రాయపాటి కి అసంతృప్తుల సెగ
సాక్షి, గుంటూరు :గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి నాలుగుసార్లు గెలుపొందిన రాయపాటి సాంబశివరావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి సమస్యలతో సతమతమౌతూనే ఉన్నారు. ఆయన టీడీపీలో చేరకముందే గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని మాజీ మంత్రి గల్లా అరుణ కుమారుడు జయదేవ్‌కు కేటాయిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం రాయపాటి టీడీపీలో చేరడంతో నరసరావుపేట పార్లమెంట్ స్థానాన్ని రాయపాటికి కేటాయించారు. సొంత నియోజకవర్గాన్ని వదులుకుని నరసరావుపేట వెళ్లిన రాయపాటికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. అక్కడ అడుగుపెట్టకముందే టికెట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తులు వెల్లువెత్తాయి. దీనికితోడు నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ కోడెల శివప్రసాదరావుకు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సత్తెనపల్లి సీటు కేటాయించి, నరసరావుపేటను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో రెండు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు.
రెండురోజులపాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన తెలుగు తమ్ముళ్లు చివరకు ఎంపీ అభ్యర్థి రాయపాటి నామినేషన్ కార్యక్రమాన్ని కూడా బహిష్కరిస్తూ నిర్ణయంతీసుకోవడంతో రాయపాటి ఇరకాటంలో పడ్డారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులను బుజ్జగించేందుకు రాయపాటి అనుచరులు రంగంలోకి దిగారు. కొందరు శాంతించి నామినేషన్ కార్యక్రమానికి హాజరైనా, మరికొందరు మాత్రం టికెట్లు మార్చే వరకూ తమ నిర్ణయం మారదంటూ భీష్మించుకుకూర్చున్నారు. తాజాగా మాచర్ల నియోజకవర్గం టికెట్ విషయంలోనూ చంద్రబాబు తడబాటుగా వ్యవహరించడం కూడా రాయపాటికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ఈనెల 19వ తేదీన నామినేషన్ల ఘట్టం మరో మూడు గంటల్లో ముగుస్తుందనగా అనూహ్యంగా కొమ్మారెడ్డి చలమారెడ్డికి మాచర్ల టికెట్ కేటాయించడంతో అక్కడ టీడీపీ నేతలంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాచర్ల టీడీపీ ఇన్చార్జ్ చిరుమామిళ్ళ మధుబాబు, జూలకంటి శ్రీనివాసరెడ్డి, జూలకంటి బ్రహ్మారెడ్డి, మానుకొండ సాంబిరెడ్డి టీడీపీ రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడంతో అక్కడా టీడీపీలో తీవ్ర నైరాస్యం నెలకొంది.
సత్తెనపల్లి నుంచి అక్కడ పార్టీ ఇన్చార్జ్ నిమ్మకాయల రాజనారాయణ, నరసరావుపేట నుంచి బీసీ నాయకులు సింహాద్రియాదవ్, వల్లెపు నాగేశ్వరరావు, మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మన్ పులిమి వెంకటరామిరెడ్డి సైతం టీడీపీ రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. వీరందరినీ బుజ్జగించి తన దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న రాయపాటికి సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతూనే ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు రెండు రోజుల్లో ముగుస్తున్నప్పటికీ మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లిల్లో రెబల్ అభ్యర్థులు పట్టువీడక పోవడంతో ఏంచేయాలో పాలుపోక రాయపాటి తలపట్టుకుంటున్నారు. అసంతృప్త నేతలను బుజ్జగించేపనిలో ఉన్న రాయపాటికి ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సమయం చాలక సతమతమౌతున్నారు. కొన్ని నియోజకవర్గాలకైతే ఎంపీ అభ్యర్థిగా ముఖం కూడా చూపకలేక పోతున్నామనే ఆందోళనలో రాయపాటి ఉన్నట్టు తెలిసింది. అసలే నియోజకవర్గానికి కొత్త కావడం, నాయకులెవరో కూడా అవగాహన లేకపోవడంతో ప్రచారంలో పూర్తిగా వెనకబడ్డారు.
ప్రచారంలో దూసుకుపోతున్న అయోధ్యరామిరెడ్డి...
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. టికెట్ల కేటాయింపు తరువాత ఎక్కడా అసంతృప్తి లేకపోవడం, గతంలో ఉన్న అసమ్మతి నాయకులందరినీ తనవైపు తిప్పుకోవడంలో ఆయన సఫలీకృతమయ్యారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించారు. దాదాపు అన్ని గ్రామాలనూ ఆయన చుట్టేశారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి అనేకమంది ముఖ్యనేతలు అయోధ్యరామిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరి చురుకుగా పనిచేస్తున్నారు. తనతోపాటు ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల గెలుపు ఖాయమంటూ అయోధ్యరామిరెడ్డి ధీమావ్యక్తం చేస్తున్నారు.