స్వాతి హత్య వెనుక ముగ్గురున్నారా?
చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో ప్రధాన నిందితుడు రామ్ కుమార్ ని అరెస్టు చేసి కేసు అంతు తేల్చామని పోలీసులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుండగా.. అసలైన ప్రశ్నలు వాటి వెనుక అనుమానాలు మాత్రమే అలాగే ఉండిపోయాయి. ఆ ప్రశ్నలకు పోలీసులు కూడా సమాధానాలు చెప్పకుండా దాట వేస్తున్నారు. మీడియా అడుగుతున్న ప్రశ్నలు, ప్రత్యక్ష సాక్షి, నిందితుడి వాంగ్మూలం ప్రకారం ఈ కేసులో ముగ్గురు వ్యక్తులకు ఈ కేసులో భాగస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది.
తనకు 50 గజాల దూరంలోనే స్వాతి హత్య జరిగిందని, తాను ప్రత్యక్షంగా ఆ వ్యక్తిని చూశానని సెల్వం అనే ఓ ప్రొఫెసర్ వాంగ్మూలం ఇచ్చాడు. అయితే, ఆరోజు స్వాతిని చెంపదెబ్బ కొట్టిన వ్యక్తిని చూశానని, అతడు.. ప్రస్తుతం అరెస్టు అయిన వ్యక్తి ఒకటి కాదని అన్నారు. అయితే, మరి చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నకు పోలీసుల వద్ద సమాధానం లేదు. స్పందించేందుకు నిరాకరించారు. అలాగే, రామ్ కుమార్ తోపాటు రూమ్ మేట్ గా ఉన్న ఓ సంస్థ సెక్యూరిటీ గార్డు నటేశాన్ కనిపించకుండా పోయాడు.
దీనిపై ప్రశ్నించగా అతడు పరారీలో ఉన్నట్లు చెప్తున్నారు. అయితే, పోలీసుల అదుపులోనే ఉన్నట్లు, ఈ హత్య కేసులో అతడే ప్రధాన సాక్షి అని తెలుస్తోంది. ఒక వేళ నటేశాన్ కు ఈ హత్య విషయం ముందే తెలియకుంటే పోలీసులకు ఆ సమాచారం ఎందుకు ఇవ్వలేదని, నిందితుడి కోసం తొలుత పోలీసులు గడపగడప తిరిగి అడిగినా ఎందుకు అతడు వివరాలు అందించలేదని మరో ప్రశ్న తలెత్తుతోంది.
సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి ద్వారా స్వాతి తనకు పరిచయం అయిందని, తన కోసం సూర్య ప్రకాశ్ మధ్యవర్తిగా ఉన్నాడని పోలీసులకు చెప్పాడు. అయితే, వాస్తవానికి రామ్ కుమార్ ప్రెండ్స్ లిస్ట్ లో సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి లేడు. అసలు ఇంతకీ ఆ సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి ఎవరు? అతడు అసలు ఉన్నాడా లేడా అనే విషయం పోలీసులు ఎందుకు విచారణ చేయడం లేదని మరి కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి స్వాతి హత్య చిక్కుముడులు ఇంకా వీడనట్లేనని చెప్పవచ్చు.