మీకంటే తోపు లేడనుకుంటున్నారా? అయితే సమస్యే..!
హరిప్రసాద్ ఒక వైద్యుడు. ఎంబీబీఎస్ చదివాక వైజాగ్‌లో ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఆదాయం అంతంతమాత్రంగా ఉండేది. దాంతో డిస్టెన్స్‌లో సైకాలజీ చదివి, ఒక డాక్టరేట్ కొనుక్కొని సైకాలజిస్ట్ అవతారమెత్తాడు. తానో కొత్త మనోవైద్య విధానాన్ని కనిపెట్టానని, మాట్లాడకుండానే ఎలాంటి మానసిక సమస్యలనైనా సులువుగా నయం చేస్తానని పత్రికల్లో ప్రకటనలిచ్చేవాడు. ప్రపంచంలో ఏ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ నయం చేయని కేసులను తాను నయం చేశానని గొప్పలు చెప్పుకునేవాడు.
అతని మాటలు, ప్రకటనలు నమ్మి వచ్చిన వ్యక్తులను తన వాక్చాతుర్యంతో ప్రభావితం చేసేవాడు. లక్షలకు లక్షలు ఫీజు తీసుకునేవాడు. అలా చేయడం ప్రొఫెషనల్ ఎథిక్స్‌కి భిన్నమని తెలిసినా ఏమాత్రం గిల్టీగా ఫీలయ్యేవాడు కాదు. తన క్లయింట్లందరినీ ఒక కల్ట్‌గా మార్చి, వాళ్లు తనను ప్రశంసిస్తుంటే పొంగిపోతుండేవాడు.
ఇక ఇంట్లో హరిప్రసాద్ ప్రవర్తన మరింత ఘోరంగా ఉండేది. ‘నేనొక మోనార్క్‌ని, నా మాటే అందరూ వినాలి’ టైపులో ఉండేవాడు. భార్య లత ఏం చేసినా తప్పులు పట్టడం, నీకేం తెలియదంటూ విమర్శించడం, ఇల్లు దాటి అడుగు బయటకు పెట్టనీయకపోవడం, తనను అసలు మనిషిలా గౌరవించకపోవడం ఆమె మనసును విపరీతంగా గాయపరచింది. దాంతో ఆమె డిప్రెషన్‌కి లోనై, భర్తకు తెలియకుండా కౌన్సెలింగ్‌కి వచ్చింది.
నేనే గొప్పనుకోవడం కూడా సమస్యే
లత మాటలను బట్టి హరిప్రసాద్ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్(NPD) తో బాధపడుతున్నాడని అర్థమైంది. ఇది ఉన్నవారికి తనకు తానే ముఖ్యం. నిత్యం తమ గురించే ఆలోచించుకుంటూ, తనకంటే గొప్పవారు లేరనుకుంటారు. రోజూ తమ విజయాల గురించి మాట్లాడతారే తప్ప ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారనే విషయాన్ని అస్సలు అర్థం చేసుకోరు. ఏ మాత్రం గిల్టీ ఫీలింగ్ లేకుండా ఇతరులను దోపిడీ చేస్తారు. ఇతరుల అవసరాలను పణంగా పెట్టి తాము అనుకున్నది సాధిస్తారు. తానే అధికుడననే దృష్టి ఉండటం వల్ల ఇతరులను వస్తువులుగా చూస్తారు, మానవత్వాన్ని కోల్పోతారు. ఏకపక్ష దృక్పథాన్ని కలిగి ఉండటం, భాగస్వామి నుంచి అమితంగా ఆశించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలుంటాయి. ఈ డిజార్డర్ మహిళల కన్నా పురుషుల్లో ఎక్కువ. కొందరు రాజకీయ నాయకుల్లోనూ, మత గురువుల్లోనూ, కల్ట్ లీడర్స్లోనూ ఈ లక్షణాలుంటాయి.
NPD లక్షణాలు..
ఈ వ్యక్తిత్వ రుగ్మత యుక్తవయస్సులో ప్రారంభమై వివిధ సందర్భాల్లో కనిపిస్తుంది. తాను గొప్పవాడిననే ఫాంటసీ, ప్రవర్తన, నిత్యం ప్రశంసలు కోరుకోవడం, సహానుభూతి లేకపోవడం ఈ రుగ్మత ప్రధాన లక్షణాలు. ఈ కింది లక్షణాల్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే NPD ఉన్నట్లే.
గోరంత ప్రతిభను, విజయాలను కొండంతగా చేసి చెప్పుకోవడం.. తన విజయం, శక్తి, తేజస్సు, అందం, ప్రేమ అపరిమితమనే భారీ ఊహలు.. తానో ప్రత్యేకమైన వ్యక్తినని, తనను, తన సిద్ధాంతాలను సాధారణ వ్యక్తులు అర్థం చేసుకోలేరని భావించడం.. మితిమీరిన అభిమానాన్ని కోరుకోవడం.. దానికోసం అబద్ధాలు చెప్పడం లేదా రాయడం.. అసమంజసమైన అంచనాలు.. తన లక్ష్యాలను సాధించుకోవడానికి ఇతరులను మోసం చేయడం లేదా వాడుకోవడం.. ఇతరుల భావాలు, అవసరాలను గుర్తించడానికి ఇష్టపడకపోవడం.. తరచుగా ఇతరులపై అసూయపడటం లేదా ఇతరులు తన పట్ల అసూయపడుతున్నారని నమ్మడం.. అహంకార ప్రవర్తనతో ఇతరులను ప్రతికూలంగా అంచనా వేయడం.. విమర్శను ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బంది.. తన లోపలి అభద్రత, అసమర్థత, వైఫల్యం బయటపడతాయేమోననే భయం.
ఎందుకు వస్తుంది?
• వారసత్వంగా వచ్చిన గుణాలు..
• మితిమీరిన విమర్శలు లేదా మితిమీరిన ప్రేమతో ముంచెత్తే తల్లిదండ్రులను కలిగి ఉండటం..
• కఠినమైన పేరెంటింగ్, పేరెంట్స్ నిర్లక్ష్యం..
• భారీ అంచనాలను సెట్ చేసుకోవడం.. ∙
• లైంగిక సమస్యలు, సాంస్కృతిక ప్రభావాలు.. ∙
• న్యూరోబయాలజీ వల్ల!
పరిష్కారమేమిటి?
NPD ఉన్న వ్యక్తులు తాము చేసేదంతా సరైనదే అనుకుంటారు. కాబట్టి వారికి వారుగా చికిత్స పొందే అవకాశం ఉండదు. అందుకని కుటుంబ సభ్యులే గుర్తించి తీసుకురావాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి మందులూ లేవు. ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్, మెడిటేషన్ కొంత ఉపయోగపడతాయి. సీబీటీ, డీబీటీ, సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ వంటి థెరపీల ద్వారా మరింత సహాయం చేయవచ్చు. వ్యక్తి ఆత్మగౌరవాన్ని పెంచడం, వాస్తవిక అంచనాలను అందించడం లక్ష్యంగా థెరపీ సాగుతుంది. ఇతరులను సహానుభూతితో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. సొంత బలాలు, బలహీనతలను గుర్తించేలా, విమర్శలు అంగీకరించేలా సిద్ధం చేస్తుంది. బాల్యంలోని సంఘర్షణలను, వాటిని ఎదుర్కోవడానికి ఉపయోగించిన డిఫెన్స్ మెకానిజాన్ని అర్థంచేసుకుని, కొత్త డిఫెన్స్ మెకానిజాన్ని అలవాటు చేయిస్తుంది. NPD ఉన్నవారిని అర్థం చేసుకుని, కలసి జీవించేలా కుటుంబ సభ్యులను ఎడ్యుకేట్ చేస్తుంది. వారితో సర్దుకుపోవడం అసాధ్యమని భావిస్తే విడిపోయేందుకు సిద్ధం చేయిస్తుంది.
-సైకాలజిస్ట్ విశేష్
psy.vishesh@gmail.com