'మంత్రి నారాయణపై కేసు నమోదు చేయండి'
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణపై కేసు నమోదు చేయాలని విజయవాడ కోర్టు పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే విజయవాడ మొగల్రాజపురంలోని నారాయణ ఐఐటీ ఒలంపియాడ్ స్కూల్ ప్రిన్సిపాల్ సూరయ్యలపై చీటింగ్, నమ్మకద్రోహం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారించాలని విజయవాడ ఒకటవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మహ్మద్ రఫీ మాచవరం పోలీసులను మంగళవారం ఆదేశించారు.
విశాఖపట్నానికి చెందిన ఫిర్యాది ఐతా రామలింగేశ్వరరావు సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. తన కుమారుడు రామసాయి అనుదీప్‌ను 2010 జూన్‌లో మొగల్రాజపురంలోని నారాయణ ఐఐటీ ఒలంపియాడ్ స్కూల్లో 8వ తరగతిలో చేర్పించారు. 2011 జూన్ 12న ఫిర్యాది భార్య తొమ్మిదో తరగతికి ఫీజు చెల్లించేందుకు రాగా...ప్రిన్సిపాల్ రూ.90వేలు చెల్లించాలన్నారు. ఏడాదికి రూ.85 వేలకు చొప్పున మూడేళ్లకు మాట్లాడుకున్నాం కదా మళ్లీ ఇప్పుడు పెంచటమేంటని బాధితుడు ప్రశ్నించగా ప్రిన్సిపాల్ సరిగా స్పందించకపోగా...అవమానకరంగా ప్రవర్తించారు. దాంతో బాధితుడు కోర్టులో ప్రయివేటు ఫిర్యాదు దాఖలు చేయగా న్యాయమూర్తి పైవిధంగా ఆదేశించారు.