టీచర్ అసభ్య ప్రవర్తన గురించి ఎంఈఓకు వివరిస్తున్నఎల్లావత్తుల ప్రాథమిక పాఠశాల విద్యార్థినులు
రుద్రవరం(ఆళ్లగడ్డ) : ఉపాధ్యాయులు..సమాజ నిర్దేశకులు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే గురుతర బాధ్యత కల్గిన వారు. అలాంటి వారి నడవడిక ఎంతో ఉన్నతంగా, ఆదర్శప్రాయంగా ఉండాలి. కానీ కొందరు దారి తప్పుతున్నారు. తమ ‘స్థాయి’ మరచి ప్రవర్తిస్తున్నారు. తద్వారా అపవాదును మూటగట్టుకుంటున్నారు. రుద్రవరం మండలం ఎల్లావత్తుల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల (మెయిన్)లో ఎస్జీటీగా పనిచేస్తున్న రామకృష్ణ అకృత్యాలు వెలుగు చూశాయి. బడిలోనే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడమే కాకుండా చిన్నారులతో వెకిలిచేష్టలు చేస్తుండడంతో అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో మండల విద్యాధికారి సాహెబ్
హుస్సేన్ గురువారం పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నారులు కన్నీటి పర్యంతమవుతూ టీచర్ వెకిలిచేష్టల గురించి వివరించారు. ‘టీచర్ తరగతి గదిలోకి వచ్చిన వెంటనే ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇక్కడికొస్తుంది. ఆమెతో కొంతసేపు మాట్లాడతాడు. తరువాత మమ్మల్ని బయట కూర్చోమని పెద్దగా చదవమంటాడు. తర్వాత వారిద్దరే గదిలో ఉంటారు. అంతేకాకుండా ఐదో తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవరిస్తున్నాడు. అవసరం లేకపోయినా దగ్గరకు తీసుకుని ఒళ్లంతా నిమరడం..అసభ్యకరంగా మాట్లాడడం చేస్తుంటాడు.
ఈ విషయాలను బయటకు చెప్పామన్న కోపంతో మమ్మల్ని చితకబాదుతున్నాడ’టూ ఎంఈఓ ఎదుట వాపోయారు. కాగా.. టీచర్ రామకృష్ణ ప్రవర్తనపై సదరు పాఠశాల హెచ్‌ఎం కూడా విసుగు చెందారు. తనను హెచ్‌ఎం బాధ్యతల నుంచి తప్పించాలని ఎంఈఓకు లేఖ రాయడం గమనార్హం. అనారోగ్య కారణాలు చూపుతున్నప్పటికీ సదరు టీచర్ కారణంగా ఏదైనా ఘటన జరిగితే హెచ్‌ఎంగా తనకు అపవాదు వస్తుందనే ఉద్దేశంతోనే బాధ్యతల నుంచి తప్పించాలని కోరినట్లు తెలుస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి విషయం రికార్డు చేసుకున్నానని, రామకృష్ణను తక్షణమే సెలవుపై వెళ్లాలని ఆదేశించానని ఎంఈఓ చెప్పారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపి.. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
వ్యాయామ టీచర్‌పై పునః విచారణ
రుద్రవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో గతంలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసిన చంద్రమోహన్‌పై డిప్యూటీ డీఈఓలు బ్రహ్మం, అరవిందమ్మ, రాజకుమారిలు గురువారం పునః విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రమోహన్ విధులు నిర్వహిస్తున్న సమయంలో బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, కొందరిపై లైంగిక వేధింపులు.. ఇతర ఆరోపణలు రావడంతో ఇక్కడి నుంచి బదిలీపై పంపారన్నారు. గతంలో విచారణ జరిపినప్పటికీ సంతృప్తికరంగా లేకపోవడంతో డీఈఓ ఆదేశాల మేరకు మళ్లీ విచారణ చేస్తున్నామన్నారు.
గతంలో పనిచేసిన హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులతో విడివిడిగా మాట్లాడి.. లిఖిత పూర్వకంగా రాయించుకున్నట్లు తెలిపారు. ఈ నివేదికను డీఈఓకు అందజేస్తామన్నారు. గతంలో చంద్రమోహన్ అసభ్యకరంగా ఫొటోలు తీసి ఇతరులకు చూపడంతో మనస్తాపానికి గురైన పదో తరగతి విద్యార్థిని అత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతనిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు, విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment