ఈ సేకరణ చట్టబద్ధం కాదు
సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘భూ సమీకరణ చట్టబద్ధం కాదు. చిన్నచిన్న ప్రాజెక్టులు, కాలనీల నిర్మాణం కోసమే పలుచోట్ల సమీకరణ జరిగింది. ప్రపంచంలో ఎక్కడా ఇంతవరకూ ఒక నగర నిర్మాణం కోసం భూమిని సమీకరించడం జరగలేదు’’ అని హర్యానా రాజధాని చండీగడ్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవసహాయం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతంలో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక (ఎన్ఏపీఎం) చేపట్టిన వాస్తవాభిప్రాయ సేకరణలో ఆయన గత రెండు రోజులుగా పాల్గొంటున్నారు.
శనివారం విజయవాడలోని ఇంజనీర్స్ భవన్లో జరిగిన రాజధాని రైతుల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 1974-79లో చండీగఢ్ రెండో దశ నగర నిర్మాణ ప్రాజెక్టుకు పర్యవేక్షకునిగా పనిచేసిన అనుభవంతో తాను వాస్తవాభిప్రాయసేకరణలో పాల్గొంటున్నానని దేవసహాయం తెలి పారు.వాస్తవ పరిస్థితులతో నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పిస్తామని చెప్పారు.
ఒప్పించి భూములు తీసుకోవాలి: ఆర్కే
రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని అయితే అందరినీ ఒప్పించి భూములు తీసుకోవాలని సూచిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజధాని నిర్మాణ కమిటీలో ప్రతిపక్ష పార్టీకి, ఇతర రాజకీయ పార్టీలకు చివరికి రైతులు, రైతు నాయకులెవరికీ స్థానం కల్పించలేదని.. అందరూ టీడీపీ వారినే నియమించారని ఆయన విమర్శించారు.
విజయవాడ కంటే పెద్ద నగరాన్ని కడతారా?
ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణ విషయాలను సింగపూర్, జపాన్ వాళ్లకు చెప్తున్నారు గానీ ఇక్కడి వాళ్లకు చెప్పడంలేదని మాజీ మంత్రి, వ్యవసాయ వేత్త వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. విజయవాడకంటా పెద్ద నగరం కడతారా అని ప్రశ్నించారు.70 శాతం ప్రభావిత కుటుంబాలు ఒప్పుకుంటేనే ఎక్కడైనా భూములు తీసుకుంటారని కానీ బెదిరించి తీసుకోవడం అన్యాయమని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి మండిపడ్డారు.
ఏం జరుగుతుందో తెలియడం లేదు..
భూములు ఇవ్వడానికి తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయడంలేదని తుళ్లూరు మండలం రాయపూడి పీఎస్సీఎస్ అధ్యక్షుడు హరీంద్రనాథ్‌చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి సమితి అధ్యక్షుడు కొలనుకొండ శివాజీ అధ్యక్షత వహిం చగా.. సమాఖ్య కన్వీనర్ మల్లెల లక్ష్మణరావు, సమతా పార్టీ నేత కృష్ణారావు, ఎర్నేని నాగేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.