అనంతోగు (గుండాల), న్యూస్‌లైన్: అనంతోగు గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ఉపాధ్యాయుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ఆ పాఠశాలకు బుధవారం తాళం వేసి, గంటసేపు ధర్నా నిర్వహించారు. ఇక్కడి ఉపాధ్యాయులు స్థానికంగా ఉండడం లేదని, సమయానికి రావడం లేదని, పిల్లల బాగోగులు పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో వారు ఈ ఆందోళనకు దిగారు.
అనంతోగు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ప్రదానోపాద్యాయురాలు, వార్డెన్, ఉపాధ్యాయులు స్థానికంగా నివసించకుండా బయటి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ కారణంగా వారు పాఠశాల వేళకు రాలేకపోతున్నారు.
బుధవారం కూడా కేవలం ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు, పీఈటీ మినహా మిగిలిన వారంతా సమయానికి రాలేదు. వీరి తీరుపై విసుగెత్తిన గ్రామస్తులు, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు బుధవారం ఉదయమే ఆ పాఠశాలకు వెళ్లి తాళాలు వేసి, అక్కడే ధర్నాకు దిగారు. పాఠశాలలో 460 మంది విద్యార్థినులకుగాను బుధవారం కేవలం 220 మంది మాత్రమే ఉన్నారని, దీనికి హెచ్‌ఎం.. వార్డెన్ నిర్లక్ష్యమే కారణమని ఉపాధ్యాయులపై మండిపడ్డారు.
ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయులను దాదాపు గంటపాటు లోనికి అనుమతించలేదు. వారిపై ఉన్నతాధికారులకు ఫోన్‌లో ఫిర్యాదు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారికి ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలితో హాజరు రిజిస్టర్‌లో సీఎల్ వేయించి ఆందోళన విరమించారు. ఇక ముందు స్థానికంగా నివాసముంటామని, సరైన సమయానికి వస్తామని ఉపాధ్యాయులు బతిమిలాడ డంతో గ్రామస్తులు, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు శాంతించి, పాఠశాల తాళాలు తీసి లోనికి అనుమతించారు. ఈ ఆందళనతో, ఉపాధ్యాయులు లేకుండానే విద్యార్థినులు ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ మండల కన్వీనర్ ఎస్‌కె.ఖదీర్, నాయకులు భద్రం, లక్ష్మయ్య, గ్రామస్తులు సూరయ్య, వసంతరావు, రామారావు, భాస్కర్, రాంబాబు, ఎర్రయ్య, సమ్మయ్య, పాపారావు తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ డీడీ వివరణ
దీనిపై ఐటీడీఏ డీడీ సరస్వతిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా... పాఠశాలకు గైర్హాజరైన ఉపాధ్యాయులకు ఏజెన్సీ అలవెన్సులు నిలిపివే స్తామని అన్నారు. హెచ్‌ఎం, వార్డెన్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.