జేఎన్టీయూ కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు
పులివెందుల రూరల్ : పులివెందులలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడేషన్ (ఎన్బీఏ)గా గుర్తింపు ఇస్తూ ఢిల్లీలోని ఎన్బీఏ మెంబర్ సెక్రటరీ డాక్టర్ అనిల్‌కుమార్ నాసా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు సోమవారం సాయంత్రం కళాశాలకు అందగా, మంగళవారం ప్రిన్సిపాల్ గోవిందరాజులు విలేకరులకు విషయాన్ని తెలిపారు.
గతేడాది నవంబర్ 28, 29, 30వ తేదీలలో ఎన్బీఏ బోర్డు చైర్మన్ అగర్వాల్ ఆధ్వర్యంలో 9 మంది కమిటీ సభ్యులు కళాశాలలోని మౌలిక వసతులపై అధ్యయనం చేశారు. కళాశాలను మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో ప్రారంభించారు. అనతికాలంలోనే ఎన్బీఏ గుర్తింపు రావడంపై పలువురు విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేశారు. కళాశాలలోని మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాలకు ఎన్బీఏ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపగా.. ఈ నాలుగు విభాగాలకు ఆమోదం లభించింది.
విద్యార్థులకు ఎంతో మేలు :
జేఎన్టీయూ కళాశాలకు నేషనల్ బోర్డు అక్రిడేషన్(ఎన్బీఏ) గుర్తింపు రావడం విద్యార్థులకు ఎంతో మేలు. కళాశాలకు ఎన్బీఏ గుర్తింపుతో ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉంది. మౌలిక వసతుల కోసం రూ.3 కోట్ల నుంచి 5 కోట్ల నిధులు విడుదలవుతాయి. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనుంది. బీటెక్ అనంతరం ప్రముఖ కంపెనీలలో ఉపాధి అవకాశాలకు ఎంతో దోహద పడుతుంది.
- గోవిందరాజులు
(కళాశాల ప్రిన్సిపాల్), పులివెందుల