భారత్‌లో చార్లెస్ దంపతులు పర్యటన: భద్రత కట్టుదిట్టం
బ్రిటన్ యువరాజు చార్లెస్, కెమిల్లా పార్కర్ దంపతులు భారత్‌లో తొమ్మిది రోజుల పర్యటనలో భాగంగా నేటి సాయంత్రం డెహ్రాడూన్‌లోని జోలీగ్రాండ్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారని ఉత్తరాఖండ్ రాష్ట్ర ఉన్నతాధికారులు బుధవారం ఇక్కడ వెల్లడించారు. వారి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయినట్లు తెలిపారు. చార్లెస్ యువరాజు దంపతుల పర్యటన నేపథ్యంలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. అందుకోసం భారీగా పోలీసుల బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు.
నరేంద్రనగర్‌లోని ఓ హోటల్లో చార్లెస్ దంపతులకు విడిది ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా చార్లెస్ దంపతులు రిషికేశ్‌లోని పరమత నికేతన్ ఆశ్రమంలో నిర్వహించే హవన్, గంగా హారతి కార్యక్రమంలో పాల్గొంటారని ఉన్నతాధికారులు తెలిపారు. అనంతరం ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణ గౌరవార్థం ఇచ్చే విందులో చార్లెస్ దంపతులు పాల్గొనున్నారని చెప్పారు. యువరాజు దంపతుల కోసం నరేంద్రనగర్‌లోని హోటల్లో విడిది చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీ, ఫారెస్ట్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, డూన్ స్కూల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో వారు పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం ఇటీవల ఉత్తరాఖండ్‌లో వరదల వల్ల అతలాకుతలమైన ప్రాంతాలలో వారు పర్యటించనున్నారు. భారత్ పర్యటనలో భాగంగా చార్లెస్ దంపతులు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలతో సమావేశం కానున్నారు.
అలాగే భారత్ వాణిజ్య రాజధాని ముంబైలో దేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చార్లెస్ దంపతులు భేటీ అవుతారు. భారత్‌లో వివిధ ప్రాంతాల్లో వ్యాపారవేత్తలు, సంస్కృతిక రంగానికి చెందిన ప్రముఖులు, నాయకులను బ్రిటన్ యువరాజు చార్లెస్ దంపతులు కలుసుకుంటారని ఉత్తరాఖండ్ ఉన్నతాధికారులు వివరించారు.