న్యూఢిల్లీ : త్వరలోనే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పునరుద్ధరణ కానుందనే వాస్తవాన్ని మన షట్లర్లు అంగీకరించాల్సిందేనని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. ఇప్పటికీ ప్రాక్టీస్ ప్రారంభించడంలో మన క్రీడాకారులు వెనుకబడ్డారని... కలిసి ప్రాక్టీస్ చేయడానికి ఆటగాళ్లు ఇంకా సంకోచిస్తున్నారన్నాడు. ఇటీవల ‘సాయ్’ క్వారంటైన్ నిబంధనల ప్రకారం ప్రాక్టీస్ చేసేందుకు భారత షట్లర్లు తిరస్కరించడంతో హైదరాబాద్‌లో జరగాల్సిన ‘థామస్ కప్–ఉబెర్ కప్’ జాతీయ శిక్షణా శిబిరాన్ని కూడా రద్దు చేయాల్సి వచ్చింది.
‘అతి త్వరలో అంతర్జాతీయ టోర్నీలు జరుగుతాయనే విషయాన్ని మన ఆటగాళ్లు ఇంకా గుర్తించడం లేదు. కరోనా గురించే ఆలోచిస్తూ కలిసి ప్రాక్టీస్ చేసేందుకు ఇంకా సంకోచిస్తున్నారు. ప్రాక్టీస్ అంశంలో ఆటగాళ్ల తరఫు నుంచే ఇబ్బందులు ఎదురవుతున్నాయి’ అని గోపీచంద్ చెప్పాడు. టాప్ షట్లర్లు లయ కోల్పోకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వారికి ఒక లీగ్ నిర్వహించాలని గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. ‘ప్రపంచవ్యాప్తంగా క్రీడలు ప్రారంభమయ్యాయి. దీనర్థం మనం కూడా వారితో సమానంగా క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనాలి. లేదంటే రేసులో వెనకబడతాం. గతం తరహా పరిస్థితులు ఇప్పుడు ఉండబోవు. దీన్ని అర్థం చేసుకొని అలవాటు పడాలి. దేశంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లను ఎంపిక చేసి వారికో లీగ్ నిర్వహించాలి. ఇలా చేస్తే అంతర్జాతీయ ఆటగాళ్లతో సమానంగా మనవాళ్లు సన్నద్ధంగా ఉంటారు’ అని 46 ఏళ్ల గోపీచంద్ వివరించాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల కంటే జూనియర్ స్థాయి క్రీడాకారుల గురించే తాను ఆందోళన చెందుతున్నట్లు చెప్పాడు. ఎదిగే దశలో ఈ విరామం వారికి చేటు చేస్తుందని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment