షోలాపూర్‌లో నామినేషన్లు
షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్ సిటీ సెంట్రల్ అసెంబ్లీ నియోజక వర్గానికి సీపీఎం అభ్యర్ధి, మాజీ శాసన సభ్యుడు నర్సయ్య అడం బుధవారం నామినేషన్ వేశారు. నార్త్ షోలాపూర్ తహశీల్దార్, ఎన్నికల అధికారి శహాజీ పవార్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట సీతారాం ఎచూరీ, సీపీఎం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ ధవళే తదితరులు వచ్చారు.
నామినేషన్ వేసేందుకు నర్సయ్య కార్యకర్తలతో దత్తు నగర్, పద్మశాలి చౌక్, జిందా శామదార్ చౌక్, కిడవాయి చౌక్, పేంటర్ చౌక్, బారాయిమాం చౌక్, బీజాపూర్ చౌక్, శ్రీ మార్కండేయ మందిర్, పంచకట్ట మార్గాల మీదుగా పాద యాత్రగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తాను ఇంత కాలం చేసిన ప్రజాసేవ, పనులు చూసే ప్రజలు తనకు ఓట్లు వేస్తారన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని పిలుపునచ్చారు.
విజయ్‌దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా ఐదుగురి నామినేషన్లు
షోలాపూర్ ఉత్తర అసెంబ్లీ నియోజక వర్గానికి బీజేపీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు బుధవారం నామినేషన్లు వేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ దేశ్‌ముఖ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ మోహిణి పత్కె, జగదీష్ పాటిల్, నాగేష్ వల్యాల్, సురేష్ పాటిల్, రోహిణి తజ్వల్‌కర్‌లు నామినేషన్లు వేశారు. ఒక వేళ పార్టీ విజయ్‌కి అభ్యర్ధిత్వం కేటాయించినట్లయితే, తాము ఎన్నికల బరి నుండి విమించుకునేది లేదని ఖరాఖండిగా తెలిపారు. గొంగడి బస్తి, కన్నా చౌక్, సమాచార్ చౌక్, బీజాపూర్ ప్రాంతాల మీదుగా ఊరేగింపుగా వెళ్లి నామినేషన్లు వేశారు. విజయ్‌కి తప్ప వేరెవరికి అభ్యర్థిత్వం కేటాయించినా తాము మద్దతునిస్తామని చెప్పారు.