Nashik district
-
మా నీళ్లను దొంగలించారు సారూ!
సాక్షి ముంబై: మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి, కరువు కారణంగా నీటి దొంగలు కూడా తయారయ్యారు. నాసిక్‌జిల్లా మన్మాడ్‌లో 300 లీటర్ల నీటిని దుండగులు దొంగిలించారు. మన్మాడ్‌లోని శ్రావస్తినగర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మరికొందరి ఇళ్లలో కూడా ఇలాగే జరిగిందని తెలుస్తోంది. మన్మాడ్కు నీటి సరఫరా చేసే జలాశయాల్లో అడుగంటిపోయాయి. దీంతో మన్మాడ్‌లో తీవ్ర నీటి ఎద్దడి సమస్య ఉండటంతో నీటి సరఫరా సుమారు 20 రోజులకు ఒకసారి అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో అనేక మంది డ్రమ్ములతోపాటు ట్యాంకులు కొనుగోలు చేసి నీటిని నిల్వ చేసుకుంటున్నారు. శ్రావస్థినగర్లో నివసించే విలాస్ ఆహిరే కూడా అందరి మాదిరిగానే ఓ 500 లీటర్ల ట్యాంకు బంగ్లాపై ఉంచి నీటిని నిల్వచేసుకుని వినియోగించుకోసాగారు. అయితే మన్మాడ్ మున్సిపాలిటీ కుళాయిలో నీటి సరఫరా చేయడంతో ఆ ట్యాంకును పూర్తిగా నింపుకుని నీటిని నిల్వచేసుకున్నాడు. కానీ, ఊహించని విధంగా మరుసటి రోజు ఉదయం పరిశీలిస్తే ట్యాంకులోని నీరు దొంగతతనానికి గురైందని తెలిసింది. ఈ ట్యాంకులో నుంచి సుమారు 300 లీటర్లకుపైగా నీటిని ఎవరో దొంగిలించుకుపోయారు. ఈ విషయంపై మన్మాడ్ పట్టణ పోలీసు స్టేషన్లో ఆయన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సదరు నీటి దొంగలను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని విలాస్ ఆహిర్ కోరారు. తీవ్ర కరువు సమీపిస్తోంది! రాష్ట్రంలో రోజురోజుకి నీటి సమస్య జఠిలమవుతోంది. మరాఠ్వాడా, విదర్బ, పశ్చిమ మహారాష్ట్రతోపాటు అనేక ప్రాంతాల్లో గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. దీంతో అనేక ప్రాంతాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో కరువు తాండవిస్తోంది. మరోవైపు జలాశయాలు, బావులు అడుగంటిపోతున్నాయి. ఊష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో జలాశయాల్లోని నీరు త్వరగా తగ్గుతోంది. పరిణామంగా అనేక ప్రాంతాల్లో సాగునీటితోపాటు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక గ్రామాల్లో వివాహాలతోపాటు ఇతర ఏదైనా కార్యాలు చేయాలంటే ప్రజలు భయపడుతున్నారు. నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో అనేక మంది పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకుంటున్నట్టు తెలిసింది. దీన్నిబట్టి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది మనకు స్పష్టం అవుతుంది. లాతూరులో సర్పంచిని చితకబాదిన గ్రామస్థులు.. లాతూరు జిల్లాలోని ఓ గ్రామంలో నీటి సమస్య పరిష్కారంపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామ సర్పంచిని స్థానిక ప్రజలు చితక బాదారు. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. లాతూరు జిల్లా హాలసీ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మరాఠ్వాడాలోని లాతూర్ జిల్లాల్లో నీటి ఎద్దడి సమస్య తీవ్రంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఉన్న నీటి వనరులను కాపాడునేందుకు గ్రామస్థులు, ప్రభుత్వం, అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే హాలసీ గ్రామంలో బావుల కోసం ప్రజలందరు కలిసి డబ్బులు జమచేశారు. అయితే ఎన్నికల నియమావలి ఉందంటూ జాప్యం చేస్తూ వచ్చిన హాలసీ గ్రామ సర్పంచిని గ్రామస్థులు వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. అయితే ఏవో సాకులు చెబుతుండటంతో కోపోద్రిక్తులైన గ్రామస్థులు సర్పంచిని చితక బాదారు. ఈ సంఘటన తీవ్ర కలకలంతోపాటు భయాందోళనలను రేకేత్తించింది. నీటి కోసం ఇలా గోడవలు జరగడం ఆందోళన కలిగించే విషయమని పలువురు పేర్కొంటున్నారు. -
ఓటు వేయలేదని మహిళపై సజీవదహన యత్నం
సాక్షి, ముంబై: తాము చెప్పిన అభ్యర్థికి ఓటు వేయలేదని ఓ మహిళను సజీవదహనం చేసేందుకు దుండగులు యత్నించారు. ఈ సంఘటనలో జెలుబాయి వాబలే (65) తీవ్ర గాయాలయ్యాయి. కాగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. యేవ్లా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఫుల్మాలి ‘సాక్షి’కి అందించిన వివరాల మేరకు.. నాసిక్ జిల్లా యేవ్లా తాలూకా బాభుల్‌గావ్ గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన అశోక్ బోరనారే, పాండురంగ బోరనారే, నందకిషోర్ భూరక్ బుధవారం ఓటు వేసేందుకు బయలుదేరిన జెలూబాయి వాబలేకు మూడవ నంబర్ బటన్ (మీట) నొక్కాలని చెప్పారు. అయితే వయసు పైబడడంతో ఆమె రెండవ నంబర్ మీట నొక్కింది. ఇది తెలుసుకున్న నిందితులు ముగ్గురు గురువారం రాత్రి జెలుబాయిపై దాడిచేసేందుకు ఆమె ఇంటికి వెళ్లారు. ఇంటిబయటే కూర్చున్న ఆమెను చూసి చివాట్లు పెడుతూ ఇంట్లో ఉన్న కిరసనాయిల్ ఒంటిపై పోసి నిప్పంటించారు. సుమారు 60 శాతం కాలిన ఆమెను నాసిక్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అర్ధరాత్రి ముగ్గురు నిందితులపై కేసు నమోదుచేసుకుని అరెస్టు చేశారు. -
భారీగా రైళ్ల రద్దు....
సాక్షి, ముంబై: గోటీ-ఇగత్పురి రైల్వే స్టేషన్ల మధ్య మంగళ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం పట్టాలు తప్పి ముగ్గురు మరణించిన నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించి నడుపుతున్నారు. రద్దు చేసిన రైళ్లలో అప్, డౌన్ ఎల్టీటీ-మన్మాడ్ రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్, అప్, డౌన్ సీఎస్టీ-మన్మాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్, అప్, డౌన్ సీఎస్టీ-బుసావల్ ప్యాసింజర్ రైళ్లతోపాటు నాందేడ్-సీఎస్జీ తపోవన్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. మరోవైపు సీఎస్టీ నుంచి నాందేడ్‌కు బయలుదేరిన తపోవన్ ఎక్స్‌ప్రెస్‌ను కళ్యాణ్ వద్ద నిలిపివేశారు. 12 రైళ్ల మళ్లింపు... మంగళ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాల తప్పిన అనంతరం ఇగత్పురి-గోటీ రైల్వేస్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో కొన్ని రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని పుణే, దౌండ్, మన్మాడ్ మీదుగా నడిపించారు. అప్, డౌన్ మార్గాల్లో నడిచే మొత్తం 12 రైళ్లను పుణే, దౌండ్ మీదుగా నడిపించారు. నాలుగు నెలల్లో రెండో ఘటన... ఇగత్పురి రైల్వే స్టేషన్ సమీపంలో నాలుగు నెలలు తిరగకుండానే మరో ఘటన జరిగింది. ఇదే సంవత్సరం జూలై ఐదున సికింద్రాబాద్-దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు ఇగత్పురి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. రైల్వేస్టేషన్ సమీపంలో ఈ సఘటన జరగడం, వేగం కూడా తక్కువగా ఉన్నందున ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన జరిగి నాలుగు నెలలు కాకముందే మంగళ ఎక్స్‌ప్రెస్ కూడా శుక్రవారం పట్టాలు తప్పింది. ఈ ప్రమాదానికి కారణమేంటన్నది ఇంత వరకు తెలియరాలేదు. ప్రత్యేక రైళ్లో ప్రయాణికుల తరలింపు ఘటనాస్థలంలో ఇరుక్కుపోయిన ప్రయాణికులను ప్రత్యేక రైళ్లో ఎర్నాకుళంకు పంపించారు. సెంట్రల్ రైల్వే పీఆర్ఓ ఎకె సింగ్ అందించిన వివరాల మేరకు సుమారు 450 ప్రయాణికులను 10 బస్సుల ద్వారా ముందుగా ఇగత్పురి రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం ఓ ప్రత్యేక రైళ్లో మధ్యాహ్నం 12.30 గంటలకు గమ్యస్థానాలకు పంపించారు. మృతులు, గాయపడిన వారి వివరాలు.. మృతుల్లో హర్యానా పథోడాకు చెందిన సత్యబీర్ సింగ్ (40), ఉత్తరప్రదేశ్ అలీగఢ్వాసి రాజు కుషువా (34) ఉన్నారు. మూడో వ్యక్తి వివరాలు తెలియరాలేదు. గాయపడినవారు.. మహిళలుః కమలా రమణి (70), మాధవి భైరన్ (28), సిమ్రన్ రమానీ (35),అశ్వినీ పురగావ్కర్ (50), రింకూశర్మ (25), సుని తా రాథోడ్ (28), నేహా రమానీ (19) ఉన్నారు. చిన్నారులు (బాలికలు)ః శుభి రాథోడ్ (1.5 ఏళ్లు), రియా రమానీ (రెండున్నరేళ్లు). పురుషులుః ముర ళీధర్ (60), రాహుల్ రమానీ (10), తెక్సింగ్ (60), సూరజ్ గౌతమ్ (30), సూర్తాజ్ కుమార్ (38), ఉత్తమ్‌చంద్ ఖండేల్వాల్ (40), రాజేష్‌కుమార్ (25), పురుషోత్తం బన్వారీ (54), కుమార్ బన్వారీ (44), రామ్ రమానీ (38), ప్రకాష్ రమానీ (35) ఉన్నారు. మిగతా ఆరుగురి వివరాలు అందాల్సి ఉంది.