అభివృద్ధిలో దళితులనూ భాగస్వాముల్ని చేయాలి
* డీఐసీసీఐ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు రవికుమార్ నర్రా
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డీఐసీసీఐ శాఖల ఏర్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం పారిశ్రామికాభివృద్ధి చెందాలంటే ముందుగా దళితులు ఆర్థికంగా పురోగతిని సాధించాలని దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డీఐసీసీఐ) ఏపీ చాప్టర్ అధ్యక్షుడు, పద్మశ్రీ రవికుమార్ న ర్రా చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పాటు పునఃపెట్టుబడులు పెరిగినప్పుడే పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో డీఐసీసీఐ శాఖలను శనివారం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో డీఐసీసీఐని కూడా రెండు రాష్ట్రాల్లో విస్తరించామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా శ్రీనివాస్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఎం. మధుసూదన్ రావును నియమించినట్లు చెప్పారు.
‘కేంద్ర ప్రభుత్వం ఏటా ఆయా రాష్ట్రాల్లో రూ.70 వేల కోట్ల విలువ చేసే పారిశ్రామిక వస్తువులను కొనుగోలు చేస్తోంది. ఇందులో 20 శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇందులో 4 శాతం (సుమారుగా రూ.7 వేల కోట్ల విలువ గల) ఎస్సీ, ఎస్టీలకు చెందిన పారిశ్రామిక వస్తువులను కొనుగోలు చేయాలి..’ అని రవికుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో దళితులను భాగస్వాముల్ని చేయడంతో పాటు ఆయా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ‘ప్రి-క్వాలిఫికేషన్’ను వెంటనే తొలగించాలని కోరారు.