నవ్వుతారు వేస్తుండగానే ఊడిపోతోంది...
నాసిరకంగా నర్సంపేట - నెక్కొండ రహదారి
రూ.12కోట్ల పనుల్లో కాంట్రాక్టర్ కక్కుర్తి
ఆర్డీఓ తనిఖీల్లో నాణ్యతా లోపం బట్టబయలు
పట్టించుకోని ఆర్ అండ్ బీ అధికారులు
నర్సంపేట - వరంగల్ రోడ్డు పరిస్థితీ ఇంతే
ఇదీ... నర్సంపేట - నెక్కొండ రహదారి. మెటల్ లెవలింగ్ పూర్తి కాగా... తారు రోడ్డు వేస్తున్నారు. ఫస్ట్ లేయర్లో భాగంగా నర్సంపేట నుంచి చెన్నారావుపేట వరకు ఒక సైడ్ పూర్తయింది. తారుపోసి ఏడు రోజులైంది. ఇంతవరకు బాగానే ఉన్నా... నాసిరకం పనులతో అప్పుడే అది బిచ్చలు బిచ్చలుగా ఊడిపోతోంది. నర్సంపేటకు కిలోమీటరున్నర దూరంలో కాకతీయ నగర్ వద్ద ఓ బాటసారి తన చేతులతో తారును తీయగా... అది ఇట్లే ఊడి వచ్చింది. రహదారి పనుల్లో కొట్టొచ్చిన నాణ్యతా లోపానికి ఇదే నిలువెత్తు సాక్ష్యం.
నర్సంపేట, న్యూస్‌లైన్: నర్సంపేట నుంచి నెక్కొండ వరకు రూ.12 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 17.02 కిలోమీటర్ల రహదారి పనుల్లో నాణ్యత కొరవడింది. పర్యవేక్షణ కొరవడడంతో పాత రోడ్డును లెవల్ చేయుకుండానే తారు పోయుడంతో అది ఊడిపోతోంది. కాంట్రాక్టర్ కక్కుర్తి ఫలితంగా... వేసిన ఏడు రోజులకే లేస్తోంది. నాసిరకంగా పనులు జరుగుతుండడంతో ఇటీవల చెన్నారావుపేట గ్రామస్తులు పనులను అడ్డుకున్నారు. అధికారుల్లో చలనం రాకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
పలువురు అధికారులతో కాం ట్రాక్టర్ కుమ్మక్కై నాసిరకం పనులతో దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తగా... రెం డు రోజుల క్రితం నర్సంపేట ఆర్డీఓ స్వయంగా పరిశీలించారు. తారులో నీరు కలిపినట్లు తేలడంతోపాటు నాణ్యతలోపం, నాసిరకం సామగ్రితో పనులు జరుగుతున్నట్లు బట్టబయలైంది. అంతేకాదు... రహదారి పొడవునా నిర్మించిన కల్వర్టుల్లో నాణ్యత లోపించింది. సిమెంట్ శాతం తగ్గించడంతోపాటు నాసిరకం గొట్టాలను వినియోగించినట్లు, వెట్‌మిక్స్ పనులు మొక్కుబడిగా చేపట్టినట్లు ఆరోపణలున్నాయి. అయినా... ఆర్ అండ్ బీ, క్వాలిటీ నియంత్రణ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
నర్సంపేట-వరంగల్ రహదారీ అంతే...
నర్సంపేట నుంచి వరంగల్ వరకు రూ.22 కోట్లతో 22 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తున్న రహదారి పనుల్లో కూడా నాణ్యత కొరవడింది. రోడ్డు వెడల్పు పనుల్లో ప్రస్తుతం మెటల్ లెవలింగ్ చేస్తున్నారు. క్యూరింగ్ (నీరుచల్లడం) సరిగా లేకపోవడంతో కంకర లేస్తోంది.
మూడు డ్రమ్ముల డాంబర్ సీజ్
తారు రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లేదని ఫిర్యాదు అం దడంతో పరిశీ లించా. రోడ్డు నిర్మా ణం కోసం వాడుతున్న డాంబర్‌లో వాటర్ కలపడాన్ని గ్రహించా. వెంటనే మూడు డ్రమ్ముల డాంబర్‌ను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించా. పనుల నిర్మాణంలో నాణ్యత ఉండడం లేదని ప్రాథమికంగా అంచనా వేశాను. దీనిపై కలెక్టర్‌కు నివేదిక అందజేస్తాం.
- అరుణకువూరి, ఆర్డీఓ