కీచకులు | Ashrams girls defense drought | Sakshi
Sakshi News home page

కీచకులు

Published Sat, Jan 4 2014 2:36 AM | Last Updated on Fri, Nov 9 2018 4:20 PM

Ashrams girls defense drought

ఉట్నూర్, న్యూస్‌లైన్ : అక్షరం నేర్పాల్సిన చేతులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాయి.. విజ్ఞా నం పంచాల్సిన బడిలో వెకిలి చేష్టలు రాజ్యమేలుతున్నాయి.. కామంతో కళ్లు మూసుకుపోయిన కీచకులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.. వీరికితోడు వార్డెన్ నుంచి హెచ్‌ఎంల వరకు బాలికల పాలిట రాబంధువులగా మారుతున్నారు.. బాలికలు బడిలో ఉండి చదువుకోవాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. ఇదంతా కూడా ఐటీడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కేజీబీవీ, గురుకులంలో విద్యను అభ్యసిస్తున్న బాలికపై కీచక చర్యలు.. తాజాగా నార్నూర్ మండలం జామ్‌డా బాలికల ఆశ్రమంలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిని వేధిస్తున్నాడని ఆందోళన చేశారు..
 
 బాలికలకు భద్రతేది?
 ఐటీడీఏ ఆధీనంలో 37 బాలిక ఆశ్రమాలు, 13 కస్తూర్బాగాంధీ పాఠశాలలు, మూడు బాలికల గురుకుల కళాశాలలు, రెండు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 22,675 మంది గిరిజన బాలికలు చదువుకుంటున్నారు. వీరికి ప్రభుత్వం భోజన వసతితోపాటు విద్యను అందిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాలికల పాఠశాలల్లో మహిళా సిబ్బంది, లేకుంటే 50 ఏళ్లు పైబడిన పురుష ఉపాధ్యాయులను నియమించాలి. కానీ ఉన్నతాధికారులు ఈ నిబంధనలను తుంగలో తొక్కడంతో వికృత చర్యలకు దారితీస్తున్నాయి. పురుష ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి సంఘటనలు సాధారణమై పోయాయి. విషయం బయటకు పొక్కితే బదిలీ లేదా సస్పెండ్ చేస్తారులే అని చేతులు దులుపుకుంటున్నారు. ఉపాధ్యాయులే కాకుండా వంటమనిషి నుంచి మొదలకుని హెచ్‌ఎంల వరకు వికృత చేష్టలకు పాల్పడుతుండటంతో బాలికలకు భద్రత లేకుండా పోతోంది. ఉన్నతాధికారులు స్పందించి కీచక పర్వానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారికి ఉద్యోగం నుంచి తొలగిస్తే కొంత వరకైనా ఇటువంటి చర్యలు అరికట్టవచ్చు.
 
 నిబంధనలకు పాతర..

  •      బాలికల ఆశ్రమాల్లో మహిళా సిబ్బందిని నియమించాలి.
  •      బాలికల ఆశ్రమాల్లో పురుష ఉపాధ్యాయులను నియమించాల్సి వస్తే 50 ఏళ్లు పైబడ్డ వారిని నియమించాలి. జిల్లా వ్యాప్తంగా బాలిక ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 121 మంది పురుష ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో అత్యధికులు 50 ఏళ్లలోపు వారే కావడం విశేషం.
  •      బాలికల ఆశ్రమాల్లో విద్యార్థినులను కలువాలంటే తల్లిదండ్రులకు, సొంత కుటుంబ సభ్యులకే అనుమతి ఉంటుంది. అది వార్డెన్ అనుమతి తీసుకుని వచ్చిన వారి వివరాలు మూమెంట్ రిజిష్టర్‌లో పొందుపరిచిన తర్వాతకే కలవాలి. విద్యార్థులను ఎవరు పడితే వారు కలుస్తున్నారు.
  •      ఆశ్రమాల్లో విద్యార్థినులను చేర్చే ముందు వారి తల్లిదండ్రులకు ఐడీ కార్డు జారీ చేస్తారు. మరోటి పాఠశాలలో ఉంచుతారు. ఆ కార్డులో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల ఫొటోలు అంటిస్తారు. ఆ ఫొటోలో ఉన్న వారు కార్డు తీసుకొస్తేనే విద్యార్థులను కలువడానికి, వారితో ఇళ్లకు పంపించాలి.
  •      కొన్ని ఆశ్రమాల్లో, బాలికల కళాశాలల్లో వార్డెన్లుగా, రాత్రి వాచ్‌మెన్‌లు పురుష సిబ్బంది ఉంటున్న అధికారులు వారి స్థానంలో మహిళలను నియమించాలి. ఈ నిబంధనలు ఆశ్రమాల్లో అమలుకావడం లేదు.
  •  మచ్చుకు కొన్ని కీచక చర్యలు..
  •      కొన్నేళ్ల క్రితం జన్నారం మండలం కవ్వాల్ బాలికల ఆశ్రమంలో బాలికపై ఓ ఉపాధ్యాయుని కీచక చర్య వెలుగులోకి వచ్చింది.
  •      2007లో మహగావ్ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని వేధింపులు భరించలేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
  •      2008-09లో జైనూర్ మండలంలోని ఓ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని గర్భం దాల్చింది. అదే మండలంలోని రాశిమెట్ట ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని బహిర్భూమికని వెళ్లి శిశువుకు జన్మనిచ్చింది.
  •      2009లో నార్నూర్ మండలంలోని బాలికల ఆశ్రమ పాఠశాల కొందరు విద్యార్థినులను జాతరకు తీసుకెళ్లడం కలకలం రేపింది.
  •      ఇచ్చోడలోని ఓ ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థి సిబ్బంది ఆకృత్యాలకు బలైంది.
  •      జైనూర్ మండలంలోని ఓ ఆశ్రమంలో విద్యార్థినిపై అఘాయిత్యం చేయబోగా తప్పించుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
  •      గతేడాది ఆసిఫాబాద్‌లో ఓ విద్యార్థిని గర్భం దాల్చిన విషయం బయటపడింది.
  •      కొన్ని నెలల క్రితం జైనూర్ మండలం బాలికల ఆశ్రమ పాఠశాలలో హెచ్‌ఎం  విద్యార్థినులకు మద్యం తాగించాడనే ఆరోపణలతోపాటు కొందరు విద్యార్థినులను ఆశ్రమం నుంచి బయటకు తీసుకెళ్లాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే ఆశ్రమంలో గత నెలలో ఓ విద్యార్థి గర్భం దాల్చిన విషయం వెలుగులోకి రాగా ఇంటి వద్దే జరిగిందని అధికారులు నిర్ధారించారు.
  •      ఉట్నూర్ డివిజన్‌లోని ఓ బాలికల వసతి గృహంలో వార్డెన్ భర్త రాత్రి వేళ వసతి గృహంకు వెళ్లి విద్యార్థినులతో అసభ్యంగా మాట్లాడటం, వ్యవహరించడం వంటి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తన సెల్‌తో బయటి వ్యక్తులతో మాట్లాడిస్తున్నాడనే ప్రచారం ఉంది.
  •      ఐటీడీఏ పరిధిలోని ఓ కేజీబీవీలో ప్రత్యేకాధికారి ఓ మహిళ సిబ్బందిపై అసభ్యకరంగా ప్రవరిచడంతోపాటు విద్యార్థినులపై అదే విధంగా వ్యవహరిస్తున్నాడని ప్రచారం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement