nandyla
-
బాలికలపై ఆగని అత్యాచారాలు
చాగలమర్రి/నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వ పాలనలో.. రాష్ట్రంలో అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి అత్యాచారం వార్త వినాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లాలో ఒక పాఠశాలలో ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు అత్యాచార యత్నం చేయగా, నెల్లూరులో పదేళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. నిందితులపై పోక్సో కేసులు నమోదు చేశారు. ఈ దారుణం గురించి తెలిసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల కరస్పాండెంట్‌పైనా కేసు నమోదైంది.నంద్యాల జిల్లాలో మండల కేంద్రం చాగలమర్రిలోని శ్రీరాఘవేంద్ర ఉన్నత పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఐదేళ్ల బాలికపై అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు లైంగికదాడికి యత్నించారు. మూత్ర విసర్జనకు టాయిలెట్‌కు వెళ్లిన చిన్నారిపై వారు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన బయటకు పొక్కకుండా పాఠశాల యాజమాన్యం దాచిపెట్టింది. చిన్నారి తల్లిదండ్రులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 12వ తేదీ సాయంత్రం బడి నుంచి ఇంటికెళ్లిన చిన్నారికి జ్వరం వచ్చింది.పొత్తి కడుపులో నొప్పిగా ఉందని ఏడవడంతో తల్లిదండ్రులు స్థానిక కేరళ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యురాలు బాలికపై లైంగికదాడియత్నం జరిగినట్లు చెప్పారు. దీంతో బాలికను మెరుగైన చికిత్స కోసం వైఎస్పార్ జిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా కేసు నమోదు చేయాలని సూచించారు. భయపడిన తల్లిదండ్రులు అక్కడి నుంచి కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా విషయం తెలిపి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.దీంతో తల్లిదండ్రులు వెంటనే చాగలమర్రికి వెళ్లి పాఠశాల కరస్పాండెంట్‌ను ప్రశ్నించగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో బాధితులు బంధువుల సహాయంతో నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ విచారణ చేయాలని ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్‌ను ఆదేశించారు. డీఎస్పీ రవికుమార్ శనివారం ఎస్ఐ రమేష్‌రెడ్డి, సిబ్బందితో కలిసి శ్రీరాఘవేంద్ర పాఠశాలకు వెళ్లి సిబ్బందిని విచారించారు. అనంతరం పోలీసు స్టేషన్లో బాధిత చిన్నారి కుటుంబసభ్యులను విచారించి, వారి ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై పోక్సో కేసు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల కరస్పాండెంట్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలికను మాయచేసి అత్యాచారంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో పదో తరగతి బాలిక (16)కు మాయమాటలు చెప్పి ఒక యువకుడు అత్యాచారం చేశాడు. నెల్లూరు రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. మెడికవర్ హాస్పిటల్ వెనుక పాతమెట్టపాళెంలో ఉండే బాలిక స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన పెంచలయ్య (23) బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలలుగా తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయమాటలు చెబుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన బాలికను మాయచేసి లొంగదీసుకుని అత్యాచారం చేశాడు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు శనివారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పొక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏడుస్తున్నాడని వెళితే.. ప్రాణం తీశాడు!
నంద్యాల(కర్నూలు): ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి ఆరు నెలల చిన్నారి మృతిచెందాడు. ఈ ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది. వన్‌టౌన్ ఎస్ఐ నవీన్‌బాబు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని హరిజనపేటకు చెందిన పరమేశ్వరి, ఓబులయ్య కుమారుడు జగన్‌కు ఆరు నెలల వయసు. మంగళవారం రాత్రి ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ పర్ల దస్తగిరి వద్దకు తీసుకెళ్లారు. కడుపునొప్పితో బాధపడుతున్నాడేమోనని, మందులు వాడితే తగ్గిపోతుందని భావించారు. చిన్నారిని పరీక్షించిన ఆర్ఎంపీ సిరప్లు, మందులు రాసిచ్చాడు. అతను ఇచ్చిన సైక్లోఫాం డ్రాప్స్ చిన్నారి జగన్‌కు వేసిన ఐదు నిమిషాలకే శరీరం మొత్తం చల్లబడిపోయింది. భయపడి పోయిన తల్లిదండ్రులు వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆర్ఎంపీ ఇచ్చిన మందులను పరిశీలిస్తే సైక్లోఫాం డ్రాప్స్ గడువు తేదీ (ఎక్స్పైర్ డేట్) 2016 నుంచి జూన్ 2018 వరకే ఉంది. చిన్నారికి తప్పుడు వైద్యం చేసి.. మరణానికి కారణమైన ఆర్ఎంపీపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు నంద్యాల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లి పరమేశ్వరి ఫిర్యాదు మేరకు దస్తగిరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎన్నాళ్లీ కష్టాలు!
సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో అభివృద్ధి పనుల కోసమంటూ అధికారులు, అధికార పార్టీ నాయకులు ఎక్కడబడితే అక్కడ గుంతలు తవ్వి, పనులు చేపట్టకుండా వదిలేయడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కాలనీలో తవ్విన గుంతలతో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. ఆరునెలల క్రితం గుంతలు తీసి.. ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే మీ కాలనీలో రహదారులు నిర్మిస్తామని చెప్పిన నాయకులు..ఎస్బీఐ కాలనీలో రహదారులు వేయడానికి ఆరు నెలల క్రితం గుంతలు తీయించారు. కానీ ఇంత వరకు రోడ్లు వేయలేదు. దీనికి తోడు రహదారి పక్కన డ్రెయినేజీ కోసం గుంతలు తీసి మట్టిని రోడ్డుపైనే వేయడంతో వాహన దారులకు చాలా ఇబ్బందిగా మారింది. ఈ కాలనీలో పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికంగా ఉన్నాయి. ప్రతిరోజూ ఈ ఐదు పాఠశాలలు, మూడు కాలేజీల విద్యార్థులు కళాశాలలకు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో చిన్న ఆటో ఎదురుగా వచ్చినా ట్రాఫిక్ అంతా జాం అవుతుంది. దీంతో విద్యార్థులు పాఠశాలకు, కాలేజీలకు ఆలస్యంగా వెళ్లాల్సివస్తోంది. పాఠశాల బస్సు ఈ రహదారిపై వచ్చిందంటే 15 నిమిషాలు ట్రాఫిక్ నిలిచిపోవాల్సిందే. రోడ్డు అంతా మట్టిమయం కావడం, పక్కన గుంతలు ఉండటంతో కనీసం సైకిళ్లు కూడా వెళ్లలేని పరిస్థితి. అంతేకాకుండా వర్షా కాలం కావడంతో రోడ్డుపై వేసిన మట్టి మీద నడుస్తూ వృద్ధులు, చిన్నారులు జారిపడుతున్నారు. ఆరు నెలలుగా పనులు కొనసాగుతున్నా ఒక్కపని కూడా సక్రమంగా చేయడంలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యం.. ఓ తల్లికి గర్భశోకం
నంద్యాల : స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలైంది. కాన్పుకోసం వచ్చిన మహిళకు ప్రసవం చేయకుండా ఈరోజు, రేపు అంటూ నాన్చుడు ధోరణితో వ్యవహరించారు. దీంతో శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధితు లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో ప్రభుత్వాసుపత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆదివారం చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని వీసీ కాలనీకి చెందిన హారూన్, సలీమాలకు 11సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు సంతానం. మగసంతానం కోసం ఆపరేషన్ చేయించుకోకుండా ఉన్నారు. సలీమా ఈనెల 7వ తేదీన కాన్పు కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. అప్పటి నుంచి వైద్యపరీక్షలు చేస్తున్న వైద్యులు కాన్పు చేయడంలో నాన్చుడు ధోరణి వ్యవహరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం కాన్పు కోసం ఇంజక్షన్ వేసి అనంతరం కాన్పు చేయకుండా థైరాయిడ్ ఉందని, పరీక్షల కోసం పంపారు. పరీక్షల్లో థైరాయిడ్ లేదని వచ్చిందని, ఆపరేషన్ చేయమని కోరినా వైద్యులు రేపు చేస్తామని పేర్కొన్నారని, ఆదివారం కూడా ఉదయం, మధ్యాహ్నం అంటూ నిర్లక్ష్యం వహించారని బాధితులు తెలిపారు. అనంతరం కడుపులో శిశువు మరణించిందని ఒకసారి, గుండెపోటుతో శిశువు మృతి చెందిందని మరోసారి పొంతనలేని జవాబులు చెప్పారని హారూన్ పేర్కొన్నారు. డబ్బులు లేక తాము ప్రభుత్వాసుపత్రికి వచ్చామని, వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పలుకుబడి ఉన్న వారికి మాత్రమే వైద్యం చేస్తున్నారని, పేదవారి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. శిశువు మృతితో ఆందోళన... శిశువు మృతి చెందారని తెలుసుకున్న బాధితుల బంధువులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న నంద్యాల టూటౌన్ సీఐ శివభాస్కర్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకొని బాధితులకు సర్దిచెప్పారు. విచారించి బాధితులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు.