డమ్మీగా ఉండాలంటున్నారు: కిరణ్ బేడీ
పుదుచ్చేరి ప్రభుత్వం తనను డమ్మీగా ఉంచాలనుకుంటోందని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అన్నారు. నారాయణసామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో విభేదాలు ఎక్కువైన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన విధులు, బాధ్యతలను సక్రమంగా నెరవేర్చేందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన 35వ ఆలిండియా పోలీస్ ఈక్వెస్ట్రియన్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. వచ్చే మే 29వ తేదీన పదవి నుంచి వైదొలగనున్నట్లు గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు.
లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఒక లక్ష్యం కోసం పదవిని చేపట్టానని, పదవీకాలం ముగిసే వరకు ఉండాలని అనుకోవటం లేదని చెప్పారు. ఆమె పనితీరుపై 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మెమోరాండం ఇచ్చిన తర్వాతి రోజే ఆమె రిటైర్మెంట్ ప్రకటన చేశారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ రెండేళ్లపాటు మాత్రమే ఉండాలని మొదటే అనుకున్నానని చెప్పారు. అవినీతి, నేర నిర్మూలన కోసం ఆమె పలు చర్యలు తీసుకున్నారు. స్వచ్ఛ పుదుచ్చేరి లక్ష్యంగా తాను చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదని, పదవి నుంచి తప్పుకుంటానని గత ఆగస్టులో కిరణ్‌బేడీ చేసిన ప్రకటన సంచలనం రేపింది. పుదుచ్చేరి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, దాని నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానని అన్నారు.