జకార్తా: ప్రతిష్టాత్మక థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి వైదొలుగుతున్న జట్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. కరోనా భయంతో ఇప్పటికే థాయ్‌లాండ్, తైవాన్, ఆస్ట్రేలియా జట్లు ఈ టోర్నీ నుంచి వైదొలగగా... తాజాగా వాటి సరసన ఇండోనేసియా, దక్షిణ కొరియా జట్లు కూడా చేరాయి. టోర్నీలో పాల్గొంటే తమ ఆటగాళ్లు కరోనా బారిన పడే అవకాశం ఉందని... అందుకే తాము టోర్నీకి దూరంగా ఉంటున్నట్లు ఇండోనేసియా బ్యాడ్మింటన్ సంఘం (పీబీఎస్‌ఐ) తెలిపింది. డెన్మార్క్‌లోని అర్హస్ వేదికగా అక్టోబర్ 3 నుంచి 11 వరకు ఈ టోర్నీ జరగాల్సి ఉంది. ఇండోనేసియా థామస్ కప్ (పురుషుల విభాగంలో)ను రికార్డు స్థాయిలో 13 సార్లు గెలుచుకోగా... ఉబెర్ కప్ (మహిళల విభాగంలో)ను 3 సార్లు కైవసం చేసుకుంది. ఈ టోర్నీతో పాటు అక్టోబర్‌లోనే జరిగే డెన్మార్క్ ఓపెన్, డెన్మార్క్ మాస్టర్స్ టోర్నీల్లో కూడా తమ ప్లేయర్లు పాల్గొనడం లేదని ఇండోనేసియా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment