థామస్ కప్‌లో ఫైనల్స్‌కు చేరిన భారత్ జట్టులో సాయిరాజ్ సాత్విక్
సాక్షి, అమలాపురం: ‘మెరుపై సాగరా... ఆ గెలుపే నీదిరా... నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా... నిప్పులు చిందినా.. ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా’ అంటూ ఓ సినీ కవి రాసిన పాట ఈ యువకుని జీవితానికి అతికినట్టు సరిపోతోంది. పన్నెండేళ్ల ప్రాయంలోనే లక్ష్యాన్ని నిర్ణయించుకుని బంధాలకు.. అనుబంధాలకు దూరంగా ఉంటూ ఇష్టాలను వదులుకుని.. కష్టాల సాధనకు ఉపక్రమించాడు అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్. అప్పటి వరకూ ఆట విడుపుగా ఆడుతున్న షటిల్ బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలనే దృఢ నిశ్చయానికి వచ్చే నాటికి ఇతని వయస్సు పన్నెండేళ్లు. అప్పటి నుంచీ ఆటే శ్వాసగా.. సాధనే జీవితంగా బతుకుతున్నాడు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తున్నాడు. తక్కువ సమయంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు.
కఠోర సాధన
గోపీచంద్ అకాడమీలో పన్నెండో ఏట నుంచే సాత్విక్ శిక్షణ పొందుతున్నాడు. 15వ ఏట తొలి అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్నాడు. అంతకుముందు అమలాపురం ఆఫీసర్స్ క్లబ్‌లో శిక్షణ పొందేవాడు. ఉదయం సాయంత్రం కలిపి మూడు విడతలుగా తొమ్మిది గంటల పాటు సాధన చేయాలి. వ్యాయామం, ఆటలో మెళకులు నేర్చుకోవడం.. ఈ రెండూ ప్రధానమే. టోర్నీలు లేకున్నా రోజువారీ సాధనలో మార్పులుండవు. టోర్నీలు లేవని విశ్రాంతి తీసుకోవడం కుదరదు. యంత్రంలా సాధన చేయడమే. ఇంటికి వచ్చేది కూడా మూడు నాలుగు నెలలకు ఒకసారి మాత్రమే. ఉండేది రెండు మూడు రోజులే. ఇష్టానుసారం తినే అవకాశం లేదు. ప్రొటీన్ల కోసం చికెన్, ఎగ్ వంటివి తప్పవు. బిర్యానీలు.. పీజాలు.. బర్గర్లకు దూరం. స్వీట్లు.. కూల్‌డ్రింక్‌లు దరిదాపులకు రానివ్వకూడదు.
చదవండి: (సైమండ్స్‌కు ఐసీసీ నివాళి.. పాకిస్తాన్‌పై 143 నాటౌట్ వీడియో ట్వీట్)
ఒలింపిక్స్ పతకం జేజారినా?
గెలుపోటములను సమానంగా స్వీకరించడం గొప్ప విజయమే. క్రికెట్ మినహా మిగిలిన క్రీడాకారుల లక్ష్యం ఒలింపిక్స్‌లో పతక సాధన. గత ఏడాది జపాన్‌లో జరిగిన ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో సహచరుడు చిరాగ్ శెట్టితో కలిసి సాత్విక్ మూడు మ్యాచ్‌లకు గాను, రెండు మ్యాచ్‌లు గెలిచినా పాయింట్లు తక్కువ కావడంతో క్వార్టర్స్‌కు వెళ్లే అవకాశం కోల్పోయారు. లేకుంటే ఒలింపిక్స్‌లో సాయిరాజ్ సాత్విక్ జంట ఏదో పతకాన్ని సాధించేది. జీవితాశయమైన ఒలింపిక్ పతకం త్రుటిలో చేజారినా సాత్విక్ కుంగిపోలేదు. ఆ ఓటమి నుంచి వెంటనే కోలుకున్నాడు. ఆటపై దృష్టి పెట్టి ముమ్మర సాధన చేస్తున్నాడు.
చదవండి: (Andrew Symonds: ఆండ్రూ సైమండ్స్ మృతి.. దిగ్గజ క్రికెటర్ల సంతాపం)
►ఒలింపిక్స్ తరువాత ఫ్రాన్స్‌లో జరిగిన సూపర్ –750లో ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఇండియన్ ఓపెన్–500 విజేతగా నిలవడం, అది కూడా గతంలో మూడుసార్లు విజేతగా నిలిచిన జట్టుపై గెలవడం ద్వారా అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో సాత్విక్ మరోసారి మెరిశాడు.
►ఒలింపిక్స్‌కు ముందు సాత్విక్ కామన్వెల్త్ క్రీడా పోటీల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించాడు. 2021లో అర్జున్ అవార్డు అందుకున్నాడు.
►బ్యాడ్మింటన్ క్రీడలో థామస్ కప్ కీలకమైంది. అటువంటి మెగా టోర్నీలో భారత జట్టు తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. ఈ జట్టులో సాత్విక్, చిరాగ్‌శెట్టి జోడీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో 1979లో మాత్రమే భారత్ జట్టు సెమీస్ చేరింది. ఈసారి జట్టు ఫైనల్స్‌కు చేరడం, అందులో సాత్విక్ కీలక పాత్ర పోషించడం విశేషం.
టీవీలో చూడటమే ఎక్కువ
షటిల్ బ్యాడ్మింటన్‌కు వెళ్లిన తరువాత సాత్విక్‌ను చాలా మిస్సవుతున్నాను. వాడిని దగ్గర నుంచి చూసిన దానికన్నా వాడి ఆటను టీవీలో చూడటమే ఎక్కువ. దూరంగా ఉంటున్నా వాడు సాధిస్తున్న విజయాలు అన్నింటినీ మరిచిపోయేలా చేస్తోంది. థామస్ కప్‌ను భారత్ జట్టు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
– రంకిరెడ్డి రంగమణి, సాత్విక్ తల్లి, అమలాపురం
కొన్ని కావాలంటేకొన్ని వదులుకోవాలి
కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలంటారు. నేను అంతర్జాతీయ క్రీడాకారుడిని కావడానికి చాలా వదులుకోవాల్సి వచ్చింది. సాధిస్తున్న విజయాల వల్ల చాలా సంతోషాలకు దూరమయ్యానని బాధ లేదు. కుటుంబంతో గడిపేది తక్కువే అయినా నాన్న, అమ్మ, అన్న, స్నేహితులతో గడిపే క్షణాలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటూనే
ఉంటాను.
– సాత్విక్ సాయిరాజ్
Comments
Please login to add a commentAdd a comment