అరుదైన ఆచార్యుడు
పాఠాలు చెప్పే గురువులు చాలామందే ఉంటారు గానీ, విద్యార్థుల మనసులను ఆకట్టుకునే గురువులు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. విద్యార్థులు బ్రహ్మరథం పట్టే గురువులు మరీ అరుదుగా ఉంటారు. మన దేశానికి రెండవ రాష్ట్రపతి, మొదటి ఉపరాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అత్యంత అరుదైన గురువుల కోవలోకి చెందుతారు. రాధాకృష్ణన్ కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, ఆయనకు మైసూరు వర్సిటీకి బదిలీ అయింది. కలకత్తాను వదిలి వెళ్లేటప్పుడు విద్యార్థులు ఆయనకు ప్రత్యేకంగా పూలతో అలంకరించిన బండిని ఏర్పాటు చేశారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే స్వయంగా బండిని లాగారు.
తమ మనసులను చూరగొన్న గురువుకు ఆ విద్యార్థులు పలికిన అపురూపమైన వీడ్కోలు అది. ఇది స్వాతంత్య్రానికి ముందు జరిగిన సంఘటన. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రాధాకృష్ణన్‌ను పూజారి చేయాలని ఆయన తండ్రి భావించేవారు. ఆర్థిక కష్టాల మధ్యనే రాధాకృష్ణన్ చదువు కొనసాగించి, తత్వశాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు. తర్వాత అధ్యాపకుడిగా జీవితం మొదలుపెట్టారు. భారతీయ తత్వశాస్త్రాన్ని మథించి ఆయన రాసిన ‘ఇండియన్ ఫిలాసఫీ’ అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందింది.
రాధాకృష్ణన్ మన దేశానికి రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు బ్రిటిష్ తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ ‘ఇది తత్వశాస్త్రానికే లభించిన గౌరవం’ అని హర్షం వ్యక్తం చేశారు. తత్వవేత్తలు పాలకులు కావాలని ప్లాటో కలలు కనేవాడని, భారత్‌కు ఒక తత్వవేత్త రాష్ట్రపతి కావడం విశేషమని, దీనికి ఒక తత్వవేత్తగా తాను గర్విస్తున్నానని అన్నారు. రాధాకృష్ణన్ రాష్ట్రపతి అయిన తర్వాత పూర్వ విద్యార్థులు కొందరు ఆయన పుట్టినరోజును ఘనంగా ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే, తన పుట్టినరోజును ఉపాధ్యాయులందరినీ గౌరవించుకునే రోజుగా పాటిస్తే సంతోషిస్తానని రాధాకృష్ణన్ చెప్పారు. అప్పటి నుంచి ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5న గురు దినోత్సవంగా పాటించడం ఆనవాయితీగా వస్తోంది.