
రుద్రవరంలో కొల్లు రవీంద్ర
గ్రామ వాలంటీర్ వ్యవస్థపై బురద చల్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్రకు ఆశాభంగం ఎదురైంది.
సాక్షి, మచిలీపట్నం: గ్రామ వాలంటీర్ వ్యవస్థపై బురద చల్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్రకు ఆశాభంగం ఎదురైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామంలో ఆయనకు శనివారం చుక్కెదురైంది. గ్రామ వాలంటీర్లు దసరా మామూలు అడిగారని పెన్షనర్లతో చెప్పించేందుకు ప్రయత్నంచి భంగపడ్డారు. తన అనుచరులతో కలిసి రుద్రవరంలో పర్యటించిన ఆయన గ్రామ వాలంటీర్ వ్యవస్థపై అక్కసు వెళ్లగక్కారు. దసరా మామూళ్ల కోసం పెన్షనర్లను వేధిస్తున్నారని నోటికి వచ్చినట్టు ఆరోపించారు. అయితే తమను ఎవరూ దసరా మామూలు అడగలేదని ఆయన ముఖంపైనే పెన్షనర్లు తెగేసి చెప్పడంతో కొల్లు రవీంద్ర ఖిన్నులయ్యారు. తమ కుటిలప్రయత్నం ఫలించకపోవటంతో ‘పచ్చ’ నాయకులు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు.
మంత్రి పదవిలో ఉండగా కొల్లు రవీంద్ర ఒక్కసారి కూడా తమ ఊరి వంక చూడలేదని, ఇప్పుడు వచ్చి రాజకీయాలు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్లు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్లమని, వైస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికే పెన్షన్లు తెచ్చిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.