నిమ్స్‌కు నన్నపనేని
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ రెండో రోజు దీక్ష చేపట్టిన టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆరోగ్యం క్షీణించటంతో ఆమెను నిమ్స్‌కు తరలించారు. నన్నపనేని బీపీ లెవల్స్ తగ్గటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ నన్నపనేని రాజకుమారి శాసనసభ ఆవరణలోని టిడిఎల్పి కార్యాలయం ఎదుట మంగళవారం సాయంత్రం మెరుపు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. విభజన అంశంపై మీడియాతో మాట్లాడతానని ఆహ్వానించిన నన్నపనేని, అకస్మాత్తుగా విభజనను నిరసిస్తూ 48 గంటల దీక్ష చేయనున్నట్టు ప్రకటించింది.
దీంతో కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న పోలీసులు నన్నపనేనిని అదుపులోకి తీసుకుని ఆమె ఇంటి వద్ద వదిలేసారు. అయితే పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసినప్పటికీ నన్నపనేని పట్టు వీడలేదు. బుధవారం ఉదయం అసెంబ్లీలోని టీడీఎల్పీలో మరోసారి దీక్ష చేపట్టారు. రాష్ట్ర శాసనసభ, శాసన మండలి తిరస్కరించిన విభజన బిల్లును రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్కరిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న సీమాంధ్ర ప్రజల ఆశలను అడియాశలు చేసారని ఆమె విమర్శించారు.