నారావారి పల్లెలో పోలీస్‌యాక్ట్!
చంద్రగిరి: చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందని, ఇక్కడ ఎలాంటి సభలు, సమావేశాలు, కరపత్రాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించరాదని పోలీసులు శనివారం నవ్యాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులకు అడ్డుతగిలారు. నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చిత్తూరులో మేలుకొలుపు కార్యక్రమం జరిగింది.
అక్కడి నుంచి వారు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు పయనమయ్యారు. మార్గమధ్యంలో ప్రతి దళితవాడకు వెళ్లి ఈ నెల 30న గుంటూరులో జరిగే మాదిగల మేలుకొలుపు మహాసభను విజయవంతం చేయాలంటూ కరపత్రాలు పంపిణీ చేస్తూ వచ్చారు. ఇందులో భాగంగా సీఎం స్వగ్రామం నారావారిపల్లె దళితవాడకు వెళ్లేందుకు ఉపక్రమించారు. అయితే, దళితవాడకు సమీపంలోని రంగంపేట చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. నారావారిపల్లిలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందని చెప్పడంతో ఇక చేసేది లేక వారు అక్కడి నుంచి వెనుదిరిగారు.