మాజీ ఎమ్మెల్యే కమలమ్మ మృతి
నకిరేకల్: నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే మూసాపాటి కమలమ్మ (72) అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందారు. గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్‌తో ఆమె బాధపడుతున్నారు. ఇటీవల నిమ్స్‌లో చేరి నెలరోజుల పాటు చికిత్స పొందారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో సోదరుడి ఇంట్లో మృతి చెందారు. గురువారం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. 1972 సార్వత్రిక ఎన్నికల్లో నకిరేకల్ అసెంబ్లీ స్థానానికి కమలమ్మ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి, సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డిపై 3,836 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కమ్యూనిస్టులను ఓడించిన తొలి మహిళగా నల్లగొండ జిల్లాలో రికార్డు నమోదు చేశారు. సామాజిక కార్యకర్తగా అంతర్జాతీయ సోషల్ వర్కర్స్ మహాసభల్లో ఇందిరాగాంధీతో కలిసి ఆమె పాల్గొన్నారు.
జానారెడ్డి సంతాపం: కమలమ్మ హఠాన్మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత కె.జానారెడ్డి పేర్కొనారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కమలమ్మ ప్రజా సంక్షేమానికి పరితపించారని, కాంగ్రెస్‌లో కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి, ఎమ్మెల్యేగా ఎదిగారన్నారు.