‘మిషన్ భగీరథ’ సర్వే అడ్డగింత
నర్సయ్యగూడెం(నేరేడుచర్ల) : కొంతకాలంగా వివాదస్పదంగా మారిన మిషన్ భగీరథ పైప్లైన్ నిర్మాణానికి సంబంధించి సోమవారం అధికారులు రైతులు పోలాల నుంచి సర్వే ప్రారంభించడంతో రైతులు అడ్డుకున్నారు. తమ పంట పోలాల నుంచి కాకుండా ఆర్అండ్బీ రోడ్డు వెంట వేయాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సర్వే పనులను అడ్డుకున్నారు.
పోలీసులు ఆధ్వర్యంలో సర్వే పనులు చేస్తుండగా రైతులు, మహిళలు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో పోలీసులు రైతులను అరెస్టు చేసి నేరేడుచర్ల గ్రామ శివారు నుంచి నర్సయ్యగూడెం గ్రామ శివారు వరకు పైప్లైన్ నిర్మాణానికి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ మధుబాబు, డీఈ వెంకటరెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ, సీఐ రజితా రెడ్డి, ఎస్ఐలు గోపి, యాదవేందర్రెడ్డిలు పాల్గొన్నారు.