లేడీస్ హాస్టల్లో దొంగల హల్చల్
నంద్యాల: అర్థరాత్రి విద్యార్థినులు అదమరిచి నిద్రపోతున్న వేళ ముగ్గురు దొంగలు హాస్టల్లోకి చొరబడి హల్చల్ సృష్టించారు. భయంతో కేకలు వేసిన విద్యార్థినులను బూతులు తిడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు, డబ్బు, బంగారు దోచుకొని పరారయ్యారు. ఈ ఘటన టూటౌన్ పోలీసు స్టేషన్ సమీపంలోని వ ప్రభుత్వ మహిళా హాస్టల్లో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
టూటౌన్ పోలీసు స్టేషన్ సమీపంలోని మహిళా హాస్టల్లో పాలిటెక్నిక్, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలకు చెందిన 250మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారు.
శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురు ముసుగు ధరించిన వ్యక్తులు హాస్టల్ ప్రధాన గేటు తాళాలు పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. వీరిని గమనించిన విద్యార్థినులు భయంతో కేకలు వేసినా చుట్టూ నిర్జల ప్రదేశం కావడంతో ఫలితం లేకపోయింది. దీంతో అగంతకులు మరింత రెచ్చిపోయి విద్యార్థినులను బూతులు తిట్టడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించారు. తర్వాత అందరినీ గదిలో నిర్బంధించి ఏడు సెల్ఫోన్లు లాక్కున్నారు. మరో విద్యార్థిని జత కమ్మలు, బ్యాగుల్లో ఉన్న రూ.2500 నగదు తీసుకెళ్లారు. విద్యార్థినల సమాచారం మేరకు పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ రామసుబ్బారెడ్డి టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు దొంగలను గుర్తించి పట్టుకునే పనిలో పడ్డారు.