national badminton
-
విదేశీ కోచ్‌లు కాదు... వ్యవస్థ బాగుండాలి
న్యూఢిల్లీ: భారత క్రీడల్లో విదేశీ కోచ్‌ల రాకతో మొత్తం మారిపోతుందనుకుంటే పొరపాటని... ముందు వ్యవస్థ బాగుంటేనే అన్ని బాగుంటాయని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ‘మన క్రీడా ప్రగతికి విదేశీ కోచ్‌లు కీలక భూమిక పోషిస్తారు. నిజానికి వారి సేవలు అవసరం కూడా.... భిన్నదేశాలకు చెందిన కోచ్‌ల మేళవింపు మనకు మేలు చేస్తుంది. క్రీడల్లో మనకు నైపుణ్యం లేని చోట ప్రారంభ దశలో విదేశీ సహాయ బృందాలు కావాల్సిందే. అయితే విజయవంతంగా రాణిస్తున్న జట్లకూ విదేశీ కోచ్‌లే ఉండాలంటే అది ఎంత మాత్రం మంచిది కాదు. దీని వల్ల మన వ్యవస్థకు న్యాయం జరగదు. విదేశీ కోచ్‌లను సలహాదారులుగా వినియోగించుకోవచ్చు. కానీ ముఖ్యమైన కోచింగ్ బాధ్య తలు, అధికారాలు స్వదేశీ కోచ్‌లకే అప్పజెప్పాలి. ఆటగాళ్లు విదేశీ కోచ్‌ల నుంచి నేర్చుకోవడం ముఖ్యమే. అలాగే ఎప్పుడో ఒకప్పుడు వాళ్లను వదులుకోవాలి. ఎందుకంటే వాళ్లు మనల్ని ద్వితీయ శ్రేణి జట్టుగానే తయారు చేస్తున్నారు. కారణం వాళ్లూ ద్వితీయ శ్రేణి కోచ్‌లే! వాళ్ల దేశంలోని అత్యుత్తమ కోచ్‌లు వారి ఆటగాళ్లకు సేవలందిస్తారు. రెండో ఉత్తమ కోచ్‌లు ఇతర దేశాలకు తరలి వెళతారు’ అని ఆయన వివరించారు. -
టాప్ షట్లర్లకు లీగ్ నిర్వహించాలి
న్యూఢిల్లీ : త్వరలోనే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పునరుద్ధరణ కానుందనే వాస్తవాన్ని మన షట్లర్లు అంగీకరించాల్సిందేనని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. ఇప్పటికీ ప్రాక్టీస్ ప్రారంభించడంలో మన క్రీడాకారులు వెనుకబడ్డారని... కలిసి ప్రాక్టీస్ చేయడానికి ఆటగాళ్లు ఇంకా సంకోచిస్తున్నారన్నాడు. ఇటీవల ‘సాయ్’ క్వారంటైన్ నిబంధనల ప్రకారం ప్రాక్టీస్ చేసేందుకు భారత షట్లర్లు తిరస్కరించడంతో హైదరాబాద్‌లో జరగాల్సిన ‘థామస్ కప్–ఉబెర్ కప్’ జాతీయ శిక్షణా శిబిరాన్ని కూడా రద్దు చేయాల్సి వచ్చింది. ‘అతి త్వరలో అంతర్జాతీయ టోర్నీలు జరుగుతాయనే విషయాన్ని మన ఆటగాళ్లు ఇంకా గుర్తించడం లేదు. కరోనా గురించే ఆలోచిస్తూ కలిసి ప్రాక్టీస్ చేసేందుకు ఇంకా సంకోచిస్తున్నారు. ప్రాక్టీస్ అంశంలో ఆటగాళ్ల తరఫు నుంచే ఇబ్బందులు ఎదురవుతున్నాయి’ అని గోపీచంద్ చెప్పాడు. టాప్ షట్లర్లు లయ కోల్పోకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వారికి ఒక లీగ్ నిర్వహించాలని గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. ‘ప్రపంచవ్యాప్తంగా క్రీడలు ప్రారంభమయ్యాయి. దీనర్థం మనం కూడా వారితో సమానంగా క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనాలి. లేదంటే రేసులో వెనకబడతాం. గతం తరహా పరిస్థితులు ఇప్పుడు ఉండబోవు. దీన్ని అర్థం చేసుకొని అలవాటు పడాలి. దేశంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లను ఎంపిక చేసి వారికో లీగ్ నిర్వహించాలి. ఇలా చేస్తే అంతర్జాతీయ ఆటగాళ్లతో సమానంగా మనవాళ్లు సన్నద్ధంగా ఉంటారు’ అని 46 ఏళ్ల గోపీచంద్ వివరించాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల కంటే జూనియర్ స్థాయి క్రీడాకారుల గురించే తాను ఆందోళన చెందుతున్నట్లు చెప్పాడు. ఎదిగే దశలో ఈ విరామం వారికి చేటు చేస్తుందని అన్నాడు. -
నన్నెందుకు పక్కన పెట్టారు
హైదరాబాద్: జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణా శిబిరంలో పాల్గొనేందుకు తనను ఎంపిక చేయకపోవడంపై సీనియర్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు ఏ ప్రాతిపదికపైన ఎనిమిది మందికే అవకాశం ఇచ్చారని అతను సూటిగా ప్రశ్నించాడు. ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఈ క్యాంప్ జరుగుతోంది. ఇందులో 2021 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉన్న ఎనిమిది మందినే (సింధు, సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్, సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, చిరాగ్, సాత్విక్) శిక్షణ కోసం ఎంపిక చేశారు. తాను కూడా ప్రస్తుతం ఒలింపిక్స్‌కు అర్హత సాధించే ప్రయత్నంలో ఉన్నానని, ఆ అవకాశం తనకూ ఉందని అతను గుర్తు చేశాడు. ‘నా దృష్టిలో ఎనిమిది మందినే అనుమతించడంలో అసలు అర్థం లేదు. నాకు తెలిసి ఒలింపిక్స్‌కు ముగ్గురు మాత్రమే ఇప్పటికే దాదాపుగా అర్హత సాధించారు. మిగిలినవారు అర్హత సాధించడం అంత సులువేం కాదు. ఈ జాబితాలో శ్రీకాంత్, మహిళల డబుల్స్ జోడి కూడా ఉన్నారు. సాయిప్రణీత్, శ్రీకాంత్‌ల తర్వాత నేను ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 23వ స్థానంలో ఉన్నాను. నా పేరును ఎందుకు పరిశీలించలేదు’ అని కశ్యప్ అన్నాడు. ‘సాయ్’ స్పందించలేదు... ఈ జాబితాను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) రూపొందించిందని, అందుకే కోచ్ గోపీచంద్ సలహాపై వారినే ఈ విషయంలో ప్రశ్నించినా... సంతృప్తికర సమాధానం రాలేదని కశ్యప్ అసహనం వ్యక్తం చేశాడు. ‘సాయ్ డీజీని నేను ఇదే విషయం అడిగాను. మరో 7–8 అర్హత టోర్నీలు మిగిలి ఉన్న ప్రస్తుత దశలో ఈ ఎనిమిది మందినే ఎంపిక చేయడానికి, తనను పరిగణలోకి తీసుకుపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించాను. ఒక రోజు తర్వాత ‘సాయ్’ అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి ఉన్నతాధికారుల సూచనలతోనే ఈ పేర్లు చెప్పామని, వీరికి మాత్రమే ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉన్నట్లుగా తాము భావించామని అన్నారు. ఆ ఎనిమిది మంది అనారోగ్యం బారిన పడకుండా ఒలింపిక్స్ వరకు జాగ్రత్తలు తీసుకుంటామని కూడా చెబుతున్నారు. అయితే వారంతా క్యాంప్‌లో ఉండటం లేదు. బయట తమకు నచ్చినవారిని కలుస్తున్నారు కూడా. మరి వారిని ఆరోగ్యంగా ఉంచుతామని అనడంలో అర్థమేముంది’ అని కశ్యప్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. గోపీచంద్ అకాడమీలో ప్రస్తుతం 9 కోర్టులు ఉంటే వేర్వేరు సమయాల్లో నలుగురు మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారని... మిగిలిన సమయంలో తమకు శిక్షణకు అవకాశం ఇవ్వడంలో అభ్యంతరం ఏముందని అతను అన్నాడు. వీరి కోసం 9 మంది కోచ్‌లు, ఇద్దరు ఫిజియోలు కూడా పని చేస్తున్నారని గుర్తు చేసిన కశ్యప్... శిక్షణకు అవకాశం ఇవ్వకపోతే తాను ఒలింపిక్స్‌కు ఎలా అర్హత సాధించగలనని అతను తన ఆవేదనను ప్రకటించాడు. -
ఒలంపిక్స్‌కు ప్రాతినిధ్యం వహించాలి
కడప స్పోర్ట్స్ : ఒలంపిక్స్‌కు ప్రాతినిధ్యం వహించేలా క్రీడాకారులు చక్కటి ఆటతీరును కనబరచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్వేత తెవతీయ అన్నారు. మంగళవారం ఇక్కడి వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలకు ఆమె హాజరై పలువురు క్రీడాకారులతో మాట్లాడారు. రాబోయే కాలంలో జిల్లా నుంచి కూడా ఒలంపిక్‌లో పాల్గొనేలా ఈ క్రీడాపోటీలు స్ఫూర్తినిస్తాయన్నారు. కడపలో ఆలిండియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రోజురోజుకీ బ్యాడ్మింటన్ క్రీడకు ఆదరణ పెరుగుతోందన్నారు. నాణ్యమైన ఆటతీరును కనబరిచి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని సూచించారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. జిలానీబాషా మాట్లాడుతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఇప్పటికే కడపకు చేరుకున్నారన్నారు. 15, 16 తేదీల్లో క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు, 17 నుంచి 20వ తేదీ వరకు మెయిన్ డ్రా మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ కె.వి. సత్యనారాయణ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ టోర్నీ విజయవంతం చేయడంలో మార్గదర్శనం చేస్తున్నారన్నారు. అంతకు ముందు వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులతో జేసీ మాట్లాడి వారి మనోగతాన్ని తెలుసుకున్నారు. కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. అనంతరం జేసీ క్రీడాకారులకు అందించే సౌకర్యాలను పరిశీలించారు. డీఎస్డీఓ లక్ష్మినారాయణశర్మ, ఎస్ఎస్ఏ పీఓ వెంకటసుబ్బయ్య, సీపీఓ తిప్పేస్వామి, చీఫ్ రెఫరీ బ్రిజేష్‌గౌర్, జిల్లా బ్యాడ్మింటన్ సంఘం కోశాధికారి నాగరాజు, ఉపాధ్యక్షులు శశిధర్‌రెడ్డి, సంజయ్ కుమార్‌రెడ్డి, మునికుమార్‌రెడ్డి, బాలగొండ గంగాధర్, సంయుక్త కార్యదర్శులు రెడ్డి ప్రసాద్, సభ్యులు రవిశంకర్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.