జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కంట్రీ క్లబ్ న్యూ ఇయర్ వేడుకలు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా పది నగరాలతో పాటు మధ్యప్రాచ్యంలోని దుబాయ్, మస్కట్, బహ్రెయిన్, దోహాలో ఈ ఏడాది డిసెంబరు 31న నూతన సంవత్సర వేడుకల కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కంట్రీ క్లబ్ సీఎండీ వై.రాజీవ్‌రెడ్డి తెలి పారు. రాఖీ సావంత్, షెఫాలీ జరీవాలా వంటి తారలు పాల్గొంటారని వివరించారు. హైదరాబాద్‌లో జరిగే వేడుకల్లో సినీ తార చార్మి పాల్గొంటారని ఆయన ఒక కార్యక్రమంలో ప్రకటించారు.
దేశీయంగా ఢిల్లీ, ముంబై, జైపూర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించే వేడుకల్లో ఆర్తి చాబ్రియా, పాయల్ రోహత్గీ తదితరులు సందడి చేయనున్నట్లు రాజీవ్‌రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. కొత్త సంవత్సర సంరంభాల్లో ఆసియాలోనే ఇవి అతి పెద్ద వేడుకలని, వీటిని ఎనిమిదోసారి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే వీటి కోసం కసరత్తు ప్రారంభమైందన్నారు. ప్రస్తుతం కంట్రీ క్లబ్లో నాలుగు లక్షల దాకా సభ్యులున్నారని ఆయన తెలియజేశారు.
ఆగ్నేయాసియా, ఆఫ్రికా, బ్రిటన్ దేశాల్లో కూడా తమ కార్యకలాపాలు విస్తరించామని రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు. కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఇటీవలే హెల్త్, ఫిట్నెస్ రంగంలోకి కూడా ప్రవేశించామన్నారు. ఇప్పటికే 20 ఫిట్నెస్ సెంటర్లు ఉన్నాయని, వచ్చే ఏడాది మరో 30 ప్రారంభించనున్నామని ఆయన చెప్పారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో తమ పేజీకి 2.50 లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారని రాజీవ్‌రెడ్డి తెలిపారు.