నరసాపురం మునిసిపాలిటీకి స్టేట్ అవార్డు
నరసాపురం (రాయపేట), న్యూస్‌లైన్: తడి, పొడి చెత్తను వేరుచేసి బయోగ్యాస్.. దాని ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో మంచి ఫలితాలు సాధించినం నరసాపురం మునిసిపాలిటీకి రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. చెత్తపై కొత్త సమరం పేరుతో చేపట్టిన వందరోజుల కార్యక్రమంలో ప్రొద్దుటూరు, నరసాపు రం, నంద్యాల మునిసిపాలిటీలు మొదటి మూడు స్థానాలు సాధిం చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌లో మునిసిపల్ కమిషనర్లతో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో స్థానిక మునిసిపల్ కమిషనర్ పీసీ విజయకుమార్ పట్టణంలో తడి, పొడి చెత్త సేకరణ, తడి చెత్తతో బయోగ్యాస్ తయారు చేసి 8 కిలోవాట్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. నరసాపురంలో అమలవుతున్న ఈ కార్యక్రమం వివరాలను పూర్తిగా తెలుసుకున్న అధికారులు ప్రశంసించినట్టు కమిషనర్ తెలిపారు. ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి, డెరైక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి జనార్దనరెడ్డి, మునిసిపల్ శాఖ మంత్రి మహేంద్రరెడ్డి చేతుల మీదుగా విజయకుమార్ అవార్డును అందుకోనున్నారు.