Thomas Cup
-
చైనా ‘డబుల్’ ధమాకా... థామస్ కప్, ఉబెర్ కప్ టైటిల్స్ సొంతం..
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తమకు తిరుగులేదని చైనా జట్లు మరోసారి చాటుకున్నాయి. థామస్ కప్, ఉబెర్ కప్ టీమ్ టోర్నమెంట్లో విజేతగా అవతరించాయి. సొంతగడ్డపై ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో చైనా మహిళల జట్టు ఉబెర్ కప్‌ను 16వ సారి... చైనా పురుషుల జట్టు థామస్ కప్‌ను 11వ సారి సొంతం చేసుకున్నాయి.ఇండోనేసియాతో జరిగిన ఉబెర్ కప్ టైటిల్ పోరులో చైనా 3–0తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో చెన్ యు ఫె 21–7, 21–16తో మరిస్కాపై... రెండో మ్యాచ్‌లో చెన్ కింగ్ చెన్–జియా యి ఫాన్ 21–11, 21–8తో సితి ఫాదియా–రిబ్కా సుగియార్తోలపై... మూడో మ్యాచ్‌లో హి బింగ్ జియావో 10–21, 21–15, 21–17తో ఎస్తెర్పై గెలిచారు. థామస్ కప్ ఫైనల్లో చైనా 3–1తో ఇండోనేసియాను ఓడించింది.తొలి మ్యాచ్‌లో షి యు కి 21–17, 21–6 తో జిన్టింగ్పై, రెండో మ్యాచ్‌లో లియాంగ్ –వాంగ్ చాంగ్ 21–18, 17–21, 21–17తో ఫజర్–అర్దియాంతోలపై నెగ్గడంతో చైనా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌లో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) 21–16, 15–21, 21–17తో లీ షి ఫెంగ్‌ను ఓడించాడు. నాలుగో మ్యాచ్‌లో హి జి టింగ్–జియాంగ్ 21–11, 21–15తో ఫిక్రి–మౌలానాలపై నెగ్గి చైనాకు 3–1తో టైటిల్‌ను ఖరారు చేశారు.ఇవి చదవండి: స్టార్ రెజ్లర్ బజరంగ్ పై.. తాత్కాలిక నిషేధం! -
క్వార్టర్ ఫైనల్స్‌లో ముగిసిన భారత్ పోరు
చెంగ్డూ: థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 1–3తో 10 సార్లు చాంపియన్ చైనా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ప్రణయ్ 21–15, 11–21, 14–21తో షి యుకి చేతిలో... రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 15–21, 21–11, 12–21తో లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో ఓడిపోయారు. మూడో మ్యాచ్‌లో లక్ష్య సేన్ 13–21, 21–8, 21–14తో లి షి ఫెంగ్‌పై గెలుపొందాడు. నాలుగో మ్యాచ్‌లో సాయిప్రతీక్–ధ్రువ్ కపిల 10–21, 10–21తో హి జి టింగ్–రెన్ జియాంగ్ యు చేతిలో ఓటమి పాలవ్వడంతో భారత పరాజయం ఖరారైంది. ఉబెర్ కప్ మహిళల టీమ్ క్వార్టర్ ఫైనల్లో ద్వితీయ శ్రేణి క్రీడాకారిణులతో బరిలోకి దిగిన భారత జట్టు 0–3తో జపాన్ చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో అషి్మత 10–21, 22–20, 15–21తో అయా ఒహోరి చేతిలో... ప్రియ–శ్రుతి మిశ్రా 8–21, 9–21తో నామి మత్సుయామ–చిహారు షిదా చేతిలో... ఇషారాణి 15–21, 12–21తో ఒకుహారా చేతిలో ఓడిపోయారు. -
చైనాతో భారత్ ‘ఢీ’
చెంగ్డూ (చైనా): ప్రతిష్టాత్మక థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు సెమీఫైనల్ బెర్త్ కోసం 10 సార్లు చాంపియన్ చైనాతో క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–4తో 14 సార్లు చాంపియన్ ఇండోనేసియా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ ప్రణయ్ 61 నిమిషాల్లో 13–21, 21–12, 21–12తో ప్రపంచ ఏడో ర్యాంకర్ ఆంథోనీ సినిసుక జిన్‌టింగ్‌ను ఓడించాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 77 నిమిషాల్లో 22–24, 24–22, 19–21తో షోహిబుల్ ఫిక్రి–మౌలానా బగస్ జంట చేతిలో ఓడిపోయింది. మూడో మ్యాచ్‌లో లక్ష్య సేన్ 65 నిమిషాల్లో 18–21, 21–16, 17–21తో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ జొనాథన్ క్రిస్టీ చేతిలో ఓటమి పాలయ్యాడు. నాలుగో మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–సాయిప్రతీక్ జోడీ 20–22, 11–21తో లియో కార్నాండో–డేనియల్ మార్టిన్ జంట చేతిలో పరాజయం పాలైంది. చివరిదైన ఐదో మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–19, 22–24, 14–21తో ద్వి వర్దాయో చేతిలో ఓడిపోయాడు. గ్రూప్ ‘సి’లో ఇండోనేసియా ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ నెగ్గి అగ్రస్థానంలో నిలువగా... భారత్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాతో భారత్; మలేసియాతో జపాన్; కొరియాతో ఇండోనేసియా; చైనీస్ తైపీతో డెన్మార్క్ తలపడతాయి. మరోవైపు మహిళల టీమ్ టోర్నీ ఉబెర్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో నేడు జపాన్‌తో భారత్; డెన్మార్క్‌తో చైనా... శుక్రవారం ఇండోనేసియాతో థాయ్‌లాండ్; చైనీస్ తైపీతో కొరియా పోటీపడతాయి. -
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
చెంగ్డూ (చైనా): రెండేళ్ల క్రితం థామస్ కప్ టోర్నమెంట్లో తొలిసారి విజేతగా నిలిచి పెను సంచలనం సృష్టించిన భారత పురుషుల జట్టు అదే ఫలితాన్ని ఈసారీ పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో శనివారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లో భారత జట్టు బరిలోకి దిగనుంది. గ్రూప్ ‘సి’లో ఇండోనేసియా, థాయ్‌లాండ్, ఇంగ్లండ్‌లతో కలిసి భారత్ పోటీపడనుంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్ ‘ఢీ’ కొంటుంది. మహిళల టీమ్ ఈవెంట్ అయిన ఉబెర్ కప్‌లో భారత జట్టు ద్వితీయ శ్రేణి క్రీడాకారిణులతో బరిలోకి దిగనుంది.సింధు, అశ్విని పొన్నప్ప, తనీషా, గాయత్రి, ట్రెసా ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. గ్రూప్ ‘ఎ’లో కెనడా, చైనా, సింగపూర్‌లతో కలిసి భారత్ ఉంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో కెనడాతో భారత్ ఆడుతుంది. -
ప్రియాన్షు సంచలనం.. ప్రపంచ 12వ ర్యాంకర్‌పై విజయం
న్యూఢిల్లీ: ఓర్లియాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువతార ప్రియాన్షు రజావత్ సంచలనం సృష్టించాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రియాన్షు ప్రపంచ 12వ ర్యాంకర్, టాప్ సీడ్ కెంటా నిషిమోటో (జపాన్)పై గెలుపొందాడు. గతవారం స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన నిషిమోటోతో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 58వ ర్యాంకర్ ప్రియాన్షు 21–8, 21–16తో గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. థామస్ కప్ టైటిల్ సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ప్రియాన్షు ఈ మ్యాచ్ తొలి గేమ్‌లో 10–0తో ఆధిక్యంలోకి వెళ్లడం విశేషం. రెండో గేమ్‌లో ప్రియాన్షుకు పోటీ ఎదురైనా కీలకదశలో పాయింట్లు గెలిచి 42 నిమిషాల్లో విజయాన్ని అందుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చి యు జెన్ (చైనీస్ తైపీ)తో ప్రియాన్షు తలపడతాడు. -
అన్నింటికంటే అదే గొప్ప విజయం.. ఇంకేం అవసరం లేదు!
దాదాపు ఐదేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో పెద్ద విజయం అందుకోలేకపోయిన భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తనకు ఎలాంటి విచారం లేదని వ్యాఖ్యానించాడు. ఒక దశలో లీ చోంగ్ వీ, లిన్ డాన్, చెన్ లాంగ్, అక్సెల్సన్‌లను ఓడించి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానానికి చేరాడు ప్రణయ్. కానీ.. ఈ కేరళ షట్లర్ ఇంతవరకు మాస్టర్స్ స్థాయి టోర్నీని గెలవలేకపోయాడు. అయితే తన కెరీర్లో థామస్ కప్ టైటిల్ గెలిచిన జట్టులో భాగం కావడమే గొప్ప క్షణమని, వ్యక్తిగత విజయాలు దక్కకపోయినా తాను బాధపడనని అతను అన్నాడు. కాగా 73 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్ కప్ పురుషుల టీమ్ టోర్నమెంట్లో ఈ ఏడాది తొలిసారి భారత్ చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్ సింగిల్స్‌లో, డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, గారగ కృష్ణప్రసాద్... తెలంగాణ ప్లేయర్ పంజాల విష్ణువర్ధన్ గౌడ్, కోచ్ సియాదతుల్లా ఈ చిరస్మరణీయ విజయంలో భాగమై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. గెలుపు వీరులు థామస్ కప్‌లో భారత్ తరఫున మొత్తం 10 మంది ప్రాతినిధ్యం వహించారు. సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (ఆంధ్రప్రదేశ్), లక్ష్య సేన్ (ఉత్తరాఖండ్), హెచ్ఎస్ ప్రణయ్ (కేరళ), ప్రియాన్షు రజావత్ (మధ్యప్రదేశ్) పోటీపడ్డారు. డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్)–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర)... పంజాల విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ)–గారగ కృష్ణప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)... ఎం.ఆర్.అర్జున్ (కేరళ)–ధ్రువ్ కపిల (పంజాబ్) జోడీలు బరిలోకి దిగాయి. చదవండి: Rishabh Pant: టి20 కెప్టెన్‌గా రిషబ్ పంత్ అరుదైన రికార్డు -
మీరంతా దేశం గర్వపడేలా చేశారు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కలిసి అభినందించారు. కప్ గెలిచిన అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన బాడ్మింటన్ టీంతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రధాని వారిపై ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి దేశాన్ని గర్వపడేలా చేశారంటూ కితాబిచ్చారు. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ ముఖాముఖీలో ప్రధాని ఆటగాళ్లందరితో సరదాగా మాట్లాడారు. సింగిల్స్, డబుల్స్ లో అద్భుతంగా రాణించిన భారత్ ఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ ఇండోనేషియాపై 3-0తో గ్రాండ్ విక్టరీ సాధించింది. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో తొలిసారి కప్ అందుకుంది. థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ జట్టుకు భారత ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి ప్రకటించింది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ భారత జట్టుకు కోటి రూపాయల నగదు బహుమతి నజరానాగా ప్రకటించన సంగతి తెలిసిందే. Interacted with our badminton champions, who shared their experiences from the Thomas Cup and Uber Cup. The players talked about different aspects of their game, life beyond badminton and more. India is proud of their accomplishments. https://t.co/sz1FrRTub8 — Narendra Modi (@narendramodi) May 22, 2022 -
Thomas Cup 2022: షటిల్ కింగ్స్
సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ప్రపంచ షటిల్ సామ్రాజ్యంలో మన జెండా ఎగిరింది. ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌గా పేరున్న థామస్ కప్‌లో ఒకప్పుడు మనం ప్రాతినిధ్యానికే పరిమితమయ్యాం. ఒకట్రెండుసార్లు మెరిపించినా ఏనాడూ పతకం అందుకోలేకపోయాం. కానీ ఈసారి అందరి అంచనాలను పటాపంచలు చేశాం. ఏకంగా విజేతగా అవతరించాం. క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ ఫైనల్లో 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాకు విశ్వరూపమే చూపించాం. క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో ఆఖరి మ్యాచ్‌లో ఫలితం తేలగా... టైటిల్ సమరంలో వరుసగా మూడు విజయాలతో ఇండోనేసియా కథను ముగించి మువ్వన్నెలు రెపరెపలాడించాం. భారత చరిత్రాత్మక విజయంలో తెలుగు తేజాలు కీలకపాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్ సింగిల్స్‌లో, డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, గారగ కృష్ణప్రసాద్... తెలంగాణ ప్లేయర్ పంజాల విష్ణువర్ధన్ గౌడ్, కోచ్ సియాదతుల్లా ఈ చిరస్మరణీయ విజయంలో భాగమయ్యారు. బ్యాంకాక్: ఇన్నాళ్లూ వ్యక్తిగత విజయాలతో మురిసిపోయిన భారత బ్యాడ్మింటన్ ఇప్పుడు టీమ్ ఈవెంట్లోనూ అదరగొట్టింది. 73 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్ కప్ పురుషుల టీమ్ టోర్నమెంట్లో తొలిసారి భారత్ చాంపియన్‌గా అవతరించింది. ప్రకాశ్ పడుకోన్, సయ్యద్ మోడీ, విమల్ కుమార్, పుల్లెల గోపీచంద్‌లాంటి స్టార్స్ గతంలో థామస్ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన వాళ్లే. కానీ ఏనాడూ వారు ట్రోఫీని ముద్దాడలేకపోయారు. ఎట్టకేలకు వీరందరి కలలు నిజమయ్యాయి. అసాధారణ ఆటతీరుతో ఈసారి భారత జట్టు థామస్ కప్ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 3–0తో 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాను చిత్తు చేసి థామస్ కప్‌ను సొంతం చేసుకుంది. ‘బెస్ట్ ఆఫ్ ఫైవ్’ పద్ధతిలో జరిగిన ఫైనల్లో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి ఇండోనేసియాకు షాక్ ఇచ్చింది. శుభారంభం... తొలిసారి థామస్ కప్ ఫైనల్ ఆడిన భారత్‌కు శుభారంభం లభించింది. ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆంథోనీ జిన్‌టింగ్‌తో జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 65 నిమిషాల్లో 8–21, 21–17, 21–16తో విజయం సాధించి భారత్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. తొలి గేమ్‌లో తడబడిన లక్ష్య సేన్ ఆ తర్వాత చెలరేగి ఆంథోనీ ఆట కట్టించాడు. డబుల్స్ విభాగంలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇండోనేసియా ప్రపంచ నంబర్‌వన్ కెవిన్ సంజయ సుకముల్యో, రెండో ర్యాంకర్ మొహమ్మద్ అహసాన్‌లను బరిలోకి దించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఆద్యంతం అద్భుత ఆటతీరుతో 73 నిమిషాల్లో 18–21, 23–21, 21–19తో సుకముల్యో–అహసాన్ జంటను బోల్తా కొట్టించి భారత్ ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్‌గా జరిగిన రెండో సింగిల్స్‌లో 2018 జకార్తా ఆసియా క్రీడల చాంపియన్ జొనాథాన్ క్రిస్టీతో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ తలపడ్డాడు. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–15, 23–21తో గెలుపొంది భారత్‌ను చాంపియన్‌గా నిలిపాడు. ఈ టోర్నీ ప్రారంభం నుంచి కళ్లు చెదిరే ఆటతో ఆకట్టుకుంటున్న శ్రీకాంత్ ఈ మ్యాచ్‌లోనూ దానిని కొనసాగించాడు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీతో ఈ ఏడాది ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ ఈసారి మాత్రం ఆరంభం నుంచే పైచేయి సాధించాడు. తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన శ్రీకాంత్ రెండో గేమ్‌లో ఒకదశలో 13–16తో వెనుకబడ్డాడు. కానీ వెంటనే తేరుకున్న ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ స్కోరును సమం చేశాడు. అనంతరం 20–21తో వెనుకబడ్డ దశలో మళ్లీ కోలుకొని వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయా న్ని ఖాయం చేసుకున్నాడు. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లను నిర్వహించలేదు. మనం గెలిచాం ఇలా... లీగ్ దశ: గ్రూప్ ‘సి’లో భారత జట్టు వరుసగా తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో జర్మనీపై 5–0తో... కెనడాపై 5–0తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. చివరి మ్యాచ్ లో భారత్ 2–3తో చైనీస్ తైపీ చేతిలో ఓడి గ్రూప్ ‘సి’లో రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్: ఐదుసార్లు చాంపియన్ మలేసియాపై భారత్ 3–2తో గెలిచింది. 1979 తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి ప్రవేశించి తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్: 2016 విజేత డెన్మార్క్‌పై భారత్ 3–2తో నెగ్గి ఈ టోర్నీ చరిత్రలో మొదటిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. గెలుపు వీరుల బృందం... థామస్ కప్‌లో భారత్ తరఫున మొత్తం 10 మంది ప్రాతినిధ్యం వహించారు. సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (ఆంధ్రప్రదేశ్), లక్ష్య సేన్ (ఉత్తరాఖండ్), హెచ్ఎస్ ప్రణయ్ (కేరళ), ప్రియాన్షు రజావత్ (మధ్యప్రదేశ్) పోటీపడ్డారు. డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్)–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర)... పంజాల విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ)–గారగ కృష్ణప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)... ఎం.ఆర్.అర్జున్ (కేరళ)–ధ్రువ్ కపిల (పంజాబ్) జోడీలు బరిలోకి దిగాయి. నా అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి. వ్యక్తిగత టోర్నీలతో పోలిస్తే టీమ్ ఈవెంట్లలో ఆడే అవకాశం తక్కువగా లభిస్తుంది. కాబట్టి ఇలాంటి పెద్ద ఘనతను అందుకోవడం నిజంగా గొప్ప ఘనతగా భావిస్తున్నా. మేం సాధించామని నమ్మేందుకు కూడా కొంత సమయం పట్టింది. జట్టులో ప్రతీ ఒక్కరు బాగా ఆడారు. ఏ ఒక్కరో కాకుండా పది మంది సాధించిన విజయమిది. టీమ్ విజయాల్లో ఉండే సంతృప్తే అది. –కిడాంబి శ్రీకాంత్ ‘అభినందనల జల్లు’ థామస్ కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారు. భారత్‌కు తిరిగి వచ్చాక తన ఇంటికి రావాలని ఆయన ఆహ్వానించారు. ‘భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. థామస్ కప్ గెలుపుపై దేశమంతా హర్షిస్తోంది. మన జట్టుకు అభినందనలు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలి. ఈ గెలుపు వర్ధమాన ఆటగాళ్లకు స్ఫూర్తినందిస్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా తొలిసారి థామస్ కప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు తెలియజేశారు. తొలిసారి థామస్ కప్ గెలవడం భారత బ్యాడ్మింటన్‌కు చారిత్రాత్మక క్షణం. విజయం సాధించే వరకు పట్టు వదలకుండా, ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కిడాంబి శ్రీకాంత్, భారత బృందానికి అభినందనలు. ప్రతిష్ట, సమష్టితత్వం కలగలిస్తేనే విజయం. చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్, చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్, ప్రణయ్‌లకు కూడా అభినందనలు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి ఈ గెలుపు గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు. మా ఆటగాళ్లపై కొంత ఆశలు ఉన్నా ఇంత గొప్పగా ఆడతారని ఊహించలేదు. భారత క్రికెట్‌కు 1983 ప్రపంచకప్ ఎలాంటిదో ఇప్పుడు బ్యాడ్మింటన్‌కు ఈ టోర్నీ విజయం అలాంటిది. –విమల్ కుమార్, భారత బ్యాడ్మింటన్ కోచ్ థామస్ కప్ విజయం చాలా పెద్దది. జనం దీని గురించి మున్ముందు చాలా కాలం మాట్లాడుకుంటారు. భారత బ్యాడ్మింటన్ గర్వపడే క్షణమిది. ఇకపై మన టీమ్ గురించి ప్రపంచం భిన్నంగా ఆలోచిస్తుంది. ఒకప్పుడు వ్యక్తిగత పతకాలు గెలవడం కలగా ఉండేది. ప్రిక్వార్టర్స్ చేరినా గొప్పగా అనిపించేది. ఇది వాటికి మించిన ఘనత. దానిని బట్టి చూస్తే ఈ టీమ్ ఎంత గొప్పగా ఆడిందో అర్థమవుతుంది. –పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ రూ. 2 కోట్ల నజరానా థామస్ కప్ గెలిచిన భారత జట్టుకు రూ. 2 కోట్లు నజరానా ప్రకటించారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి రూ. 1 కోటి, భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నుంచి రూ. 1 కోటి జట్టు సభ్యులకు ఇవ్వనున్నారు. -
Thomas Cup Final 2022 : బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన భారత్
-
థామస్ కప్ గెలిచిన భారత బృందానికి సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత బ్యాడ్మింటన్‌లో ఇదో చారిత్రక ఘట్టం అని అభివర్ణించారు. బ్యాడ్మింటన్‌లో 73 ఏళ్ల భారత కలను సాకారం చేసినందుకు గాను కిదాంబి శ్రీకాంత్ అండ్ టీమ్‌ను అభినందించారు. ఫైనల్లో జరిగిన కీలక మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన శ్రీకాంత్‌ను సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా తన సందేశాన్నిపంపారు. A historic moment for Indian Badminton as India brings home its first #ThomasCup! Congratulations to Srikanth Kidambi and team India for their spectacular win in the finals and their remarkable journey up to the last shot. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 15, 2022 కాగా, పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. టోర్నీ ఆసాంతం అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన భారత బృందం.. ఆదివారం జరిగిన ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేసియాను 3-0 తేడాతో మట్టికరిపించి థామస్ కప్ 2022 స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. తొలి సింగిల్స్‌లో లక్ష్య సేన్.. ఆంథోని జింటింగ్‌ను 21-8, 21-17, 21-16 తేడాతో ఓడించగా.. తరువాతి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం.. 18-21, 23-21, 21-19 తేడాతో మహ్మద్ ఎహసాన్, కెవిన్ సంజయ సుకముల్జియో జోడీని ఖంగుతినిపించి భారత ఆధిక్యాన్ని 2-0కు చేర్చింది. ఇక కీలకమైన మూడో మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ వీర లెవెల్లో రెచ్చిపోయి ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జోనాటన్ క్రిస్టీని 21-15, 23-21 తేడాతో మట్టికరిపించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించాడు. చదవండి: చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. 73 ఏళ్ల చరిత్రలో తొలిసారి..! -
భారత బ్యాడ్మింటన్ జట్టుకు భారీ నజరానా
బ్యాడ్మింటన్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. 73 ఏళ్ల తర్వాత థామస్ కప్ విజేతగా భారత్ నిలిచింది. థాయ్‌లాండ్ వేదికగా ఇండోనేషియాతో జరిగిన ఫైనల్లో 3-0 తేడాతో విజయం సాధించి తొలి సారి స్వర్ణాన్ని భారత్ ముద్దాడింది. సింగిల్స్‌లో లక్ష్య సేన్.. ఆంథోని జింటింగ్‌ను 21-8, 21-17, 21-16 తేడాతో ఓడించగా.. తరువాతి మ్యాచ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడి 18-21, 23-21, 21-19 తేడాతో మహ్మద్ ఎహసాన్, కెవిన్ సంజయ సుకముల్జియోపై విజయం సాధించారు. ఇక మూడో మ్యాచ్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ 21-15,23-21 వరుస సెట్లలో జొనాతన్ క్రిస్టీని ఓడించి 3-0 అధిక్యంతో థామస్ కప్‌ను కైవసం చేసుకునేలా చేశాడు. ఇక థామస్ కప్ గెలిచన భారత బ్యాడ్మింటన్ జట్టుకు ప్రభుత్వం రూ. కోటి నగదు బహుమతి ప్రకటించింది. ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. చదవండి: Thomas Cup 2022: చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. తొలిసారి థామస్ కప్ కైవసం -
థామస్ ఉబర్ కప్ లో చరిత్ర సృష్టించిన భారత్
-
చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. 73 ఏళ్ల చరిత్రలో తొలిసారి..!
బ్యాంకాక్: పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. టోర్నీ ఆసాంతం అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన భారత బృందం.. ఆదివారం జరిగిన ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేసియాను 3-0 తేడాతో మట్టికరిపించి థామస్ కప్ 2022 స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. తొలి సింగిల్స్‌లో లక్ష్య సేన్.. ఆంథోని జింటింగ్‌ను 21-8, 21-17, 21-16 తేడాతో ఓడించగా.. తరువాతి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం.. 18-21, 23-21, 21-19 తేడాతో మహ్మద్ ఎహసాన్, కెవిన్ సంజయ సుకముల్జియో జోడీని ఖంగుతినిపించి భారత ఆధిక్యాన్ని 2-0కు చేర్చింది. ఇక కీలకమైన మూడో మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ వీర లెవెల్లో రెచ్చిపోయి ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జోనాటన్ క్రిస్టీని 21-15, 23-21 తేడాతో మట్టికరిపించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించాడు. భారత బృందం ఫైనల్ చేరే క్రమంలో (నాకౌట్ దశలో) మలేసియా, డెన్మార్క్ లాంటి పటిష్టమైన జట్లను ఖంగుతినిపించిన విషయం తెలిసిందే. ఈ విజయం ఎంతో మందికి స్ఫూర్తి.. ప్రధాని మోదీ 73 ఏళ్ల కలను సాకారం చేసిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించిన భారత షట్లర్లకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌కు స్వర్ణ పతకం ఖాయం కాగానే మోదీ ట్వీట్ చేశారు. The Indian badminton team has scripted history! The entire nation is elated by India winning the Thomas Cup! Congratulations to our accomplished team and best wishes to them for their future endeavours. This win will motivate so many upcoming sportspersons. — Narendra Modi (@narendramodi) May 15, 2022 "భారత బ్యాడ్మింటన్ బృందం చరిత్ర సృష్టించింది. ఈ విజయం పట్ల యావత్ భారతం గర్వంతో ఉప్పొంగిపోతుంది. స్వర్ణం గెలిచిన భారత బృందానికి శుభాకాంక్షలు.. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. ఈ విజయం ఎంతో మంది భవిష్యత్తు క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది" అంటూ మోదీ ట్వీట్ ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు. -
Konaseema: ఆటే శ్వాస... సాధనే జీవితం.. ఫైనల్స్‌కు చేరిన భారత జట్టులో
సాక్షి, అమలాపురం: ‘మెరుపై సాగరా... ఆ గెలుపే నీదిరా... నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా... నిప్పులు చిందినా.. ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా’ అంటూ ఓ సినీ కవి రాసిన పాట ఈ యువకుని జీవితానికి అతికినట్టు సరిపోతోంది. పన్నెండేళ్ల ప్రాయంలోనే లక్ష్యాన్ని నిర్ణయించుకుని బంధాలకు.. అనుబంధాలకు దూరంగా ఉంటూ ఇష్టాలను వదులుకుని.. కష్టాల సాధనకు ఉపక్రమించాడు అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్. అప్పటి వరకూ ఆట విడుపుగా ఆడుతున్న షటిల్ బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలనే దృఢ నిశ్చయానికి వచ్చే నాటికి ఇతని వయస్సు పన్నెండేళ్లు. అప్పటి నుంచీ ఆటే శ్వాసగా.. సాధనే జీవితంగా బతుకుతున్నాడు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తున్నాడు. తక్కువ సమయంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. కఠోర సాధన గోపీచంద్ అకాడమీలో పన్నెండో ఏట నుంచే సాత్విక్ శిక్షణ పొందుతున్నాడు. 15వ ఏట తొలి అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్నాడు. అంతకుముందు అమలాపురం ఆఫీసర్స్ క్లబ్లో శిక్షణ పొందేవాడు. ఉదయం సాయంత్రం కలిపి మూడు విడతలుగా తొమ్మిది గంటల పాటు సాధన చేయాలి. వ్యాయామం, ఆటలో మెళకులు నేర్చుకోవడం.. ఈ రెండూ ప్రధానమే. టోర్నీలు లేకున్నా రోజువారీ సాధనలో మార్పులుండవు. టోర్నీలు లేవని విశ్రాంతి తీసుకోవడం కుదరదు. యంత్రంలా సాధన చేయడమే. ఇంటికి వచ్చేది కూడా మూడు నాలుగు నెలలకు ఒకసారి మాత్రమే. ఉండేది రెండు మూడు రోజులే. ఇష్టానుసారం తినే అవకాశం లేదు. ప్రొటీన్ల కోసం చికెన్, ఎగ్ వంటివి తప్పవు. బిర్యానీలు.. పీజాలు.. బర్గర్లకు దూరం. స్వీట్లు.. కూల్‌డ్రింక్‌లు దరిదాపులకు రానివ్వకూడదు. చదవండి: (సైమండ్స్‌కు ఐసీసీ నివాళి.. పాకిస్తాన్‌పై 143 నాటౌట్ వీడియో ట్వీట్) ఒలింపిక్స్ పతకం జేజారినా? గెలుపోటములను సమానంగా స్వీకరించడం గొప్ప విజయమే. క్రికెట్ మినహా మిగిలిన క్రీడాకారుల లక్ష్యం ఒలింపిక్స్‌లో పతక సాధన. గత ఏడాది జపాన్‌లో జరిగిన ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో సహచరుడు చిరాగ్ శెట్టితో కలిసి సాత్విక్ మూడు మ్యాచ్‌లకు గాను, రెండు మ్యాచ్‌లు గెలిచినా పాయింట్లు తక్కువ కావడంతో క్వార్టర్స్‌కు వెళ్లే అవకాశం కోల్పోయారు. లేకుంటే ఒలింపిక్స్‌లో సాయిరాజ్ సాత్విక్ జంట ఏదో పతకాన్ని సాధించేది. జీవితాశయమైన ఒలింపిక్ పతకం త్రుటిలో చేజారినా సాత్విక్ కుంగిపోలేదు. ఆ ఓటమి నుంచి వెంటనే కోలుకున్నాడు. ఆటపై దృష్టి పెట్టి ముమ్మర సాధన చేస్తున్నాడు. చదవండి: (Andrew Symonds: ఆండ్రూ సైమండ్స్ మృతి.. దిగ్గజ క్రికెటర్ల సంతాపం) ►ఒలింపిక్స్ తరువాత ఫ్రాన్స్‌లో జరిగిన సూపర్ –750లో ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఇండియన్ ఓపెన్–500 విజేతగా నిలవడం, అది కూడా గతంలో మూడుసార్లు విజేతగా నిలిచిన జట్టుపై గెలవడం ద్వారా అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో సాత్విక్ మరోసారి మెరిశాడు. ►ఒలింపిక్స్‌కు ముందు సాత్విక్ కామన్వెల్త్ క్రీడా పోటీల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించాడు. 2021లో అర్జున్ అవార్డు అందుకున్నాడు. ►బ్యాడ్మింటన్ క్రీడలో థామస్ కప్ కీలకమైంది. అటువంటి మెగా టోర్నీలో భారత జట్టు తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. ఈ జట్టులో సాత్విక్, చిరాగ్‌శెట్టి జోడీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో 1979లో మాత్రమే భారత్ జట్టు సెమీస్ చేరింది. ఈసారి జట్టు ఫైనల్స్‌కు చేరడం, అందులో సాత్విక్ కీలక పాత్ర పోషించడం విశేషం. టీవీలో చూడటమే ఎక్కువ షటిల్ బ్యాడ్మింటన్‌కు వెళ్లిన తరువాత సాత్విక్‌ను చాలా మిస్సవుతున్నాను. వాడిని దగ్గర నుంచి చూసిన దానికన్నా వాడి ఆటను టీవీలో చూడటమే ఎక్కువ. దూరంగా ఉంటున్నా వాడు సాధిస్తున్న విజయాలు అన్నింటినీ మరిచిపోయేలా చేస్తోంది. థామస్ కప్‌ను భారత్ జట్టు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. – రంకిరెడ్డి రంగమణి, సాత్విక్ తల్లి, అమలాపురం కొన్ని కావాలంటేకొన్ని వదులుకోవాలి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలంటారు. నేను అంతర్జాతీయ క్రీడాకారుడిని కావడానికి చాలా వదులుకోవాల్సి వచ్చింది. సాధిస్తున్న విజయాల వల్ల చాలా సంతోషాలకు దూరమయ్యానని బాధ లేదు. కుటుంబంతో గడిపేది తక్కువే అయినా నాన్న, అమ్మ, అన్న, స్నేహితులతో గడిపే క్షణాలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటూనే ఉంటాను. – సాత్విక్ సాయిరాజ్ -
సాయిప్రణీత్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: థామస్ కప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో భారత స్టార్ షట్లర్ సాయిప్రణీత్ విఫలమయ్యాడు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ట్రయల్స్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ 2ఎ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచాడు. నలుగురు చొప్పున ఉన్న నాలుగు గ్రూప్‌ల నుంచి ‘టాప్’లో నిలిచిన నలుగురే తదుపరి ట్రయల్స్ దశకు అర్హత పొందుతారు. 2ఎ గ్రూప్‌లో కిరణ్ జార్జి (కేరళ) అగ్రస్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందగా... సాయిప్రణీత్ రెండో స్థానంలో నిలిచాడు. కిరణ్ జార్జితో జరిగిన కీలక మ్యాచ్‌లో ప్రపంచ 19వ ర్యాంకర్, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ 21–23, 21–11, 16–21తో ఓడిపోయాడు. ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా సింగిల్స్ కోసం లక్ష్య సేన్, శ్రీకాంత్... ఇటీవల కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ప్రణయ్‌ను ‘బాయ్’ నేరుగా భారత జట్టులోకి ఎంపిక చేసింది. మిగిలిన ఒక బెర్త్ కోసం కిరణ్ జార్జి, రవి, సమీర్ వర్మ, ప్రియాన్షు తలపడతారు. -
19 ఏళ్ల నిరీక్షణకు తెర...
అర్హుస్ (డెన్మార్క్): థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో 19 ఏళ్ల తర్వాత ఇండోనేసియా జట్టు మళ్లీ విజేతగా నిలిచింది. చైనా జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండోనేసియా 3–0తో గెలిచి 14వసారి థామస్ కప్‌ను సొంతం చేసుకుంది. చివరిసారి ఇండోనేసియా జట్టు 2002లో ఈ మెగా ఈవెంట్‌ను దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లో జిన్‌టింగ్ 18–21, 21–14, 21–16తో లు గ్వాంగ్ జును ఓడించాడు. రెండో మ్యాచ్‌లో అల్ఫియాన్–అర్దియాంతో జోడీ 21–12, 21–19తో హిజి టింగ్–జౌ హావో డాంగ్ జంటపై గెలిచింది. మూడో మ్యాచ్‌లో జొనాథన్ క్రిస్టీ 21–14, 18–21, 21–14తో లి ఫి షెంగ్‌పై నెగ్గి ఇండోనేసియాకు విజయాన్ని ఖరారు చేశాడు. మరోవైపు ఉబెర్ కప్ మహిళల టీమ్ చాంపియన్íÙప్ ఫైనల్లో చైనా 3–1తో జపాన్ను ఓడించి 15వసారి చాంపియన్‌గా నిలిచింది. -
Uber Cup: 11 ఏళ్ల తర్వాత క్వార్టర్ ఫైనల్స్‌కు
అర్హుస్ (డెన్మార్క్): థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో 11 ఏళ్ల తర్వాత భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. తాహితి జట్టుతో జరిగిన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో ఘనవిజయం సాధించింది. వరుసగా రెండో గెలుపుతో ఈ టోర్నీలో 2010 తర్వాత భారత్‌కు నాకౌట్ బెర్త్ ఖరారైంది. ఇదే గ్రూప్ నుంచి చైనా కూడా క్వార్టర్స్‌కు చేరింది. నేడు భారత్, చైనా మధ్య జరిగే మ్యాచ్ విజేత గ్రూప్ టాపర్‌గా నిలుస్తుంది. తాహితి జట్టుతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో సాయిప్రణీత్ 21–5, 21–6తో లూయిస్ బిబోయిస్‌ను ఓడించాడు. రెండో మ్యాచ్‌లో సమీర్ వర్మ 21–12, 21–12తో రెమి రోస్‌పై, మూడో మ్యాచ్‌లో కిరణ్ జార్జి 21–4, 21–2తో మౌబ్లాంక్‌పై గెలవడంతో భారత్ 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తర్వాత రెండు డబుల్స్ మ్యాచ్‌ల్లో కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్; సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీలు తమ ప్రత్యర్థి జంటలపై గెలుపొందాయి. మరోవైపు ఉబెర్ కప్‌లో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో 0–5తో థాయ్‌లాండ్ జట్టు చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో జపాన్‌తో భారత్ ఆడనుంది. -
స్పెయిన్‌తో మహిళలు... నెదర్లాండ్స్‌తో పురుషులు...
అర్హస్ (డెన్మార్క్): ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. థామస్ కప్‌లో పురుషుల జట్టు... ఉబెర్ కప్‌లో మహిళల జట్టు మెరుగైన ప్రదర్శన చేసేందుకు సిద్ధమయ్యాయి. నేడు జరిగే తమ ఆరంభ పోటీల్లో గూప్ ‘సి’లో ఉన్న భారత పురుషుల టీమ్ నెదర్లాండ్స్‌తో... గ్రూప్ ’బి’లో ఉన్న మహిళల జట్టు స్పెయిన్‌తో తలపడనున్నాయి. కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టిలతో కూడిన భారత పురుషుల టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. గ్రూప్ ‘సి’లో పటిష్ట చైనా ఉన్నప్పటికీ... నెదర్లాండ్స్, తాహిటిలపై గెలవడం భారత్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు. పురుషుల, మహిళల విభాగాల్లో 16 జట్ల చొప్పున పోటీలో ఉండగా... వీటిని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లోనూ టాప్–2లో నిలిచిన రెండు జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. మహిళల టోర్నీ ఉబెర్ కప్‌లో భారత్ గ్రూప్ ‘బి’లో ఉంది. థాయ్‌లాండ్, స్పెయిన్, స్కాట్లాండ్ ప్రత్యర్థులు. రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఈ టోర్నీకి దూరమవ్వడం మహిళల జట్టుకు ప్రతికూల అంశం. సైనా నెహ్వాల్, గాయత్రి గోపిచంద్, డబుల్స్ జోడి అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డిల ఆటతీరుపైనే మహిళల జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఉబెర్ కప్‌లో భారత మహిళల జట్టు 2014, 2016లో సెమీస్ చేరింది. గతేడాది మేలో జరగాల్సిన ఈ టోర్నీ కరోనాతో వాయిదా పడింది. -
భారత జట్లకు సులువైన డ్రా
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్ టోర్నీ థామస్, ఉబెర్ కప్‌లలో భారత జట్లకు సులువైన డ్రా ఎదురైంది. డెన్మార్క్‌లోని అర్హస్‌లో అక్టోబర్ 9 నుంచి 17 వరకు ఈ టోర్నీలు జరుగనున్నాయి. పురుషుల టోర్నీ థామస్ కప్‌లో భారత జట్టు గ్రూప్‘సి’లో డిఫెండింగ్ చైనా, నెదర్లాండ్స్, తాహిటిలతో తలపడనుంది. ఈ గ్రూప్‌లో చైనా మింగుడుపడని ప్రత్యర్థి అయినప్పటికీ మిగతా జట్టు నెదర్లాండ్, తాహిటిలపై గెలవడం ద్వారా నాకౌట్‌కు అర్హత సంపాదించవచ్చు. మహిళల టోర్నీ ఉబెర్ కప్‌లో భారత్ గ్రూప్ ‘బి’లో ఉంది. థాయ్‌లాండ్, స్పెయిన్, స్కాట్లాండ్ ప్రత్యర్థులు కాగా, ఇందులో ముందంజ వేయడం అంత కష్టమైన పనే కాదు. ఉబెర్ కప్‌లో భారత మహిళల జట్టు 2014, 2016లో సెమీస్ చేరింది. గతేడాది మేలో జరగాల్సిన ఈ టోర్నీ కరోనాతో వాయిదా పడింది. -
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం నందు నటేకర్ కన్నుమూత
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం నందు నటేకర్(88) బుధవారం ఉదయం కన్నుమూశారు. 1950-60 మధ్య కాలంలో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ నుంచి సూపర్‌స్టార్‌గా వెలుగొందారు.తన కెరీర్లో 100కు పైగా జాతీయ, అంతర్జాతీయ టైటిల్స్ అందుకున్న నటేకర్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నెంబర్ 3గా కొంతకాలం కొనసాగారు. నటేకర్ బరిలోకి దిగితే కోర్టులో వీరోచితంగా పోరాడి విజయాలు సాధించేవారు. ఆయన మృతి పట్ల దేశ ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి నివాళి అర్పించారు. ఇక బ్యాడ్మింటన్ విభాగంలో నందు నటేకర్ మైలురాళ్లను పరిశీలిస్తే.. ►1956లో ఇంటర్నేషనల్ మలేషియాలో సెల్లంజర్ ఇంటర్నేషనల్ లో టోర్నమెంట్లో విజయం ►1954లో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిక. ►థామస్ కప్‌లో 16 సింగిల్స్ మ్యాచ్‌లో 12 విజయాలు.. అలాగే టీమ్ తరపున 16 డబుల్స్ మ్యాచ్‌ల్లో 8 విజయాలు ►బ్యాడ్మింటన్ లో నందు సాధించిన విజయాలకు కేంద్ర ప్రభుత్వం 1961లో అర్జున అవార్డును ప్రధానం చేసింది. ►1965లో జమైకాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. -
టాప్ షట్లర్లకు లీగ్ నిర్వహించాలి
న్యూఢిల్లీ : త్వరలోనే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పునరుద్ధరణ కానుందనే వాస్తవాన్ని మన షట్లర్లు అంగీకరించాల్సిందేనని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. ఇప్పటికీ ప్రాక్టీస్ ప్రారంభించడంలో మన క్రీడాకారులు వెనుకబడ్డారని... కలిసి ప్రాక్టీస్ చేయడానికి ఆటగాళ్లు ఇంకా సంకోచిస్తున్నారన్నాడు. ఇటీవల ‘సాయ్’ క్వారంటైన్ నిబంధనల ప్రకారం ప్రాక్టీస్ చేసేందుకు భారత షట్లర్లు తిరస్కరించడంతో హైదరాబాద్‌లో జరగాల్సిన ‘థామస్ కప్–ఉబెర్ కప్’ జాతీయ శిక్షణా శిబిరాన్ని కూడా రద్దు చేయాల్సి వచ్చింది. ‘అతి త్వరలో అంతర్జాతీయ టోర్నీలు జరుగుతాయనే విషయాన్ని మన ఆటగాళ్లు ఇంకా గుర్తించడం లేదు. కరోనా గురించే ఆలోచిస్తూ కలిసి ప్రాక్టీస్ చేసేందుకు ఇంకా సంకోచిస్తున్నారు. ప్రాక్టీస్ అంశంలో ఆటగాళ్ల తరఫు నుంచే ఇబ్బందులు ఎదురవుతున్నాయి’ అని గోపీచంద్ చెప్పాడు. టాప్ షట్లర్లు లయ కోల్పోకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వారికి ఒక లీగ్ నిర్వహించాలని గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. ‘ప్రపంచవ్యాప్తంగా క్రీడలు ప్రారంభమయ్యాయి. దీనర్థం మనం కూడా వారితో సమానంగా క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనాలి. లేదంటే రేసులో వెనకబడతాం. గతం తరహా పరిస్థితులు ఇప్పుడు ఉండబోవు. దీన్ని అర్థం చేసుకొని అలవాటు పడాలి. దేశంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లను ఎంపిక చేసి వారికో లీగ్ నిర్వహించాలి. ఇలా చేస్తే అంతర్జాతీయ ఆటగాళ్లతో సమానంగా మనవాళ్లు సన్నద్ధంగా ఉంటారు’ అని 46 ఏళ్ల గోపీచంద్ వివరించాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల కంటే జూనియర్ స్థాయి క్రీడాకారుల గురించే తాను ఆందోళన చెందుతున్నట్లు చెప్పాడు. ఎదిగే దశలో ఈ విరామం వారికి చేటు చేస్తుందని అన్నాడు. -
వచ్చే ఏడాదికి వాయిదా!
కౌలాలంపూర్: ప్రతిష్టాత్మక థామస్ కప్–ఉబెర్ కప్ ఫైనల్స్ టోర్నీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కరోనా కారణంగా అగ్రశ్రేణి జట్లు తప్పుకోవడంతో టోర్నీ కళ తప్పుతోందంటూ స్పాన్సర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డెన్మార్క్‌లోని అర్హస్ వేదికగా అక్టోబర్ 3 నుంచి 11 వరకు జరగాల్సిన ఈ టోర్నీని వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ ముగిశాక టోక్యోలో నిర్వహిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. శనివారం వర్చువల్‌గా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య సమావేశంలో ఎక్కువ మంది వాయిదాకే మొగ్గుచూపినట్లు తెలిసింది. -
‘ఇప్పుడు ఈ టోర్నీలు అవసరమా’
న్యూఢిల్లీ: కరోనా తీవ్రత ఇంకా తగ్గని ప్రస్తుత స్థితిలో ప్రతిష్టాత్మక ‘థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్’ టోర్నీ నిర్వహణపై భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తి కొనసాగుతోన్న ఈ సమయంలో టోర్నీ నిర్వహణ సురక్షితమేనా అని ఆమె ప్రశ్నించింది. ‘మహమ్మారికి భయపడి ఏడు దేశాలు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ సమయంలో టోర్నీ నిర్వహించడం సబబేనా?’ అని సైనా ట్వీట్ చేసింది. డెన్మార్క్‌లో అక్టోబర్ 3నుంచి 11వరకు థామస్, ఉబెర్ కప్ జరుగనుంది. మార్చిలో ఆగిపోయిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు మళ్లీ ఈ టోర్నీతోనే ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోన్న ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆటగాళ్లకు క్వారంటీన్ వెసులుబాటు కూడా కల్పించింది. టోర్నీ కోసం డెన్మార్క్ చేరుకునే ఆటగాళ్లు ‘నెగెటివ్’గా తేలితే తప్పనిసరిగా క్వారంటీన్లో ఉండాల్సిన అవసరం లేదని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను ‘బాయ్’ ప్రకటించింది. -
ఇండోనేసియా, కొరియా అవుట్
జకార్తా: ప్రతిష్టాత్మక థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి వైదొలుగుతున్న జట్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. కరోనా భయంతో ఇప్పటికే థాయ్‌లాండ్, తైవాన్, ఆస్ట్రేలియా జట్లు ఈ టోర్నీ నుంచి వైదొలగగా... తాజాగా వాటి సరసన ఇండోనేసియా, దక్షిణ కొరియా జట్లు కూడా చేరాయి. టోర్నీలో పాల్గొంటే తమ ఆటగాళ్లు కరోనా బారిన పడే అవకాశం ఉందని... అందుకే తాము టోర్నీకి దూరంగా ఉంటున్నట్లు ఇండోనేసియా బ్యాడ్మింటన్ సంఘం (పీబీఎస్ఐ) తెలిపింది. డెన్మార్క్‌లోని అర్హస్ వేదికగా అక్టోబర్ 3 నుంచి 11 వరకు ఈ టోర్నీ జరగాల్సి ఉంది. ఇండోనేసియా థామస్ కప్ (పురుషుల విభాగంలో)ను రికార్డు స్థాయిలో 13 సార్లు గెలుచుకోగా... ఉబెర్ కప్ (మహిళల విభాగంలో)ను 3 సార్లు కైవసం చేసుకుంది. ఈ టోర్నీతో పాటు అక్టోబర్‌లోనే జరిగే డెన్మార్క్ ఓపెన్, డెన్మార్క్ మాస్టర్స్ టోర్నీల్లో కూడా తమ ప్లేయర్లు పాల్గొనడం లేదని ఇండోనేసియా పేర్కొంది. -
థామస్ కప్–ఉబెర్ కప్ టోర్నీ మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మళ్లీ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ మెగా ఈవెంట్ డెన్మార్క్ వేదికగా మే 16 నుంచి 24 వరకు జరగాల్సింది. అయి తే కరోనా మహమ్మారి కారణంగా మేలో జరగాల్సిన టోర్నీని వాయిదా వేసి... ఆగస్టు 15 నుంచి 23 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికీ కరోనా వైరస్ నియంత్రణలోకి రాకపోవడం... ఆగస్టు చివరి వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ గుమిగూడవద్దని డెన్మార్క్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తమ నిర్ణయాన్ని మార్చుకుంది. ఆగస్టులో బదులుగా థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీ కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 11 వరకు జరుగుతుందని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. పురుషుల, మహిళల విభాగాల్లో 16 మేటి జట్ల చొప్పున పాల్గొనే ఈ టోర్నీలో రెండు విభాగాల్లోనూ భారత జట్లు అర్హత సాధించాయి.