రాజోలు: అగ్నిమాపకశాఖలో ఫైర్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న భైరిశెట్టి బాలకృష్ణ(62)కు పదవీ విరమణకు ఒక రోజు ముందు గుండెపోటుతో రావడంతో గురువారం మృతి చెందారు. ఒక రోజు డ్యూటీ చేస్తే చాలని ఆ తర్వాత పూర్తిగా విశ్రాంతి జీవితం గడుపుదామని అనుకునే క్షణాల్లోనే గుండెపోటు ఆయనను శాశ్వత నిద్రలోకి నెట్టేసింది. రాజోలు గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న ఆయన ముమ్మిడివరం అగ్నిమాపక కేంద్రానికి విధులు నిర్వర్తించేందుకు మోటార్ సైకిల్‌పై బయలుదేరారు. ఇంటికి కూతవేటు దూరం వెళ్లేసరికి పంచాయతీ రోడ్డులో ఛాతి బరువెక్కి తీవ్రమైన గుండె నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో స్థానికులు ఆయనను రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
రాజోలులో లీడింగ్ ఫైర్‌మన్‌గా విధులు నిర్వహిస్తూ మూడు నెలల క్రితం పదోన్నతిపై ముమ్మిడివరం ఫైర్ ఆఫీసర్‌గా బదిలీపై వెళ్లారు. వివిధ హోదాల్లో సుమారు 22 ఏళ్ల పాటు ఆయన రాజోలు అగ్నిమాపక కేంద్రంలో పని చేశారు. ఈ నెల 28న ఫైర్‌ఆఫీసర్‌గా పదవీ విరమణ చేయనున్నారు. ఆయన అన్న కుమారుడు భైరిశెట్టి రాధాకృష్ణమూర్తి ఫిర్యాదు మేరకు రాజోలు ఎస్సై రాజేష్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టమ్ అనంతరం బాలకృష్ణ మృతదేహాన్ని స్వగ్రామం మామిడికుదురు మండలం కంచివారిపాలానికి తరలించారు. ఆయన మృతి పట్ల రాజోలు అగ్నిమాపక సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.
డ్రైవర్ అక్రమ సస్పెన్షన్‌పై కొనసాగుతున్న దీక్షలు
అమలాపురం రూరల్: అమలాపురం ఆర్టీసీ డిపోలో డ్రైవర్ బీఎస్ నారాయణ అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. డ్రైవర్ నారాయణ సస్పెన్షన్ ఎత్తివేయాలని, 1/19 సర్క్యులర్ కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళ ఉద్యోగులు గురువారం రిలే దీక్షలు నిర్వహించారు. యునైటెడ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి వి. గణపతి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లా యాజమాన్యం, డిపో యాజ మాన్యం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, నారాయణపై విధించిన అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ వర్కర్ యూనియన్ డిపో కార్యదర్శి కె.రవికుమార్, ఎన్‌ఎంయూ జిల్లా కార్యదర్శి గణపతి మద్దతు తెలిపారు.
పీఠంలో లింగోద్భవ పూజలు
రాయవరం: మండలంలోని వెదరుపాక విజయదుర్గా పీఠంలో బుధవారం అర్ధరాత్రి లింగోద్భవ పూజలు ఘనంగా నిర్వహించారు. పీఠంలోని విజయదుర్గా అమ్మవారి సన్నిధిలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ పూజలు నిర్వహించారు. పీఠంలో ఉన్న ఎనిమిది ఈశ్వర బాణాలకు రాత్రి 11గంటల నుంచి శివుడు లింగరూపంలో ఉద్భవించిన సమయం వరకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, అభిషేకం, అర్చనలు తదితర పూజలు నిర్వహించారు. వేద పండితులు చీమలకొండ వీరావధాని, శ్రీనివాసావధానులు, తోలేటి నాగేంద్రశర్మ, చక్రవర్తుల మాధవాచార్యులు తదితర 18 మంది వేద పండితులు ఈ పూజలను నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి లింగోద్భవ పూజలను వీక్షించారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. రాయవరం పార్వతీ సమేత రాజేశ్వరస్వామి, అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి, సోమేశ్వరంలోని శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత సోమేశ్వరస్వామి, చెల్లూరులోని అగస్తేశ్వరస్వామి, వెంటూరులోని ఉమా సమేత సోమేశ్వరస్వామి, వెదురుపాక పార్వతీ సమేత సోమేశ్వరస్వామి, మాచవరంలో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, పసలపూడిలో రాజరాజేశ్వరస్వామి ఆలయాల్లో లింగోద్భవ పూజలు భక్తుల శివనామస్మరణ నడుమ పురోహితులు నిర్వహించారు.

పదవీ విరమణకు ఒక్క రోజు ముందు ఆగిన గుండె
Comments
Please login to add a commentAdd a comment