‘దొంగపోలీస్’
పోలీసు వేషంలో వరుస చోరీలు
రూ.12 లక్షల విలువైన బైక్‌లు,
బొలెరో వాహనం స్వాధీనం
హైటు, పర్సనాలిటీ, హెరుుర్స్టైల్... చేతిలో ఎరుుర్ పిస్టల్... అచ్చం పోలీసులా...! బొలెరో వాహనం... దానికి సైరన్... పోలీసు వాహనంలా...! అంతకు ముందు బీఎస్ఎఫ్లో శిక్షణ పొందిన అనుభవం...! పోలీసుగా నమ్మించడానికి ఇవి చాలనుకున్నాడో ఏమో...!! వేములవాడ భగవంతరావునగర్‌కు చెందిన నామాల నరేందర్(23) నకిలీ పోలీసు అవతారమెత్తాడు. ఎస్సైనని చెప్పుకుంటూ దొంగిలించిన బొలెరా వాహనంలో తిరుగుతూ వరుస చోరీలకు పాల్పడుతూ చివరకు కటకటాల పాలయ్యూడు. కరీంనగర్ డీఎస్పీ రామారావు మంగళవారం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ‘దొంగపోలీస్’ వివరాలు వెల్లడించారు.
కరీంనగర్ క్రైం : వేములావాడలోని భగవంతరావునగర్‌కు చెంది న నామాల నరేందర్(23) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో జనరల్ సోల్జర్‌గా ఎంపికై శిక్షణకు వెళ్లా డు. అక్కడ వాతావరణం పడక ఇంటికి తిరిగి వచ్చా డు. కొద్ది రోజులు పోలీసులకు సన్నిహితంగా మెదిలిన నరేందర్ వారి వ్యవహార శైలిని గమనించాడు. ఈ క్రమంలో వేములావాడ నుంచి హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ జల్సాలకు అలవాటుపడి చోరీలు చేయడం ప్రారంభించాడు. మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో గతేడాది అక్టోబర్ ఒకటో తేదీన బొలెరో వాహనం చోరీ చేశాడు. జిల్లాలో కొత్తగా ఎస్సైలకు బొలెరో వాహనాలు ఇవ్వడంతో తాను చోరీ చేసిన బొలెరో వాహనం పైన సైరన్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఎయిర్‌పిస్టల్ కొనుగోలు చేశాడు. వేములావాడలో మానకొండూరు ఎస్సైగా, మిగతా చోట్ల వేములావాడ ఎస్సైగా చెబుతూ చోరీలు చేయడం ప్రారంభించాడు.
చిక్కిన వైనమిది...
కరీంనగర్ త్రీటౌన్ పరిధిలో గతనెల 11, 31 తేదీల్లో రెండు బైకులు చోరీ అయ్యాయి. వేములవాడలో గతంలో పని చేసిన రిటైర్డ్ ఉద్యోగి మృతి చెందిన విషయం తెలుసుకున్న నరేందర్ వీరి ఇంటికి వచ్చి రెండు బైకులు చోరీ చేశాడు. వాటిని నగరంలోని సివిల్ ఆస్పత్రి పార్కింగ్‌లో దాచి ఉంచాడు. ఈ నెలలో బండారు వేణు ఇంట్లో చొరబడి ఐదు తులాల బంగారు చైన్ దొంగిలించాడు. రెండు సంఘటనలో ఒకే వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడంతో త్రీటౌన్ సీఐ సదానందం ఆధ్వర్యంలో ఎస్సై నరేష్, హెడ్‌కానిస్టేబుల్ పోచయ్య, కానిస్టేబుళ్లు జాకీర్, ప్రతాప్, శ్రీకాంత్‌రెడ్డి బృందం రంగంలోకి దిగింది.
నరేందర్‌పై అనుమానం రాగా అతడి కదలికలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో అతడిని కలిసి వివరాలు అడగుగా ఒకరితో మానకొండూరు ఎస్సైగా, మరొకరితో మెదక్ ఐబీ కానిస్టేబుల్‌గా, ఇంకొరితో వేములావాడ ఎస్సైగా పేర్కొనడంతో అనుమానం బలపడింది. మంగళవారం మంచిర్యాల చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండడగా బొలెరో వాహనంలో వస్తున్న నరేందర్‌ను ఆపి పత్రాలు తనిఖీ చేయగా సరిగా లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం పోలీసుల విచారణలో తాను చేసిన చోరీల వివరాలు వెల్లడించాడు. వెంటనే రూ.12 లక్షల విలువైన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరేందర్‌తో పాటు అతడికి సహకరించిన వేములావాడ మండలం హన్మక్కపల్లికి చెందిన చంద్రగిరి అనిల్(24)పై కేసు నమోదు చేసి, నరేందర్‌ను మంగళవారం రిమాండ్ చేశారు.
చోరీల చిట్టా ఇదీ...
కరీంనగర్ త్రీటౌన్ పరిధిలో గతనెల 10న ఒక మారుతి కారును, 31న ఒక బైకును దొంగిలించాడు. ఈ నెల ఒకటిన మరో బైకును అపహరించిన నరేందర్ 12న బండారు వేణు ఇంట్లో దూరి ఐదు తులాల బంగారం దొంగిలించాడు. గతేడాది సెప్టెంబర్ ఒకటిన హైదారాబాద్‌లోని మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో బొలెరో వాహనాన్ని అపహరించాడు. నిరుడు జూన్ 27న బేగంపేటలో కరిజ్మా బైక్, ఈ ఏడాది మార్చి 26న కేపీహెచ్‌బీకాలనీలో హోండాషైన్, జనవరి 10న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలు చోరీ చేశాడు. వాటిని ఇతరులకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం ప్రారంభించాడు. నరేందర్‌కు చోరీల్లో సహకరించిన చంద్రగిరి అనిల్ కొద్ది రోజుల క్రితమే దుబాయ్ వెళ్లిపోయాడని తెలిసింది.
పోలీసులకు రివార్డులు
పోలీసు వేషంలో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్న నరేందర్‌ను చాకచక్యంగా పట్టుకున్న సీఐ సదానందం, ఎస్సై నరేష్, హెడ్‌కానిస్టేబుల్ పోచయ్య, కానిస్టేబుళ్లు జాకీర్, ప్రతాప్, శ్రీకాంత్‌రెడ్డిలకు డీఎస్పీ రామారావు నగదు రివార్డులను అందజేశారు. వారిని ఉన్నతాధికారులు అభినందించారు.