కాలుష్య కోరల్లో పల్లెలు
-తరచూ రోగాల బారిన ప్రజలు
ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరి
రాత్రి వేళల్లో పరిస్థితి మరీ అధ్వానం
-పట్టించుకోని అధికారులు
కొండాపూర్: రాత్రి పూట ఘాటైన వాసనలు.శ్వాస పీల్చుకొంటే ముక్కుపుటలు అదిరిపోయేలా వచ్చే దుర్వాసన వలన తరచూ ఆయా గ్రామాల ప్రజలు రోగాల పాలవుతున్నారు. అయినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు చూసీ చూడనట్లు వ్యవహరిçస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఆయా పరిశ్రమలు విడుదల చేసే పొగతో పాటు, వ్యర్థ పదార్థాలను సైతం బయటకు కాలువల ద్వారా మల్లెపల్లి చెరువులోకి వదిలేస్తున్నారు.దీంతో గ్రామాల్లో వ్యవసాయ బోర్లు వేస్తే కలర్ మారిన రంగు నీళ్ళే వస్తున్నాయనీ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ కొండాపూర్ మండలంలోని తేర్పోల్, చెర్లగోపులారం, ఎదురుగూడెం గుంతపల్లి గ్రామాల ప్రజల పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్ మండలంలోని మల్లేపల్లి, తేర్పోల్, గొల్లపల్లి, గుంతపల్లి తదితర గ్రామాల్లో సుమారు నాలుగు మద్యం పరిశ్రమలు, పది టైర్ల పరిశ్రమలు ఉన్నాయి. మద్యం పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యం వల్ల చేనులో ఏమాత్రం పంటలు పండడంలేదని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.టైర్ల పరిశ్రమల ఇతర ప్రాంతాల నుంచి టైర్లను తీసుకువచ్చి వాటిని కాల్చి ఆయిల్‌ను తీస్తారు.ఈ టైర్లను కాల్చేటప్పుడు ముక్కుపుటలదిరేలా భరించలేని దర్గుంధం వస్తుందని చుట్టూ పక్కల గ్రామస్థులు చెబుతున్నారు.
పగలు, రాత్రీ అనే తేడా లేకుండా ఆయా పరిశ్రమలు యథేచ్ఛగా వ్యర్థ కాలుష్యాన్ని బయటకు వదులుతున్నాయి. దీంతో ఆ ఘాటైన వాసనలు పీల్చుకోలేక ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.రాత్రి వేళ్ళల్లో అయితే పరిస్థితి మరీ దారుణం.ఆ ఘాటైన వాసనలు రావడం ద్వారా నిద్రకూడా రావడం లేదని ఆయా గ్రామాల ప్రజలు చెప్తున్నారు. పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థ జలాలను కాలువల ద్వారా మల్లెపల్లి చెరువులోకి పంపిస్తుండడంతో చుట్టూ పక్కల భూములన్నీ నల్లగా మారి బీటలుగా ఏర్పడుతున్నాయి. కాగా ఈ టైర్ల పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యం వల్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన మహిళ గర్భస్రావం జరిగినట్లు గ్రీవెన్స్‌డే లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం.
మద్యం పరిశ్రమలు సాయంత్రం వేళలో విడుదల చేసే పొగ ద్వారా చిన్నచిన్న రేణువులు కంట్లోపడి కళ్ళు ఎర్రగా మారి వాహనాలు నడపడానికి ఇబ్బందిగా వుందని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి కాలుష్యాన్ని విడుదల చేసే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.