సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఉత్కంఠభరితంగా సాగిన పురపోరులో భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ రెండు, టీడీపీ రెండు గెలుచుకోగా.. ఒక దాంట్లో మిశ్రమ ఫలితం వచ్చింది. జిల్లాలోని వికారాబాద్, బడంగ్‌పేట పురపాలక సంఘాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట నగర పంచాయతీలను తెలుగుదేశం చేజిక్కించుకుంది. మరోవైపు తాండూరులో మజ్లిస్ పుంజుకోవడమే కాకుండా అతిపెద్ద పార్టీగా అవతరించింది. టీఆర్‌ఎస్‌తో సమానంగా పది వార్డులను గెలుచుకుని చైర్మన్ రేసులో నిలిచింది.
నగర పంచాయతీగా ఏర్పడిన తర్వాత బడంగ్‌పేటకు తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మొత్తం 20 వార్డుల్లో 15 స్థానాలను గెలుచుకొని ఆధిక్యత కనబరిచింది. ఇక్కడ టీడీపీ ఒక వార్డుతోనే సరిపెట్టుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 4 వార్డులు గెలుచుకున్నారు.
కొత్తగా ఏర్పడిన పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలను టీడీపీ కైవసం చేసుకుంది. ఈ రెండింటిలోనూ మిత్రపక్షమైన బీజేపీతో కలిసి చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించింది. పెద్దంబర్‌పేటలో 20 వార్డులకు టీడీపీ 9, కాంగ్రెస్ 6, బీజేపీ 3, స్వతంత్రులు 1, ఒకరు ఏకగ్రీవంగాను ఎన్నికయ్యారు. ఇబ్రహీంపట్నంలో 20 వార్డులకు గాను టీడీపీ 10, కాంగ్రెస్ 4, బీజేపీ 4, టీఆర్‌ఎస్ 1, స్వతంత్రులు 1 స్థానాలు గెలుపొందారు. కాంగ్రెస్ నైతల అనైక్యత, లుకలుకలను అనూకులంగా మలుచుకుని విజయం సాధించింది.