లేహ్యం పేరుతో లూటీ
చీరాల, న్యూస్‌లైన్ : వివిధ రోగాలకు వాడే లేహ్యం విక్రయం పేరుతో జిల్లాతో పాటు కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పలు గ్రామాలు, పట్టణాల్లో సంచరిస్తూ తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లోకి చొరబడి దొంగతనాలు చేస్తున్న ఒక ముఠాను చీరాల పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి * 12 లక్షల విలువైన 42 సవర్ల బంగారం, రెండున్నర కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్లో డీఎస్పీ నరహర శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా నున్నా గ్రామానికి చెందిన పిండ్రాల కోటయ్య, పెద్దసముద్రం, చిన్నసముద్రం అనే ముగ్గురు మూడు ముఠాలుగా ఏర్పడి లేహ్యం అమ్ముతామని గ్రామాల్లో తరచూ పర్యటిస్తుంటారు.
తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని ప్రధాన ముఖద్వారం కాకుండా ఇతర ద్వారాలను పగులగొట్టి ఇళ్లల్లోకి చొరబడి విలువైన వస్తువులు దొంగిలిస్తుంటారు. ఇందులో ఒక ముఠాలోని పిండ్రాల కోటయ్య, అతని కొడుకులు వెంకటేశ్వర్లు, హరిబాబు చీరాలలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. గతేడాది నవంబర్‌లో పేరాలలోని కారెంపూడి లీలామోహనరావు ఇంట్లో తాళం పగులగొట్టి 30 సవర్ల బంగారం, రెండు కేజీల వెండి దొంగిలించారు. కొత్తపేటలో కరణం రాంబాబు అనే వ్యక్తి ఇంట్లో గత డిసెంబర్ నెలలో ఆరు సవర్ల బంగారం, రూ 18 వేల నగదు దొంగిలించారు. పాపరాజుతోటలోని గోపాలరావు ఇంట్లో మూడు సవర్ల బంగారం, పావుకేజీ వెండి దొంగిలించారు. ఉడ్‌నగర్‌లోని సుజాత అనే మహిళ ఇంట్లో ఈ ఏడాది నవంబర్‌లో చొరబడి మూడు సవర్ల బంగారం, పావుకేజీ వెండి అపహరించారు. వీటితో పాటు వీరిపై అనంతపురం, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో అనేక కేసులున్నాయి. ఈ అంతర్జిల్లా నేరస్తులపై పోలీసులు నిఘా పెట్టారు.
స్థానిక డీఎస్పీ నరహర నేతృత్వంలో ట్రైనీ డీఎస్పీ శ్రీనివాసరావు, టూటౌన్ సీఐ అబ్దుల్‌సుభాన్, ఒన్‌టౌన్ సీఐ భీమానాయక్, రూరల్ సీఐ ఫిరోజ్, ఈపూరుపాలెం ఎస్సై రాంబాబు, సిబ్బంది రాఘవ, రవి, బాషా, శ్రీనివాసులు, నాగరాజు, చంద్రపాల్, నాగూర్‌లు గుంటూరు జిల్లా బాపట్లలోని కోనాభవన్ వద్ద నిందితులను శుక్రవారం అరె స్టు చేశారు. దొంగతనాలకు పాల్పడుతున్న పెద్దసముద్రం, చిన్నసముద్రం ముఠాలను కూడా త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ నరహర తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.