స్వతంత్రులే కీలకం..!
సాక్షి, హన్మకొండ : జిల్లాలోని రెండు మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీల పరిధిలో ఓటర్లు భిన్నమైన తీర్పు ఇచ్చారు. జనగామ మునిసిపాలిటీ, నర్సంపేట నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. భూపాలపల్లి, పరకాల నగర పంచాయతీ, మహబూబాబాద్ మునిసిపాలిటీలో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. ఈ మూడింటిలోనూ హంగ్ ఏర్పడడంతో స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. ఈ మేరకు వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు పుర పీఠాన్ని ఆశిస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్వతంత్రులకు చైర్మన్ పదవులు ఇచ్చేందుకు పార్టీలు సైతం సై అంటున్నారుు.
మహబూబాబాద్ మునిసిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా, చైర్‌పర్సన్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించారు. సోమవారం వెల్లడించిన ఫలితాల్లో కాంగ్రెస్ -7, టీఆర్‌ఎస్-7, సీపీఏం-5, సీపీఐ-3, టీడీపీ-3, స్వతంత్రులు-3 స్థానాల్లో విజయం సాధించారు. సీపీఎం పార్టీ నుంచి గెలిచిన ఐదుగురు వార్డు కౌన్సిలర్లు, స్వతంత్రుల మద్దతు ఎవరికి లభిస్తే.. వారే చైర్‌పర్సన్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి 14వ వార్డులో భూక్యా ఉమ, 15వ వార్డులో బానోతు స్వాతి, 20వ వార్డులో భూక్యా స్వప్న గెలుపొందారు. వీరు కాంగ్రెస్ తరఫున చైర్‌పర్సన్ రేసులో ఉన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి అవకాశం వస్తే 17వ వార్డు నుంచి విజయం సాధించిన బానోతు ఇషాకు అవకాశం ఉంది.
పరకాల నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ చైర్‌పర్సన్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అరుుంది. కాంగ్రెస్-6, టీఆర్‌ఎస్-8, బీజేపీ-2, బీఎస్పీ-1, స్వతంత్రులు-3 స్థానాలను గెలుచుకున్నారు. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. ఎక్కువ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించినా.. ఆ పార్టీ నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరూ విజయం సాధించలేదు. ఫలితంగా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చే స్వతంత్రులు, ఇతర పార్టీల వార్డు సభ్యులు చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో 2వ వార్డు నుంచి గెలుపొందిన బొచ్చు దిలీప్ (బిక్షపతి-స్వతంత్ర), 20వ వార్డు నుంచి విజయం సాధించిన మార్త రాజభద్రయ్య (స్వతంత్ర)తోపాటు 3వ వార్డు నుంచి ఒంటేరు స్వప్న (బీఎస్పీ) చైర్‌పర్సన్ రేసులో ముందుకొచ్చారు. ఒకవేళ పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలిస్తే ఒకటో వార్డు అభ్యర్థి మడికొండ సంపత్, 12వ వార్డు అభ్యర్థి కొయ్యాడ మల్లికాంబలో ఎవరో ఒకరు చైర్‌పర్సన్ పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది.
భూపాలపల్లి నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ చైర్మన్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అరుుంది. సోమవారం వెల్లడించిన ఫలితాల్లో టీఆర్‌ఎస్-7, కాంగ్రెస్-7, బీజేపీ-2, టీడీపీ 2, సీపీఐ-1, స్వతంత్రులు-1 స్థానాల్లో విజయం సాధించారు. ఇక్కడా హంగ్ ఏర్పడడంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తోపాటు మద్దతిచ్చే ఇతర పార్టీలు కూడా కీలకమైన చైర్‌పర్సన్ స్థానాన్ని ఆశించే అవకాశం ఉంది. ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున 19వ వార్డు అభ్యర్థి బండారి సంపూర్ణ విజయం సాధించారు. బీజేపీ నుంచి 4వ వార్డులో బి.పద్మ గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 17వ వార్డులో దార పులమ్మ, 20వ వార్డులో చల్లూరి సమ్మయ్య విజయబావుటా ఎగురవేశారు. వీరందరూ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు.
జనగామ మునిసిపాలిటీలో 28 వార్డులు ఉన్నాయి. చైర్‌పర్సన్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మెజార్జీ వార్డులను గెలుచుకుంది. ఆ పార్టీకి చెందిన వెన్నం శ్రీలత, వేమల్ల పద్మ, జక్కుల అనిత, వంగాల కళ్యాణి చైర్‌పర్సన్ రేసులో ఉన్నారు.
నర్సంపేట నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా... చైర్మన్ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్ అరుుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులు విజయం సాధించారు. బీసీ సామాజిక వర్గం నుంచి విజయం సాధించిన పాలాయి శ్రీనివాస్ , పాలెల్లి రాంచంద్రయ్య, నాగెళ్లి వెంకటనారాయణగౌడ్‌లో ఎవరో ఒకరు చైర్మన్ అయ్యే అవకాశం ఉంది.