బాలికలపై ఆగని అత్యాచారాలు | 2 Girls Sexually Assaulted In Nandyala District In Andhra Pradesh, Check More Details Inside | Sakshi
Sakshi News home page

బాలికలపై ఆగని అత్యాచారాలు

Published Sun, Nov 17 2024 5:47 AM | Last Updated on Sun, Nov 17 2024 10:48 AM

2 girls sexually assaulted in Nandyala district: andhra pradesh

నర్సరీ విద్యార్థినిపై ఇద్దరు బాలుర అత్యాచారయత్నం

నర్సరీ విద్యార్థినిపై ఇద్దరు విద్యార్థుల లైంగికదాడియత్నం

నిందితులది అదే స్కూల్‌

నంద్యాల జిల్లా చాగలమర్రిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణం  

నెల్లూరులో టెన్త్‌క్లాస్‌ విద్యార్థినిపై యువకుడి లైంగికదాడి  

నిందితులపై పోక్సో కేసులు నమోదు  

ఘటన తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల కరస్పాండెంట్‌పైనా కేసు  

చాగలమర్రి/నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వ పాలనలో.. రాష్ట్రంలో అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి అత్యాచారం వార్త వినాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లాలో ఒక పాఠశాలలో ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు అత్యాచార యత్నం చేయగా, నెల్లూరులో పదేళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. నిందితులపై పోక్సో కేసులు నమోదు చేశారు. ఈ దారుణం గురించి తెలిసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల కరస్పాండెంట్‌పైనా కేసు నమోదైంది.

నంద్యాల జిల్లాలో మండల కేంద్రం చాగలమర్రిలోని శ్రీరాఘవేంద్ర ఉన్నత పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఐదేళ్ల బాలికపై అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు లైంగికదాడికి యత్నించారు. మూత్ర విసర్జనకు టాయిలెట్‌కు వెళ్లిన చిన్నారిపై వారు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన బయటకు పొక్కకుండా పాఠశాల యాజమాన్యం దాచిపెట్టింది. చిన్నారి తల్లిదండ్రులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 12వ తేదీ సాయంత్రం బడి నుంచి ఇంటికెళ్లిన చిన్నారికి జ్వరం వచ్చింది.పొత్తి కడుపులో నొప్పిగా ఉందని ఏడవడంతో తల్లిదండ్రులు స్థానిక కేరళ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యురాలు బాలికపై లైంగికదాడియత్నం జరిగినట్లు చెప్పారు. దీంతో బాలికను మెరుగైన చికిత్స కోసం వైఎస్పార్‌ జిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా కేసు నమోదు చేయాలని సూచించారు. భయపడిన తల్లిదండ్రులు అక్కడి నుంచి కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా విషయం తెలిపి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.

దీంతో తల్లిదండ్రులు వెంటనే చాగలమర్రికి వెళ్లి పాఠశాల కరస్పాండెంట్‌ను ప్రశ్నించగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో బాధితులు బంధువుల సహాయంతో నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ విచారణ చేయాలని ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్‌ను ఆదేశించారు. డీఎస్పీ రవికుమార్‌ శనివారం ఎస్‌ఐ రమేష్‌రెడ్డి, సిబ్బందితో కలిసి శ్రీరాఘవేంద్ర పాఠశాలకు వెళ్లి సిబ్బందిని విచారించారు. అనంతరం పోలీసు స్టేషన్‌లో బాధిత చిన్నారి కుటుంబసభ్యులను విచారించి, వారి ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై పోక్సో కేసు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల కరస్పాండెంట్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

బాలికను మాయచేసి అత్యాచారం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో పదో తరగతి బాలిక (16)కు మాయమాటలు చెప్పి ఒక యువకుడు అత్యాచారం చేశాడు. నెల్లూరు రూరల్‌ పోలీసులు తెలిపిన మేరకు.. మెడికవర్‌ హాస్పిటల్‌ వెనుక పాతమెట్టపాళెంలో ఉండే బాలిక స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన పెంచలయ్య (23) బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలలుగా తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయమాటలు చెబుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన బాలికను మాయచేసి లొంగదీసుకుని అత్యాచారం చేశాడు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు శనివారం నెల్లూరు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పొక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement