పాఠం చెప్పాల్సిందే..!
‘నేను హెడ్మాస్టర్‌ను.. పాఠాలు చెప్పడం నా బాధ్యత కాదు..’ అని అనుకుంటున్నారా? అయితే ఇక కుదరదు. ‘ఉపాధ్యాయులు పనిచేస్తున్నారా.. లేదా..? బడికి ఎవరు వచ్చినా.. నన్ను కలిసి వెళ్లాలి..’ అనే భావనను పక్కకు పెట్టాల్సిందే. టీచర్ల పర్యవేక్షణకు మాత్రమే పరిమితమైన ప్రధానోపాధ్యాయులు ఇక నుంచి పాఠాలు చెప్పాల్సిందే. వారి విధులపైన విద్యాశాఖ ప్రత్యేకదృష్టి సారించింది. ఇకనుంచి ప్రతిరోజు రెండు తరగతులు బోధించాల్సిందేనని మార్గదర్శకాలు జారీచేసింది.
పాలమూరు: మారిన పాఠ్యప్రణాళిక, సమ గ్ర నిరంతర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని అనుసరించి హెచ్‌ఎంలతో కూడా పాఠాలు చెప్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పర్యవేక్షణ విధులతోపాటు పలు కీలక బాధ్యతలు కూడా ఉన్నాయి. పాఠశాల యాజమాన్య క మిటీకి కన్వీనర్‌గా వ్యవహరించడంతో పాటు పాఠశాల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత వీరిది. పైగా వారానికి కనీసం 10తరగతులు బోధనచేసి పిల్లల సామర్థ్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరి. జిల్లాలో 565 ఉన్నత, 625 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి.
వీటిలో 524 పీజీహెచ్‌ఎంలు, మరో 530కిపైగా ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు పనిచేస్తున్నారు. అయితే తాజాగా ప్రభుత్వ విద్యావిధానంలో సమూలమైన మార్పులు తెచ్చేందుకు నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా పాఠాలు బోధించాల్సిందేనని మార్గదర్శకాలు జారీచేశారు.
తాజా మార్గదర్శకాలను అనుసరించి ప్రతీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా తప్పనిసరిగా తమ సొంత పాఠశాలలో తరగతులు బోధించాలి. సీసీఈ విధానాన్ని అనుసరించి 6, 10 తరగతుల విద్యార్థులకు ప్రతీరోజు ఒక్కో తరగతి తీసుకోవాలి. అంటే ఉదయం ఒక తరగతి విద్యార్థులకు బోధిస్తే.. సాయంత్రం మరో తరగతి విద్యార్థులకు బోధించాల్సి ఉంటుంది. ఇలా వారానికి 14 తరగతులు తీసుకొని యూనిట్ ప్రణాళికను సిద్ధంచేయాలి. ఆ తర్వాత యూనిట్ ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకోవడం, అవసరమైతే పునశ్చరణ తరగతులు తీసుకోవాలని ఆదేశాల సారాంశం.
అమలయ్యేనా?
విద్యాశాఖ అధికారుల మార్గదర్శకాలను జిల్లాలో ఏ మేరకు అమలు చేస్తారన్నది అయోమయంగా మారింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు విధులకు సక్రమంగా వెళ్లకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనికితోడు పలువురికి ఇన్‌చార్జ్ ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో పాఠశాలల వైపు కన్నెత్తి చూడటం లేదనేది బహిరంగ రహస్యమే. వీటి నేపథ్యంలో జిల్లా అధికారవర్గాలు నిరంతర పర్యవేక్షణ చేస్తేనే ఈ నూతన విధానం సఫలీకృతమవుతోంది.