ఎన్నిసార్లు మభ్యపెడతారు
గూడూరు టౌన్, న్యూస్‌లైన్: గూడూరులోని నరసింగరావు పేటలో అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి మహిళల నుంచి నిరసన సెగ తగిలింది. మహానేత వైఎస్సార్ హయాంలో ఇళ్ల పట్టాలు అందజేస్తే, ఇప్పటికీ స్థలాలు చూపకపోవడంపై వారు నిలదీశారు. ఎన్నిసార్లు రచ్చబండ నిర్వహించి మభ్యపెడతారని ప్రశ్నించారు. మరోవైపు రచ్చబండకు మంత్రి ఆనం రావడం ఆలస్యం కావడంతో
ప్రజల్లో ఓపిక నశించింది. మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సిన మంత్రి సాయంత్రం 4.45 గంటలకు వచ్చారు. ఆయన రాక ఆలస్యం కావడంతో ఎక్కువ మంది ప్రజలు అర్జీలను అధికారులకు ఇచ్చి వెళ్లిపోయారు. రామనారాయణరెడ్డి మాట్లాడుతున్న సమయంలోనూ ఎక్కువ మంది వెళ్లిపోతుండటంతో నాయకులు వారిని బలవంతంగా కూర్చోబెట్టారు.
47,972 మందికి ఇందిరమ్మ ఇళ్లు
మూడో విడత రచ్చబండ పథకం ద్వారా జిల్లాలో 47,972 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గూడూరు ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖ మంత్రితో చర్చించి గూడూరులో పీజీ కళాశాల ఏర్పాటుకు అనుమతి తెస్తామని హామీ ఇచ్చారు.
2009లో ఇళ్ల పట్టాలు మంజూరైన వారికి సాంకేతిక కారణాలతో భూమి చూపలేదని చెప్పారు. త్వరలోనే డీటీపీ అప్రూవల్ తీసుకుని లబ్ధిదారులకు స్థలాలు చూపాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ దుగ్గరాజపట్నంలో ఏర్పాటైతే వందలాది పరిశ్రమలు వచ్చి, వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ నేత పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ గూడూరులో రూ.20 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గూడూరు ఆర్డీఓ మధుసూదన్‌రావు, తహశీల్దార్ మైత్రేయ, ఎంపీడీఓ నిర్మలదేవి, మున్సిపల్ కమిషనర్ సుశీలమ్మ, పీడీ కమలకుమారి, నాయకులు జగన్మోహన్రెడ్డి, శ్యామ్‌సుందరరెడ్డి పాల్గొన్నారు.
చింతా వ్యాఖ్యలతో కలకలం
తిరుపతి ఎంపీ చింతా మోహన్ మాటలు సభలో ఒక్కసారిగా కలకలం రేపాయి. గిరిజనులు గతంలో గోచీలు పెట్టుకుని తిరుగుతూ, ఎలుకలు తింటూ జీవనం సాగించేవారని, కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అంటూ ఇప్పుడు అన్నం తింటున్నారని వ్యాఖ్యానించారు.
ఆయన వ్యాఖ్యలపై అక్కడే ఉన్న పలువురు గిరిజనులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తాను 20 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొంటే, ఒక్కటీ సవ్యంగా సాగలేదని చింతా వ్యాఖ్యానించడం సైతం చర్చనీయాంశమైంది.