నేడు తుపాను సాయం రూ.1,000 కోట్లు విడుదల
న్యూఢిల్లీ: హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.1,000 కోట్లను కేంద్రం బుధవారం విడుదల చేయనున్నట్టు సమాచారం. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) నుంచి ఈ నిధులు విడుదల చేస్తున్నట్టుగా సమాచారం అందిందని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో భేటీ అనంతరం టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడుతో కలిసి ఏపీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వాల మాదిరి కాకుండా ప్రధాని హామీ మేరకు రూ.1,000 కోట్ల సాయం వెంటనే విడుదల కానుండడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.
తక్షణ సహాయక చర్యలకు ఈ నిధులను కేటాయిస్తారని కంభంపాటి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రిని కలిశామని, నష్టపోయిన రైతులకు సహాయంతో పాటు పంటల బీమా అందేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు వచ్చిన వెంటనే కేంద్ర బృందాలను పంపుతామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. తుపాను కారణంగా ్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు.