనిమిది వార్డులతో మూడో స్థానం దక్కించుకుంది. సీపీఎం 6, సీపీఐ 4 వార్డులను గెలుచుకున్నాయి. పరకాలలోని ఒక వార్డును బీఎస్పీ దక్కించుకుంది. ఐదు పాలకవర్గాల్లో కలిపి 11 మంది స్వతంత్రులు కౌన్సిలర్లుగా గెలిచారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గ కేంద్రం జనగామ మునిసిపాలిటీలో కాంగ్రెస్ మెజారిటీ వార్డులు గెలుచుకుంది. పోలింగ్‌కు ముందే ఒక వార్డును హస్తగతం చేసుకుంది. తుది ఫలితాల్లో కాంగ్రెస్ మరో 13 వార్డులను గెలుచుకుంది. 28 వార్డులు ఉన్న జనగామ మునిసిపాలిటీలో 14 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు విజయబావుటా ఎగురవేశారు.
మహబూబాబాద్ మునిసిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే కవితకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఇక్కడి చైర్మన్ ఎన్నిక... ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంపై ఆధారపడనుంది. కలిసి పోటీ చేసిన టీఆర్‌ఎస్-సీపీఐలకు 10 వార్డులు వచ్చాయి. టీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థిగా భావించిన నేత కౌన్సిలర్‌గా ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులుగా పోటీ చేసిన ముగ్గురు గెలిచారు. వీరితోపాటు సీపీఎం మద్దతుతో చైర్‌పర్సన్ సీటును దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
మునిసిపల్ ఎన్నికలు జరిగిన సమయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దొంతి మాధవరెడ్డి సొంత నియోజకర్గ కేంద్రం నర్సంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటారు. నర్సంపేటలో కాంగ్రెస్‌కు 12 స్థానాలు దక్కాయి. సాధారణ ఎన్నికల్లో టికెట్ దక్కపోవడంతో దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా నర్సంపేట ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నర్సంపేటలో కాంగ్రెస్ కౌన్సిలర్లుగా ఎన్నికైన 12 మంది దొంతి మాధవరెడ్డితోనే ఉంటామని చెప్పారు. దీంతో ఇక్కడ పాలకవర్గం కాంగ్రెస్‌లో ఉంటుందా.. లేదా అనేది మాధవరెడ్డి ఎన్నికల ఫలితాన్ని బట్టి తేలనుంది.
పరకాల నగరపంచాయతీలో మిగిలిన పార్టీల కంటే ఎక్కువగా టీఆర్‌ఎస్ ఎనిమిది సీట్లు గెలుచుకుంది. ఇక్కడి చైర్‌పర్సన్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. టీఆర్‌ఎస్ తరఫున ఎన్నికైన కౌన్సిలర్లలో ఈ వర్గం వారు ఒక్కరూ లేరు. టీఆర్‌ఎస్ రెబెల్‌గా పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్‌ను చైర్మన్‌గా చేసి గులాబీ పార్టీ ఇక్కడ పాలకవర్గవర్గాన్ని కైవసం చేసుకునే పరిస్థితి ఉంది.
భూపాలపల్లి నగరపంచాయతీలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు సమానంగా ఏడు వార్డులు దక్కాయి. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన సీపీఐ ఒక వార్డును గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఒక కౌన్సిలర్ టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించినట్లు తెలిసింది. రెండు చొప్పన వార్డులను గెలుచుకున్న బీజేపీ, టీడీపీ ఇక్కడ టీఆర్‌ఎస్‌కు మద్దుతు ఇచ్చే అవకాశం ఉంది.