‘కొలకలూరి’ జీవితం ధన్యమైంది
‘నాన్న’ పుస్తకావిష్కరణలో ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: పూర్వాశ్రమంలో తనకు గురువుగా ఉండి ఆ పైన వైస్ చాన్స్లర్ పదవి నిర్వహించిన ఆచార్య కొలకలూరి ఇనాక్ జీవిత చరిత్రను ఆయన కుమార్తె మధుజ్యోతి ‘నాన్న’ శీర్షికతో అక్షరబద్ధం చేయడంతో.. గురువు జీవితం ధన్యమయిందని.. తనకు కూడా గర్వంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సచివాలయంలో మంగళవారం మధుజ్యోతి రాసిన ‘నాన్న’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన ఇనాక్.. బాల్యం నుంచి పడిన కష్టాలు, అవమానాలు ఎన్నో ఉన్నాయన్నారు. అయినా ఉన్నత స్ధాయికి ఎదిగిన ఒక మంచి మనిషి జీవితాన్ని కథగా మలిచి బాధ్యత నెరవేర్చిన మధుజ్యోతిని అభినందించారు. పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షురాలిగా ఆమె సేవలు విద్యార్థులకు మరింతగా అందించాలన్నారు. ఈ సందర్భంగా సీఎంకు ఆచార్య ఇనాక్, రచయిత్రి మధుజ్యోతిలు కృతజ్ఞతలు తెలిపారు.