అనుమతులు వస్తే వెబ్సైట్లో ఏదీ?
- ఏపీ ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించిన ఎన్జీటీ
- రాజధానికి అనుమతుల పత్రాన్ని వెంటనే వెబ్సైట్లో ఉంచాలని ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు వచ్చాయని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఘాటుగా ప్రశ్నించింది. వాటిని వెంటనే వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా అమరావతి ప్రాజెక్టులో నిర్మాణాలు, చదును పనులు చేపట్టరాదన్న ఎన్జీటీ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని దాఖలైన కోర్టు ధిక్కారణ పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. వారం రోజుల్లో జవాబు చెప్పాలని ఆదేశించింది.
అమరావతి నిర్మాణం వల్ల పర్యావరణానికి ముప్పు ఉందని వివిధ అంశాలను లేవనెత్తుతూ కృష్ణా జిల్లా వాసి పండలనేని శ్రీమన్నారాయణ గతంలో ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అక్టోబర్ 10న విచారణ జరిగిన సందర్భంలో ఎన్జీటీ.. ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, చదును చేసే కార్యక్రమాలు కూడా చేయరాదని ఆదేశించింది. విచారణ అనంతరం కొద్దిరోజులకు ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ (సియా) అనుమతి ఇచ్చిందని చెబుతూ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. ఇది అవాస్తవమని కోర్టు ధిక్కారణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషనర్ గురువారం మరో పిటిషన్ దాఖలు చేశారు.ఇవి గురువారం జస్టిస్ యూడీ సాల్వీ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి.
పిటిషనర్ తరపు న్యాయవాదులు సంజయ్ ఫారిఖ్, పారుల్గుప్తా, కె.శ్రవణ్‌కుమార్ తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి జస్టిస్ సాల్వీ ‘అనుమతుల ప్రతి ఇవ్వడానికి మీకొచ్చిన ఇబ్బందేమిటి? అనుమతుల కాపీ లేకుండా అనుమతులు వచ్చాయంటే ఎలా? కాపీ ఇవ్వనప్పుడు మీపై చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్టే కదా?’ అని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాదులు గురుకృష్ణకుమార్, గంగూలీ, గుంటూరు ప్రభాకర్ సమాధానమిస్తూ సాంకేతిక సమస్య వల్లే వెబ్సైట్లో పొందుపరచలేకపోయామని చెప్పారు.
శుక్రవారం నాటికి వెబ్సైట్లో పొందుపరుస్తామని విన్నవించారు. న్యాయమూర్తి అనుమతిం చారు.తమ స్పందనకు సమయం కావాలన్న కేంద్ర పర్యావరణశాఖ విజ్ఞప్తి మేరకు వచ్చే సోమవారం వరకు సమయం ఇచ్చారు. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు.