సాక్షి, కర్నూలు : అప్పుగా ఇచ్చిన రూ.100 తిరిగి ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి మద్యం మత్తులో మర్మాంగాన్ని కొరికేశాడు. ఈ ఘటన బుధవారం కోవెలకుంట్ల మండలం జోళదరాశి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడి బంధువులు తెలిపిన కథనం మేరకు.. గ్రామానికి చెందిన వడ్డే వెంకటేశ్వర్లు, అదే గ్రామానికి చెందిన వడ్డే వెంకటసుబ్బయ్య ఒకరికొకరు అప్పు ఇచ్చి పుచ్చుకునేవారు. అందులోభాగంగా వెంకటసుబ్బయ్య వద్ద వెంకటేశ్వర్లు రూ.100 అప్పు తీసుకున్నాడు.
తిరిగివ్వమని వెంకటేశ్వర్లును పదేపదే కోరుతున్నా ఇప్పుడిస్తా, అప్పుడిస్తానంటూ కాలయాపన చేసేవాడు. బుధవారం మద్యం మత్తులో ఉన్న వెంకటసుబ్బయ్యకు వెంకటేశ్వర్లు ఎదురుపడ్డాడు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించవా అంటూ వాదనకు దిగాడు. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు పంచె ఊడిపోవడంతో అదనుగా భావించిన వెంకటసుబ్బయ్య మర్మాంగాన్ని కొరికేశాడు. స్థానికులు విడిపించి, తీవ్ర రక్తస్రావమైన వెంకటేశ్వర్లును హుటాహుటిన నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. బాధితుడి కుమారుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment