‘ఉగ్ర’ నిరోధానికి నిబద్ధత ముఖ్యం: పద్మనాభయ్య
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి రాజకీయ నిబద్ధత చాలా ముఖ్యమని హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య అన్నారు. అది కొరవడటం వల్ల ఉగ్రవాద కార్యకలాపాలకు తగిన సహకారం అందడంలేదని పేర్కొన్నారు. రాజా బహదూర్ వెంకటరామారెడ్డి రాష్ర్ట పోలీసు అకాడమీ (ఆర్బీవీఆర్ఆర్ అప్పా), సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ సంయుక్తంగా నిర్వహించిన ‘ఉగ్రవాదంపై జాతీయ సదస్సు’లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఉగ్రవాద నిరోధం కోసం యాంటీ టైజం మాన్యువల్ రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర నిఘా వ్యవస్థలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య సమన్వయం కొరవడం కూడా ప్రధాన అవరోధంగా ఉన్నట్లు దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల ఘటన మరోసారి రుజువుచేసిందన్నారు.
1993లో మొదటిసారి ఆర్డీఎక్స్ పాకిస్థాన్ నుంచి సముద్రమార్గం ద్వారా దేశంలోకి తీసుకువచ్చారని, మెరైన్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ లోపాలు అప్పుడే బయటపడ్డాయని వివరించారు. ఇంటెలిజెన్స్ విభాగ పనితీరు మెరుగుపరుచుకోవడం, పోలీసు పని విధానంలో వేగాన్ని పెంపొందించుకోవడం ఉగ్రవాద నిరోధక చర్యల్లో ముఖ్యమైనవన్నారు. ఉగ్రవాద దాడులకు సంబంధించిన కేసుల విచారణలో తీవ్రమైన జాప్యం వల్ల కూడా నిందితులకు శిక్ష పడని పరిస్థితి నెలకొన్నదన్నారు. మాజీ డీజీపీ హెచ్‌జే దొర మాట్లాడుతూ ఉగ్రవాద నిరోధక చర్యలపై కూడా రాజకీయం చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. మూడురోజులపాటు జరిగే ఈ సదస్సులో పోలీసు, మిలటరీ, నౌక, విమానయాన విభాగాలకు చెందిన అధికారులు, స్వచ్చంద సంస్థల సభ్యులు, సోషల్ మీడియా గ్రూపు సభ్యులు పాల్గొంటున్నట్లు అప్పా డెరైక్టర్ ఎం.మాలకొండయ్య వెల్లడించారు. ప్రొఫెసర్ చంద్రశేఖరరావు, మాజీ డీజీపీలు స్వరణ్‌జిత్‌సేన్, ఎంవీ కృష్ణారావు, సెక్యూరిటీ స్టడీస్ డెరైక్టర్ కన్నెగంటి రమేష్‌బాబు ఈ సదస్సులో ప్రసంగించారు.