హైదరాబాద్ రాతను మారుస్తా!
సాక్షి, హైదరాబాద్: దశాబ్ద కాలం పాటు భారత జట్టు కెప్టెన్‌గా చిరస్మరణీయ విజయాలు అందించిన మొహమ్మద్ అజహరుద్దీన్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ క్రికెట్‌తో బంధం కలుపుకునేందుకు సిద్ధమయ్యారు. క్రికెట్ పరిపాలనపై ఆసక్తితో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో తొలిసారి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. హెచ్‌సీఏ ఎన్నికల బరిలోకి దిగిన అజహర్ మంగళవారం అధ్యక్ష పదవి కోసం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. మాజీ రంజీ క్రికెటర్ వంకా ప్రతాప్ తదితరులతో కలిసి ఆయన రిటర్నింగ్ అధికారి రాజీవ్‌రెడ్డికి సంబంధిత పత్రాలు అందజేశారు. హెచ్‌సీఏకు అనుబంధంగా ఉన్న ‘నేషనల్ క్రికెట్ క్లబ్’ తరఫున అజ్జూ నామినేషన్ వేశారు. ఈ నెల 17న హెచ్‌సీఏ ఎన్నికలు జరుగుతాయి.
హైదరాబాద్ మళ్లీ వెలగాలి...
తాను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైతే క్రికెటేతర అంశాలు కాకుండా కేవలం ఆటపైనే దృష్టి పెడతానని అజహర్ అన్నారు. చాలా కాలంగా ఇక్కడ క్రికెట్‌కే ప్రాధాన్యత దక్కడం లేదని, పరిస్థితిని మార్చేందుకే తాను పరిపాలనలోకి అడుగు పెడుతున్నట్లు ఆయన చెప్పారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్ క్రికెట్ ప్రస్తుతం గందరగోళ పరిస్థితుల్లో ఉంది. నేను క్రికెట్‌కు సేవ చేద్దామనుకుంటున్నాను. హెచ్‌సీఏలో అవినీతి కారణంగా ఆటను పట్టించుకోవడం లేదు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో కూడా క్రికెట్ అభివృద్ధి కావాలనేదే నా కోరిక’ అని అజహర్ వ్యాఖ్యానించారు. ఇక్కడి నుంచి ముగ్గురు క్రికెటర్లు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోకుండా హెచ్‌సీఏ ఆపలేకపోయిందన్న అజ్జూ, టెస్టు నిర్వహించేందుకు హెచ్‌సీఏ వద్ద నిధులు లేవంటూ వచ్చిన వార్తల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘బోర్డు భారీగా ఇచ్చే నిధులు ఏమయ్యాయో తెలీదు. ఇక్కడ బంధుప్రీతి కూడా చాలా ఎక్కువగా ఉంది. అండర్–14 జట్టులో కూడా ప్రతీ మ్యాచ్‌కు ఆరుగురిని మార్చడం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పుడిదంతా గతం కావాలి. నేను మార్పు తీసుకొస్తా’ అని ఈ మాజీ కెప్టెన్ స్పష్టం చేశారు.
బీసీసీఐ అంగీకరిస్తుందా?
అజహర్ నామినేషన్ అనగానే ముందుగా చర్చకు వచ్చిన అంశం అతనిపై కొనసాగుతున్న నిషేధం. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో 2000లో అతడిపై బోర్డు నిషేధం విధించింది. 2012లో అది చెల్లదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చినా, బోర్డు మాత్రం నిషేధం ఎత్తివేతపై స్పష్టత ఇవ్వలేదు. కొన్ని బోర్డు కార్యక్రమాలకు అజహర్‌ను ఆహ్వానించినా, గత ఏడాది రంజీ ట్రోఫీ సందర్భంగా ఢిల్లీలో కొంత మంది క్రికెటర్లు అజహర్‌ను కలవడంతో గట్టిగా మందలించింది కూడా. కాబట్టి అజహర్ భవిష్యత్తు కార్యకలాపాలకు బోర్డు వంద శాతం ఆమోదముద్ర వేయలేదనేది తెలుస్తోంది. అయితే నాటి కోర్టు తీర్పును బోర్డు సవాల్ చేయకపోవడమే నిషేధం తొలగినట్లుగా అతని సన్నిహితులు చెబుతున్నారు. ‘హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో బోర్డు నిషేధం అంశం అడ్డు రాదని నమ్ముతున్నా. నాలుగేళ్ల క్రితమే కోర్టు నిషేధాన్ని తొలగించింది కాబట్టి సమస్య లేదు’ అని అజహర్ దీనిపై స్వయంగా వివరణ ఇచ్చారు. అయితే అజహర్ అర్హతపై స్పష్టత కోరుతూ హెచ్‌సీఏ కార్యదర్శి జాన్ మనోజ్, లోధా కమిటీకి లేఖ రాయగా, ఇంకా వారి నుంచి స్పందన రాలేదు.
అర్హత ఉందా?
నిషేధం అంశాన్ని పక్కన పెడితే మరోవైపు ఎన్నికలకు సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలు కూడా అజహర్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. హెచ్‌సీఏ నియమావళి ప్రకారం అధ్యక్ష పదవికి ముందు సదరు వ్యక్తి ఈసీ సభ్యుడిగా, ఆఫీస్ బేరర్‌గా పని చేసి ఉండాలి. తాను ఏ క్లబ్ తరఫున నామినేషన్ దాఖలు చేస్తున్నాడో అక్కడి నుంచి అతనికి ఓటు హక్కు ఉండాలి. ఓటర్ల జాబితాకు ఈనెల 8 ఆఖరు తేదీ కాగా... అప్పటికి అజహర్ ఓటర్‌గా నమోదు చేయించుకోకపోగా, సదరు నేషనల్ క్లబ్ నుంచి ఓటరుగా మరో వ్యక్తి పేరు అప్పటికే ఉంది. లోధా సంస్కరణలతో ఇటీవలే పదవి కోల్పోయిన అర్షద్ అయూబ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే లోధా కమిటీ సిఫారసులు అమలు చేయడంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ పాత నిబంధనలన్నీ చెల్లకుండా పోతాయని, మాజీ ఆటగాళ్లు నేరుగా పోటీ పడవచ్చనే నిబంధనతోనే అజహర్ ముందుకు వచ్చినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. అయితే సుప్రీం ఆదేశించిన విధంగా ముఖ్యమైన తొమ్మిది అంశాలు మినహా రాష్ట్ర సంఘాలు నియమావళి ఒక్కసారిగా మారిపోదని, వాటిని అమలు చేస్తూనే తమ సొంత నియమావళిని పాటించవచ్చని అయూబ్ చెబుతున్నారు.
ఎన్నికలు జరిగేనా?
ఒకవైపు ఇంత హడావిడి సాగుతుండగా అసలు ఈ నెల 17న ఎన్నికలు జరగడమే సందేహంగా మారింది. ఈ ఎన్నికను నిలిపేయాలంటూ హెచ్‌సీఏ కార్యదర్శి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ఎలక్టోరల్ అధికారి నియామకం నుంచి ఈసీ సమావేశం నిర్వహణ, ఓటర్ల జాబితా వెల్లడి తదితర అంశాలన్నింటిలో సుప్రీం నిబంధనలు ఉల్లంఘనకు గురవుతున్నాయి. అందుకే ఎన్నికలు ఆపమని కోరుతున్నాం’ అని జాన్ చెప్పారు. వాస్తవానికి డిసెంబర్ 23న రంగారెడ్డి ఐదో అడిషనల్ చీఫ్ జడ్జి ఉత్తర్వుల మేరకు ఈ ఎన్నిక జరిపేందుకు హెచ్‌సీఏ సిద్ధమైంది. కానీ ఆ తర్వాత జనవరి 2న సుప్రీం కోర్టు తీర్పు రావడంతో పరిస్థితులు మారిపోయాయి. ఈ నెల 19న సుప్రీం కోర్టు బోర్డులో కొత్త అధికారులను నియమించనుంది. ఆ తర్వాతే రాష్ట్ర సంఘాలు ఏం చేయాలనే దానిపై స్పష్టత వస్తుందని, ఆలోగా ఎన్నికలు జరపడం నిబంధనలకు విరుద్ధమని ఒక వర్గం వాదిస్తోంది. తాజా పిటిషన్ నేడు (బుధవారం) విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పిటిషన్ వేసిన జాన్ మనోజ్ మాత్రం తన వర్గంతో సహా ముందు జాగ్రత్తగా నామినేషన్లు కూడా దాఖలు చేయడం విశేషం!