ప్రధానోపాధ్యాయుని దారుణ హత్య
సబ్బవరం: నంగినారపాడు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్నూరు సత్యనారాయణ (38) గురువారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. అమృతపురం శివారు గ్రామం సూర్రెడ్డివానిపాలెం సమీపంలో రాజచెరువు వద్ద గురువారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం సత్యనారాయణ టెక్కలిపాలెంలోని స్వగృహంలో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ఆయన జీవీఎంసీ పరిధిలోని నంగినారపాడు ప్రాథమిక పాఠశాలలో అయిదేళ్లుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు పాఠశాల ముగిశాక బైక్పై ఇంటికి బయల్దేరారు.
అమృతపురం శివారు సూర్రెడివానిపాలెం గ్రామం సమీపంలోని రాతిచెరువు వద్ద గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేయడంతో సమీపంలోని రజకులు చూసి కేకలు వేశారు. అప్పటికే సత్యనారాయణ తల వెనుక భాగంలో తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.
సత్యనారాయణకు భార్యతో విభేదాల వల్ల కొన్నేళ్లుగా విడిగా ఉంటున్నారు. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. మృతునికి ఏడేళ్లు, మూడేళ్ల వయసున్న కుమారులున్నారు. హత్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఐ జి.గోవిందరావు, అనకాపల్లి సీఐ డి.చంద్ర సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.