రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు పూర్తి
చంద్రగిరి: చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అంతిమ సంస్కారం కుటుంబ సభ్యులు, బంధువులు, అత్మీయుల మధ్య సాగింది. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కన్నీటి సంద్రం నడుమ ఆయనకు వీడ్కోలు పలికారు. శనివారం హైదారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నారా రామ్మూర్తి నాయుడు(71) తుది శ్వాస విడిచారు. ఆదివారం ఉదయం ఆస్పత్రి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పార్థీవ దేహాన్ని మంత్రి నారా లోకేష్, కుటుంబ సభ్యులు రేణిగుంట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నారావారిపల్లికి చేరుకుని, తన నివాసం వద్ద ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఉదయం 11.20 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు నారావారిపల్లికి చేరుకున్నాడు. తన తమ్ముడు మృతి చెందడంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన సీఎం, తన కుటుంబ సభ్యులతో కలసి పుష్పగుచ్ఛం అందించి నివాళులర్పించారు.పలువురు ప్రముఖుల నివాళిమాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడుకు ఆదివారం తన స్వగృహం వద్ద పలువురు నివాళులర్పించారు. ఇందులో మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, ప్రముఖ నటులు మంచు మోహన్‌బాబు, రాజేంద్ర ప్రసాద్, మంచు మనోజ్, శ్రీవిష్ణు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మాజీ టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు దేవినేని ఉమ, కలికిరి మురళీమోహన్, పులివర్తి నాని, అమరనాథరెడ్డి, గురజాల జగన్మోహన్రావు, చింతమనేని ప్రభాకర్, కురుగొండ్ల రామకృష్ణ, ఆదిమూలం, బొజ్జల సుధీర్‌రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.అధికార లాంఛనాలతో అంత్యక్రియలురామ్మూర్తి నాయుడుకు ప్రభుత్వం ఆధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంటి వద్ద నుంచి అంతిమయాత్రను ప్రారంభించారు. గ్రామ సమీపంలోని తల్లిదండ్రుల సమాధుల సమీపంలోని మామిడితోటలో ఏర్పాటు చేసిన ప్రాంతానికి తీసుకొచ్చారు. హిందూ సంప్రదాయ ప్రకారం కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన తనయుడు, హీరో నారా రోహిత్ తన తండ్రికి అంతిమ సంస్కారాన్ని నిర్వహించారు. అనంతరం అక్కడే కుటుంబ సభ్యులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి, రామ్మూర్తినాయుడుకు ఘన నివాళులర్పించారు. రేపు ఉదయం సీఎం చంద్రబాబు నారావారిపల్లి నుంచి తిరిగి వెళ్లనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.