తొలి లక్ష్యం... క్వార్టర్స్! | Saina Nehwal, Parupalli Kashyap lead India's challenge in ...Thomas Cup | Sakshi
Sakshi News home page

తొలి లక్ష్యం... క్వార్టర్స్!

Published Sun, May 18 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 7:28 AM

తొలి లక్ష్యం... క్వార్టర్స్!

తొలి లక్ష్యం... క్వార్టర్స్!

 నేటి నుంచి థామస్ కప్, ఉబెర్ కప్
 ఆశల పల్లకిలో భారత జట్లు
 మరోసారి ఫేవరెట్స్ చైనా
 
 న్యూఢిల్లీ: సొంతగడ్డపై తొలిసారి ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. థామస్ కప్ కోసం పురుషుల జట్లు... ఉబెర్ కప్ కోసం మహిళల జట్లు పోటీపడనున్నాయి. ఆదివారం మొదలయ్యే ఈ టోర్నమెంట్ ఈనెల 25న ముగుస్తుంది. ఈ మెగా ఈవెంట్‌కు మొదటిసారి ఆతిథ్యమిస్తోన్న భారత్ కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడమే తొలి లక్ష్యంగా నిర్ణయించుకుంది.
 
 టీమ్ ఫార్మాట్‌లో జరిగే ఈ పోటీల్లో రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో మూడు సింగిల్స్, రెండు డబుల్స్ మ్యాచ్‌లు ఉంటాయి.
 
 సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, గురుసాయిదత్ ప్రదర్శనపై భారత్ ఆశలు పెట్టుకుంది. తొలి రెండు సింగిల్స్‌లలో శ్రీకాంత్, కశ్యప్ ఆడటం ఖాయం. మూడో సింగిల్స్‌లో గురుసాయిదత్, సౌరభ్ వర్మ, సాయిప్రణీత్‌లలో ఒకరు బరిలోకి దిగవచ్చు.
 
 మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, సింధు తొలి రెండు సింగిల్స్‌లలో ఆడతారు. మూడో సింగిల్స్‌లో పి.సి.తులసీ, సయాలీ గోఖలే, తన్వీ లాడ్‌లలో ఒకరు ఆడతారు. డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప రాణిస్తే భారత్‌కు క్వార్టర్ ఫైనల్ అవకాశాలు మెండుగా ఉంటాయి.
 
 థామస్ కప్‌లో గ్రూప్ ‘సి’లో భారత్‌తోపాటు మలేసియా, కొరియా, జర్మనీ జట్లున్నాయి.
 ఉబెర్ కప్‌లో గ్రూప్ ‘సి’లో భారత్‌తోపాటు థాయ్‌లాండ్, కెనడా, హాంకాంగ్ జట్లకు స్థానం కల్పించారు.
 
 రెండేళ్లకోసారి జరిగే ఈ పోటీల్లో ఈసారి పురుషుల, మహిళల విభాగంలో 16 జట్లు చొప్పున బరిలో ఉన్నాయి. ఒక్కో గ్రూప్‌లో నాలుగేసి జట్లకు చోటు కల్పించారు. తొలుత లీగ్ దశ పోటీలు జరుగుతాయి. లీగ్ పోటీలు పూర్తయ్యాక ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్ల చొప్పున నాకౌట్ దశ (క్వార్టర్ ఫైనల్)కు అర్హత పొందుతాయి.
 
 
 65 ఏళ్ల చరిత్ర ఉన్న థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు రెండుసార్లు (2006, 2010)... 57 ఏళ్ల చరిత్ర కలిగిన ఉబెర్ కప్‌లో మహిళల జట్టు ఒకసారి (2010) క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాయి.
 
 థామస్ కప్‌లో ఇండోనేసియా అత్యధికంగా 13 సార్లు... చైనా 9 సార్లు విజేతగా నిలిచాయి. ఉబెర్ కప్‌లో చైనా అత్యధికంగా 12 సార్లు, జపాన్ 5 సార్లు టైటిల్స్ సాధించాయి. ఈసారి మాత్రం రెండు విభాగాల్లో చైనాయే ఫేవరెట్‌గా కనిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement