రుద్రవరం: ఒక్కగానొక్క కుమారుడు నదిలో గల్లంతయ్యాడని తెలిసి ఆ వృద్ధ తల్లిదండ్రుల గుండె పగిలింది. రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడం రోజురోజుకూ కుంగదీసింది. ఎక్కడో ఒక చోట బతికే ఉంటాడనే ఆశ.. ఎప్పటికైనా తిరిగొస్తాడనే నమ్మకంతో ఎదురుచూస్తున్న వారికి చేదు వార్త అందనే అందింది. ఏదైతే జరగకూడదని అనుకున్నారో ఆ ఘోరం చెవినపడింది. చేతికందివచ్చిన కుమారుడు ఇక లేడని తెలిసి మండల పరిధిలోని ఆలమూరుకు చెందిన ఆ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు.
వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కొర్రె పెద్దనాగిశెట్టి, లక్ష్మీనర్సమ్మలకు ఇరువురు కుమార్తెలు, కుమారుడు ప్రహ్లాదుడు(24) సంతానం. ఇతను గత నెల 5న హిమాచల్‌ప్రదేశ్‌లోని దండి జిల్లాలో ఉన్న బియాస్ నదిలో గల్లంతయ్యాడు. హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థుల విహారయాత్రకు వరుసకు మామ అయిన మురళి టూర్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించాడు. అక్కడ ఓ చిరుద్యోగం చూసుకొని కుటుంబానికి ఆసరగా ఉండాలని వెళ్లిన ప్రహ్లాదుడుని ఆయన తన వెంటతీసుకెళ్లాడు.
నది వద్ద విద్యార్థులు ఫొటోలు దిగుతుండగా సమీపంలోని లార్జి డ్యాం నుంచి అకస్మాత్తుగా నీరు విడుదల కావడంతో వారిని అప్రమత్తం చేయబోయి ప్రహ్లాదుడు కూడా కొట్టుకుపోయాడు. గాలింపు చర్యల్లో భాగంగా బియాస్ నదిలో అతని మృతదేహం లభించినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అందిన సమాచారాన్ని రుద్రవరం తహశీల్దార్ వెంకటేశ్వర్లు మంగళవారం కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
డిగ్రీ పూర్తి చేసిన ప్రహ్లాదుడు చిరుద్యోగం చూసుకునేందుకు హైదరాబాద్‌కు వెళ్లి మృత్యువాత పడిన ఘటన కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో విషాదం నింపింది. ఇప్పటికే అనారోగ్యంతో మంచంపట్టిన మృతుని తల్లిదండ్రులు ఈ విషాద వార్తతో కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహం బుధవారం ఉదయం గ్రామానికి చెరనుండటంతో కడసారి చూపునకు వారు గుండెలు చిక్కబట్టుకుని ఎదురుచూస్తున్నారు.
బియాస్ నదిలో గల్లంతైన ప్రహ్లాదుడు మృతి
Published Wed, Jul 16 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM
Advertisement